japanese researchers
-
పురాతన మనిషికి, మనకు మధ్య ‘డ్రాగన్ మ్యాన్’
ఆరేడు అడుగులకుపైనే ఎత్తు.. పెద్ద పెద్ద కళ్లు.. పెద్ద మెదడు.. బలమైన శరీరం.. అతనో ‘డ్రాగన్ మ్యాన్’. ఇప్పుడున్నట్టు పూర్తి స్థాయి మనిషి కాదు.. అలాగని ఒకనాటి అడవి జీవి వంటివాడూ కాదు. మనకు, పురాతన మానవులకు మధ్యలో వారధి అతడు. మొదట్లో మనుషులు ఎలా ఉండేవారు? ఏం చేసే వారు అన్న దానిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు సినిమాటిక్‌గా దొరికాడు. ఈ ‘డ్రాగన్ మ్యాన్’ విశేషాలు ఏంటో తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ‘డ్రాగన్ మ్యాన్’ వెనుక చాలా కథ ఉంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్లో చరిత్ర ఉంది. 1933లో చైనాలో చాలా భాగం జపాన్ ఆక్రమణలో ఉండేది. జపాన్ పరిశోధకులు చైనా ఉత్తర ప్రాంతంలో హేలోంగ్ జియాంగ్ ప్రావిన్స్‌లోని హర్బిన్ పట్టణం వద్ద పురావస్తు తవ్వకాలు చేపట్టారు. చైనాకు చెందిన ఒకాయన (పేరును వెల్లడించలేదు)ను లేబర్ కాంట్రాక్టర్‌గా పెట్టుకున్నారు. ఆయన స్థానిక పనివాళ్లను తెచ్చుకుని తవ్వకాలు జరిపేవాడు. ఈ సందర్భంగా ఓసారి పురాతన పుర్రె ఒకటి బయటపడింది. ఆక్రమణదారులకు దానిని ఇవ్వడం ఇష్టం లేని చైనా కాంట్రాక్టర్.. పుర్రెను తీసుకెళ్లి ఓ పాడుబడ్డ బావిలో పాతిపెట్టాడు. సంపదను అలా పాతి దాచుకోవడం చైనాలో ఓ సాంప్రదాయం. అలా ఆ పుర్రె 85 ఏళ్లు బావిలోనే ఉండిపోయింది. ఆయన చనిపోయే ముందు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దాంతో వారు ‘నిధి’ వేటకు బయలుదేరారు. చాలా ఏళ్లు గడిచిపోవడంతో.. ఆయన చెప్పిన ఆనవాళ్లను, మారిన పరిస్థితులను లింక్ చేసుకుంటూ వెతకడం మొదలుపెట్టారు. చివరికి 2018లో ఆ పుర్రెను తవ్వి తీశారు. కొద్దిరోజుల తర్వాత చైనాలోని హెబీ జియో యూనివర్సిటీ మ్యూజియానికి అందజేశారు. పుర్రె ‘చరిత్ర’ను తెలుసుకున్న అధికారులు.. శాస్త్రవేత్తలకు సమాచారం ఇవ్వడంతో దాని ప్రాధాన్యత ఏమిటో బయటపడింది. పెద్ద కనుబొమ్మలు.. పెద్ద మెదడు కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులు తెచ్చిన పుర్రెను చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా గుర్తించని కొత్త జాతికి చెందినదని తేల్చి పరిశోధన చేపట్టారు. మానవ జాతికి చాలా దగ్గరి పోలికలు ఉన్నట్టు గుర్తించారు. ఈ జాతికి ‘హోమో లోంగి’అని.. ముద్దుగా ‘డ్రాగన్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త క్రిస్ స్ట్రింగర్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘మానవ జాతికి పూర్వీకులుగా ఇప్పటివరకు భావిస్తున్న అన్ని జాతుల్లోనూ మెదడు, కళ్లు బాగా చిన్నగా ఉంటాయి. కానీ ఈ కొత్త జాతిలో మెదడు ఆధునిక మానవుల కంటే కాస్త పెద్దగా ఉంది. కళ్లు, ముక్కు, దవడలు, దంతాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముఖం ఎత్తు తక్కువగా, వెడల్పు ఎక్కువగా ఉంది. దవడ ఎముకల నిర్మాణం కూడా ఆధునిక మానవుల తరహాలో ఉంది. తల నిర్మాణాన్ని బట్టి ఆరేడు అడుగుల ఎత్తుతో, బలిష్టమైన శరీరంతో ఉండి ఉండొచ్చు. అయితే