చెట్టు అనేది ఎంత గొప్పది... ఒక మొక్క నాటడం, దానికి నీళ్ళు పోయడం, చెట్టయ్యేదాకా దానిని సంరక్షించడం... అది చెట్టుగా మారిననాడు అది నాటినవాడికి, పెంచినవాడికి, సంరక్షించినవాడికి ఎంత ఫలితం లభిస్తుందనే దానికి మన శాస్త్రాలు ఏమని చెబుతున్నాయంటే... లోకంలో శరీరం కలిగిన ప్రాణులు ఎన్నో ఉన్నాయి. మనుష్యులే కానక్కరలేదు. శరీరం ఉన్న ప్రతి ప్రాణికీ దాని పోషణకు ఆహారం కావాలి. అది సమయానికి పడకపోతే ఆకలికి విలవిల్లాడిపోతాయి.
ఆకలి గొప్ప బాధ.. క్షుత్ అగ్ని.. అది అగ్నిహోత్రం, మంట. ఆ మంట తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. ఆకలేస్తే మొదట ఏది పోతుంది... ధర్మం. ఆకలేసిన వాడికి ధర్మ విచక్షణ ఉండదు. అయ్యా! నా ప్రాణం పోయినా సరే ధర్మాన్ని కాపాడతాను, ఏదీ దొంగిలించను అనడు కదా ! చివరకు తెగించి దొంగతనానికి పాల్పడి అయినా ఆ బాధ తీర్చుకుంటాడు. ఆ మంట అటువంటిది. దహించి వేస్తుంది. అందుకే ఆకలి అన్నది ఎక్కడా ఉండడానికి వీల్లేదు. మనుష్యులకే కాదు, సమస్త ప్రాణులకూ ఆహారం కావాలి. పక్షులు, జంతువులు, క్రిమికీటకాదులు... ఆకలితో ఉన్న మనుష్యులకు వారి ఆర్తిని చూసి జాలిపడి ఎవరయినా ఆహారమిస్తారు.. వీటి ఆకలి ఎవరు తీరుస్తారు?
చెట్టు. దానికి కాండం ఉంటుంది, ఆకులు ఉంటాయి, పూలు ఉంటాయి, కాయలు, పళ్ళను కూడా ఇస్తుంది. దానిని ఆశ్రయించి మనుష్యులే కాదు, క్రిమికీటకాదులు, జంతువులు, పక్షులు తమ ఆకలిని తీర్చుకుంటాయి. దాని బెరడులో చేరిన వందలాది క్రిములు వాటి ఆకలిని అక్కడ తీర్చుకొంటాయి. జంతువులు ఆకులు తింటాయి. పక్షులు గూళ్ళు కట్టుకోవడమే కాక కాయలు, పండ్లు తింటాయి. కొన్ని చిగుళ్ళను తింటాయి. ఎన్నో రెక్కల పురుగులు దాని పూలమీద వాలి ఆకలి తీర్చుకుంటాయి. రాలిన కొమ్మలు, ఆకులు, పూలు, పండ్లు భూమిలో కలిసి అక్కడున్న ఎన్నో పురుగులకు ఆహారమవుతాయి. ఒక చెట్టు... ఒక్క చెట్టే ఇన్నింటికి జీవాధారమవుతున్నది.
మొక్కనాటిన వాడు, చెట్టుగా చేసినవాడు తరువాత కాలంలో శరీరాన్ని వదిలివేయవచ్చు గాక. కానీ అసంఖ్యాకమైన జీవులకు కేవలం ఆకలి తీర్చడమే కాక, వాటి ప్రాణాలను కూడా నిలబెట్టాడు, ఎన్నో జీవులు సేదదీరడానికి కారణమయ్యాడు. చెట్టు ప్రాణవాయువు వదులుతుంది. ప్రకృతి సమతౌల్యతను కాపాడుతుంది. అది మనుష్యులతోపాటూ అనేక జీవులకు ప్రాణాధారంగా నిలబడుతుంది. అటువంటి మంచి పనికి కారణమయ్యాడు కనుక వాడికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. వారి శరీరం పతనమయిన తరువాత దేవతలు స్వాగతం పలికి వారిని ఉన్నత లోకాలకు తీసుకువెడతారట. అంతేకాదు ఎన్నో ప్రాణులకు కొన్ని సంవత్సరాల పాటు ఆకలిబాధ తీర్చాడు కనుక వారిని మేం సేవిస్తాం అని దేవతలు అంటారట. చెట్లను పెంచే పనిని ప్రోత్సహించడానికి, మనుషులు తమకే కాకుండా సమస్త జీవకోటిపట్ల బాధ్యతాయుతంగా మెలగడానికి, ప్రకృతి సమతుల్యత కాపాడేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన పూర్వీకులు‘‘యావంతి ఖాసంతి ఫలాని వృక్షాత్ క్షుద్వహ్ని దగ్ధా ...’’ అంటూ ఒక శ్లోకం ద్వారా చేసిన ధర్మబోధ ఇది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment