ప్రపంచంలో అధికశాతం మంది జీవితంలో వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించి, సుఖంగా జీవించాలని కలలు కంటారు. పేదరికంలో మగ్గిపోవాలని ఎవరూ కోరుకోరు. ఉన్నత చదువులు చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తూ, అధికంగా సంపాదించగలిగే అర్హత కలిగిన ఒక వ్యక్తి భిన్నమైన నిర్ణయం తీసుకుని, ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
ఈ కథ యునైటెడ్ కింగ్‌డమ్ నివాసి మార్క్ బాయిల్‌కి సంబంధించినది. 2008లోనే బాయిల్ డబ్బును వినియోగించడం మానుకుని ఆనందంగా కాలం వెళ్లదీస్తున్నాడు. సాంకేతికతలాంటి విషయాల జోలికి వెళ్లకుండా ప్రకృతితో మమేకమై జీవించడాన్ని అలవర్చుకున్నాడు. మార్క్ బాయిల్.. బిజినెస్ అండ్ ఎకనామిక్స్‌లో డిగ్రీ తీసుకున్నాడు. చదువు పూర్తయిన వెంటనే బ్రిస్టల్‌లోని ఒక ఫుడ్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం సంపాదించాడు. జీవితంలో విజయం సాధించేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డాడు.
అయితే 2007లో ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా జరిగిన సంఘటన బాయిల్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసింది. హౌస్‌బోట్‌లో కూర్చున్న బాయిల్ అక్కడున్నవారు మాట్లాడుకున్న మాటలను విన్నాడు. అందరూ డబ్బు గురించే మాట్లాడుకుంటున్నారు. దీంతో అన్ని సమస్యలకు ఏకైక మూలం డబ్బు అని బాయిల్ గ్రహించాడు.
అందుకే తాను డబ్బుకు అతీతంగా జీవించాలని, డబ్బు సంపాదించకూడదని, అలాగే ఖర్చు పెట్టకూడదని కఠినంగా నిర్ణయించుకున్నాడు. దీంతో మార్క్ బాయల్ తన ఖరీదైన హౌస్‌బోట్‌ను విక్రయించి, తన పాత కారవాన్‌లో నివసించడం మొదలుపెట్టాడు. డబ్బు లేకుండా జీవితాన్ని గడపసాగాడు. ఈ నేపధ్యంలో కొన్ని నెలలు పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. టీ, కాఫీలతో పాటు ఇతర సౌకర్యాలను వదులుకున్నాడు. ప్రకృతి అందించేవాటిని మాత్రమే ఉపయోగించసాగాడు.
ఇటువంటి ప్రకృతి సహజ జీవనం ప్రారంభించినప్పటి నుంచి తాను అనారోగ్యం బారిన పడలేదని, తనకు ఆరోగ్య రక్షణ అవసరం లేదని బాయిల్ తెలిపాడు. బాయిల్ జీవితాన్ని చూసిన చాలామంది అతనికి స్నేహితులుగా మారారు. తాను 2017లో టెక్నాలజీ జోలికి వెళ్లడాన్ని పూర్తిగా వదులుకున్నానని, సాంకేతికతతో ముడిపడిన పాత జీవితం కాకుండా, సహజసిద్దంగా ప్రకృతితో గడిపే భావి జీవితం గురించి నిరంతరం ఆలోచిస్తుంటానని బాయిల్ తెలిపాడు.
ఇది కూడా చదవండి: ఎస్క్‌లేటర్‌పై నిషేధమున్న నగరం ఏది? గణాంకాలు ఎందుకు బెంబేలెత్తిస్తున్నాయి?
Comments
Please login to add a commentAdd a comment