క్రౌర్యాసురులు | Cruel humans | Sakshi
Sakshi News home page

క్రౌర్యాసురులు

Published Sun, Nov 8 2015 12:22 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

క్రౌర్యాసురులు - Sakshi

క్రౌర్యాసురులు

సోల్ / క్రౌర్యం
మనుషుల్లో మెజారిటీ జనాలు క్రూరంగా, పరమఘోరంగా ఉంటారు. లోకంలో కొందరిపై అయాచితంగానే ‘శాంతిదూత’లుగా ముద్రపడి పోతుంది. అలాంటి వాళ్లలోనూ ఎంతో కొంత క్రౌర్యం ఉంటుంది. చరిత్రను తరచి చూస్తే అలాంటి శాంతిదూతల క్రౌర్యానికి చాలా ఆధారాలే లభిస్తాయి. మనుషులు శాంతియుతంగా ఉండాలేనేది ఈ ప్రపంచంలో అనాది ఆదర్శం. ప్రాంత, కాలాలకు అతీతంగా మానవ సమాజాల్లో ఇలాంటి ఆదర్శాలు చాలానే ఉన్నాయి గానీ, సహజ లక్షణాలెప్పుడూ ఆదర్శాలకు భిన్నంగానే ఉంటాయి. క్రౌర్యం కూడా అలాంటి సహజ లక్షణమే.

భౌతికంగా హింసించడం మాత్రమే క్రౌర్యం కాదు. పరమ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ కూడా క్రూర కర్మలకు తెగబడే కర్మసిద్ధాంతులు ప్రపంచం నలుమూలలా ఉంటారు. అహింసా సిద్ధాంతాన్ని అక్షరాలా ఆచరిస్తున్నామంటూనే, ఎదుటివారిని దారుణంగా హింసించే ‘పరమహింస’లు ఉంటారు. ఎంతైనా క్రౌర్యం మానవ సహజ లక్షణం. పెద్దలు దీనిని అవలక్షణంగా పరిగణిస్తారు. ఎవరైనా బాహాటంగానే క్రౌర్యాన్ని ప్రదర్శిస్తే, వాళ్లను దుర్మార్గులుగా ఈసడిస్తారు. క్రౌర్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు, వాటి శాసనాలు శాయశక్తులా క్రూరమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అందువల్ల లోకమంతటా నిండి ఉన్న మానవ సహజ లక్షణమేదనే ప్రశ్న ఎదురైతే, ‘క్రౌర్యం’ అని ఠక్కున బదులివ్వవచ్చు.
 
అణచివేతే ఆదర్శం
‘క్రూర కర్మములు నేరక చేసితి... నేరములెంచకు రామా’ అంటూ భక్త రామదాసు పశ్చాత్తప్త హృదయంతో వగచి వాపోయాడు. అయితే, క్రూరమైన చేష్టలకు పాల్పడిన చాలామందిలో ఇలాంటి ఆత్మవిమర్శ తక్కువ. ఇలాంటి చేష్టలు తప్పు అని ఎవరైనా సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేస్తే, వాళ్ల పట్ల మరింత క్రౌర్యాన్ని ప్రదర్శిస్తారు. కొందరు తమ క్రౌర్యాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తారు. క్రౌర్య ప్రదర్శనలో వీళ్లకు ఎలాంటి శషభిషలు, మొహమాటాలూ ఉండవు. అణచివేతే వాళ్లు నమ్మిన సిద్ధాంతం.

నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టాలనేది కూడా లోకం మెచ్చిన ఆదర్శం. అయితే, బాహ్య క్రౌర్యప్రదర్శన సాగించే వాళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకునేందుకు వెనుకాడరు. ఇలాంటి వాళ్లు క్రమంగా ముదిరి నియంతలుగా ఎదుగుతారు. తమ ప్రాభవం కొనసాగినంత కాలం హింసరచన కొనసాగిస్తారు. హిట్లర్, ముసోలినీ, ఇడీ అమీన్ వంటి పేరుమోసిన నియంతలే కాదు, పోలీసులు, వీధిరౌడీలు కూడా తమ తమ అవకాశాల మేరకు, అధికారాల మేరకు నిస్సిగ్గుగా తమ క్రౌర్యాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తారు. ఇలాంటి వాళ్ల క్రౌర్యంలో భౌతిక హింస ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాళ్ల హింసాకాండకు నెత్తుటి ఆనవాళ్లు చరిత్ర నిండా దొరుకుతాయి.
 
పురాణాల్లో క్రౌర్యం
కొద్ది మినహాయింపులను వదిలేస్తే, పురాణాల్లోని రాక్షసులందరూ క్రూరులే. వాళ్లు తమ క్రౌర్యాన్ని ఏనాడూ దాచుకోలేదు. చరిత్రకెక్కిన నియంతల తరహాలోనే బాహాటంగానే ప్రదర్శించారు. నరకాసురుడనే వాడు జనాలకు ప్రత్యక్ష నరకాన్నే చవిచూపాడు. బకాసురుడు మనుషులనే భోంచేసేవాడు. ఇలాంటి రాక్షసులు మనకు చాలామందే తెలుసు. అలాగని దేవతలందరూ అహింసావాదులు కాదు. హింసాకాండను సాగించిన రాక్షసులను వాళ్లు హింసాత్మకంగానే వధించారు తప్ప శాంతివచనాలను వల్లించలేదు. అయితే, వేద పురాణాలు, మతగ్రంథాలు క్రౌర్యాన్ని మహాపాపంగా పరిగణించాయి.