కనుబొమ్మల ప్రాంతంలో పుర్రె ఉబ్బెత్తుగా ఉంది. ఇది చాలా విచిత్రం. అది వానరాల నుంచి మనుషులు అభివృద్ధి చెందడం మొదలైన పురాతన కాలం నాటి లక్షణం’’ అని తెలిపారు. ఎవరీ డ్రాగన్ మ్యాన్..? ఈ డ్రాగన్ మ్యాన్ పుర్రెను కార్బన్ డేటింగ్ ద్వారా పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అది లక్షా 46 వేల సంవత్సరాల కిందటిదని తేల్చారు. సుమారు 50 ఏళ్ల వయసులో మరణించిన మగవాడి పుర్రెగా అంచనా వేశారు. ఆధునిక మానవులకు సంబంధించిన లక్షణాలు కొన్ని ఉండటంతోపాటు ప్రిమిటివ్స్ (కోతులు, చింపాంజీల వంటి మూల జాతుల) లక్షణాలు కూడా ‘డ్రాగన్ మ్యాన్’ పుర్రెలో గుర్తించారు. ఈ జాతివారు జంతువులను, పక్షులను వేటాడేవారని, పండ్లు, కూరగాయలను కూడా ఆహారంగా తీసుకునే వారని పరిశోధనలో పాల్గొన్న హెబీ జియో యూనివర్సిటీ శాస్త్రవేత్త క్సిజెన్ ని వెల్లడించారు. పుర్రె దొరికిన ప్రాంతం, పరిస్థితుల ఆధారంగా చూస్తే.. ఈ జాతివాళ్లు కఠినమైన, చలి ఎక్కువగా ఉండే వాతావరణాన్ని కూడా తట్టుకునే వారని అంచనా వేస్తున్నామన్నారు. ఇన్నాళ్లూ మనుషులకు సోదర జాతి నియండెర్తల్ మానవులే అన్న అంచనాలు ఉన్నాయని.. ఇప్పుడీ డ్రాగన్ మ్యాన్ వల్ల మానవ జాతి పరిణామక్రమంలో మార్పులు చేయాల్సి రానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులంతా కూడా హోమో సెపియన్స్ అనే ఆధునిక జాతికి చెందినవారని వివరించారు. పరిణామక్రమంలో సుమారు 70 లక్షల ఏళ్లనాటి నుంచి 40 వేల ఏళ్ల కిందటి వరకు సుమారు 21 జాతుల మానవులు జీవించారని తెలిపారు. -
ఫారెస్ట్ బేతింగ్తో సంపూర్ణ ఆరోగ్యం
పచ్చని చెట్ల కింద నడిచినా, పరుగెత్తినా, సేదతీరినా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. కాలుష్యాన్ని పీల్చుకొని చెట్లు ప్రాణవాయువు ఆక్సిజన్‌ను వదలడమే అందుకు కారణమని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు. వాస్తవానికి పచ్చటి చెట్లతో ఆక్సిజన్ ప్రయోజనం ఒక్కటే కాదు. మన ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి తోడ్పడే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. చెట్ల కింద గడిపితే మనుషుల బీపీ అదుపులో ఉంటుంది. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. మానవుడికి కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. భారతీయులకు ఆయుర్వేదం రూపంలో ప్రకృతి చికిత్స ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నట్టే జపనీయులకు ఎకో థెరపీ అందుబాటులో ఉంది. ఎకోథెరపీ అంటే పచ్చనిచెట్ల మధ్య గడపడం. దీన్ని జపనీయులు ‘ఫారెస్ట్ బేతింగ్’ అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 150 ఏళ్ల క్రితం నుంచి అంటే, 1854 నుంచే అమల్లో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ బేతింగ్ను జపాన్ ప్రభుత్వం 1982 నుంచి తమ ‘జాతీయ ప్రభుత్వ వైద్య కార్యక్రమం’లో భాగం చేసింది. చెట్లకు, మనుషుల ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటో ఇంతకాలానికి పరిశోధకులు కనుగొనగలిగారు. చెట్ల మధ్య నుంచి వచ్చే గాలిలో కాలుష్యం లేకపోవడమే కాకుండా ‘పైటోన్‌సైడ్’ అనే రసాయన మిశ్రమం ఉంటుంది. బ్యాక్టీరియా, క్రిములు దగ్గరికి రాకుండా తమను తాము రక్షించుకునేందుకు చెట్లు పైటోన్సైడ్ను విడుదల చేస్తాయి. దాన్ని మనుషులు పీల్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. మానవ శరీరంలోని కణాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడు ఆ బ్యాక్టీరియాను చంపేసేందుకు కొన్ని కణాలు పోరాటం చేస్తాయి. వాటిని ‘నేచురల్ కిల్లర్స్’ అని కూడా వ్యవహరిస్తారు. అడవికి బయట ఉన్నప్పుటి కంటే మనుషులు అడవిలో ఉన్నప్పుడు వారిలోని నేచురల్ కిల్లర్స్ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు కూడా పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్ లాంటి ట్యూమర్లు ఏర్పడకుండా కూడా ఈ సెల్స్ పనిచేస్తాయి. 2004 - 2012 మధ్య జపాన్ వైద్యాధికారులు 40 లక్షల డాలర్లను వెచ్చించి మానవుల ఆరోగ్యంపైన, మనస్సుపైన ఫారెస్ట్ బేతింగ్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపై విస్త్రృత అధ్యయనాలు జరిపారు. వారు ఈ అధ్యయనంలో భాగంగా 48 థెరపీ ట్రయల్స్‌ను జరిపారు. అడవిలో కనీసం రెండు గంటలు తగ్గకుండా ఉన్నప్పుడే ప్రయోజనం కలుగుతుందని వారి ట్రయల్స్‌లో తేలింది. నడక సాగించడమో, పరుగెత్తడమో చేయాల్సిన అవసరం కూడా లేదని, చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటూ గుండెల నిండా స్వచ్ఛమైన అక్కడి గాలి పీల్చుకుంటే చాలని కూడా వారి అధ్యయనాల్లో తేలింది. మొక్కలు బ్యాక్టీరియా నుంచి, క్రిముల నుంచి తమను తాము రక్షించుకోవడానికి విడుదల చేస్తున్న ‘పైటోన్‌సైడ్’ వల్లనే మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నది తాజా పరిశోధనల సారాంశం. ఇప్పుడు ఫారెస్ట్ థెరపీ అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా విస్తరించింది. ఇప్పుడక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫారెస్ట్ బేతింగ్ గైడ్లు కూడా ఉన్నారు. కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్న ప్రజలు వారాంతంలో ఆరోగ్యం కోసం అడవుల దారులు పట్టడం మంచిది. -
30 నిమిషాల్లో ఎబోలా వైరస్ గుర్తింపు
టోక్యో: శరీరంలో ప్రాణాంతక ఎబోలా వైరస్ జాడను కేవలం 30 నిమిషాల్లో గుర్తించే నూతన పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేసినట్లు జపాన్ పరిశోధకులు ఈరోజు తెలిపారు. ఈ వ్యాధి సోకి పశ్చిమ ఆఫ్రికాలో 15 వందల మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రోగులకు వైద్యులు సత్వర చికిత్స అందించడంలో తమ పరిశోధన ఉపయోగపడుతుందని నాగసాకి యూనివర్సిటీలోని పరిశోధక బృందం ప్రొఫెసర్ జిరో యసూడా చెప్పారు. ప్రస్తుత విధానంలో వైరస్‌ను గుర్తించే పరీక్షలకు దాదాపు రెండు గంటల సమయం పడుతోందని తెలిపారు. తాము అభివృద్ధి చేసిన పరీక్షా విధానంలో ఈ ప్రక్రియ అరగంటలోగా ముగుస్తుందని వివరించారు. ప్రస్తుతం పరీక్షలకు ఖరీదైన పరికరాలను వాడవలసి ఉందని, తమ ప్రక్రియ చాలా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చని యసూడా తెలిపారు. **