ఎవరైనా సాటి మనుషుల పట్లే కాదు, మూగజీవులపై క్రౌర్యాన్ని ప్రదర్శించినా అలాంటి వాళ్లు నరకానికే పోతారని ఫలశ్రుతి చెప్పాయి. ఏ రకమైన క్రౌర్యానికి పాల్పడితే, అందుకు నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో భయానక, బీభత్సరసాలు ఉట్టిపడేలా వర్ణించాయి. ఇహలోకంలో క్రూరమైన చర్యలకు పాల్పడేవాళ్లు పరలోకంలో అంతకు మించిన క్రూరమైన శిక్షలే అనుభవించాల్సి వస్తుందనేది పురాణాల సారాంశం. ఇలాంటి పురాణాలన్నింటినీ కూలంకషంగా చదువుకున్న వారేమైనా తమ క్రౌర్యాన్ని విడనాడారా అంటే, లోకంలో అలాంటి దాఖలాలేవీ లేవు.
 
పిరికితనమే కారణం
క్రూరస్వభావాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ, ఎదుటి వాళ్లను హింసించేవాళ్లకు సామాన్యులు భయపడతారు. అధికార, ధనబలాలతో ఇలాంటి ఆగడాలను సాగించేవాళ్లకు ఎదురు చెప్పేందుకు సాహసించరు. ఎవరూ ఎదురుచెప్పలేరనే ధీమా వచ్చాక హింసరాజులు మరింత చెలరేగిపోతారు. ఇలాంటి హింసరాజులను జనం గొప్ప ధైర్యవంతులుగా భావిస్తారు గానీ, అది నిజం కాదు. పిరికిపందలే క్రూరులుగా మారుతారు. తమ లోలోపలి భయాలను అణచిపెట్టుకోవడానికి ఎదుటివారిపై నిష్కారణంగా హింసకు తెగబడతారు.

ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లకు డబ్బు, అధికారం తోడైతే మరింతగా పెట్రేగిపోతారు. ఎదుటివారు హింసను అనుభవిస్తుంటే చూస్తూ ఆనందిస్తుంటారు. ఇంకొందరు మరీ పిరికిపందలు ఉంటారు. తమ క్రౌర్యాన్ని బాహాటంగా ప్రదర్శించే ధైర్యం కూడా వీళ్లకు ఉండదు. ఇలాంటి వాళ్లు లోకంలో జరిగే హింసను మాటలతో ఖండిస్తూ ఉంటారు. నీతిచంద్రికలు వల్లిస్తూ, లోకంలో శాంతికాములుగా చలామణీ అవుతుంటారు. ఇలాంటి వాళ్లకు నేరుగా భౌతికహింసకు పాల్పడే ధైర్యం ఉండదు గానీ, తమను అంటిపెట్టుకుని ఉండే వెర్రిగొర్రెల్లాంటి వాళ్ల భావోద్వేగాలను ‘శాంతియుతం’గా రెచ్చగొడతారు.

రెచ్చిపోయిన వెర్రిగొర్రెలు ఊరుకోరు కదా! వాళ్లు హింసాకాండకు పాల్పడతారు. అలాంటి సందర్భాల్లో ఆ పాపం తమది కాదన్నట్లు మిన్నకుంటారు ఇలాంటి ‘శాంతికాముక’ క్రూరులు. వీళ్లెలాంటి వాళ్లంటే, తాబేలు వంటి సాధుజీవిని చంపడం పాపం అని చెబుతూనే, డిప్ప మీద కొడితే అది చావదు గానీ, తిరగేసి కొడితే చచ్చి ఊరుకుంటుందని చెప్పే రకం.
 
ఎందెందు వెదకి చూసిన...
క్రౌర్యం సర్వంతర్యామి. ‘ఎందెందు వెదకి చూసిన...’ అన్న రీతిలో ఎక్కడ చూసినా లోకంలో క్రౌర్యం లేని చోటే కనిపించదు. సామాన్యుల ఇళ్లల్లో సైతం భార్యలను భౌతికంగానో మానసికంగానో హింసించే భర్తలు, భర్తలను వేధించే భార్యలు, పిల్లలను వేధించే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను హింసించే పిల్లలు తారసపడుతూనే ఉంటారు. చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన బడుల్లో విద్యార్థులను హింసించే చండామార్కులు కనిపిస్తుంటారు.

న్యాయస్థానాల్లో కక్షిదారులను పీడించుకు తినే న్యాయవాదులు, ఆస్పత్రుల్లో రోగులను జలగల్లా పీల్చేసే వైద్యులు, ప్రతిపనికీ ప్రజల నుంచి లంచాలు పీక్కుతినే లంచావతారులు, సామాన్యులపై బలప్రయోగంతో తప్ప శాంతిభద్రతలను కాపాడలేని పోలీసులు, ఆఫీసుల్లో చిరుద్యోగులపై జులుం చలాయించే బాసులు, కాలేజీల్లో జూనియర్లను ర్యాగింగ్ చేసే సీనియర్లు, అమ్మాయిలపై యాసిడ్‌దాడులు సాగించే ప్రేమోన్మాదులు... చెప్పుకుంటూ పోతే ఇదంతా కొండవీటి చాంతాడంత జాబితా. నెత్తుటితో, కన్నీళ్లతో తడవని చోటు భూప్రపంచంలో ఎక్కడా కనిపించదు. క్రౌర్యం సర్వంతర్యామి అనేందుకు ఇంతకు మించిన రుజువేముంటుంది?
- పన్యాల జగనాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement