Cruel
-
అకృత్యం – దుష్కృత్యం
అకృత్యం, దుష్కృత్యం అనే రెండు పదాలని సమానార్థకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు సాధారణంగా. నిఘంటువు ననుసరించి రెండింటి మధ్య తేడా ఉన్నా వ్యవహారంలో మాత్రం సమానార్థకాలే. నిజానికి రెండు చేయకూడని పనులే. కాని రెండింటికీ మధ్య అతిసన్నని గీత వంటి తేడా ఉంది. కృత్యం అంటే చేయబడినది, పని అని అర్థం. అకృత్యం అనగానే వ్యతిరేకార్థం కనుక చేయబడనిది అని అర్థం చెప్పేస్తారు వ్యవహారజ్ఞానం తక్కువైన పండితులు. వ్యాకరణ రీత్యా ఆ విధంగా పదాన్ని సాధించవచ్చు. కాని దాని అర్థం మాత్రం చేయకూడని పని అని. చేయబడనిది అనే అర్థంలో అకృత్యం అనవలసి ఉంటుంది. దుష్కృత్యం అంటే చెడ్డపని. అకృత్యం అంటే చేయకూడని పని చేయటం వల్ల ఆ వ్యక్తికి నష్టం కలగ వచ్చు, కలగక పోవచ్చు. అది ఆ వ్యక్తి స్వభావాన్ని సూచిస్తుంది. కాని, దుష్కృత్యం అంటే చెడ్డపని వల్ల వ్యక్తికి ఇతరులకి, సమాజానికి కూడా హాని కలుగుతుంది. మానవుడు ఏ పని చేయకుండా కొద్దిసేపైనా ఉండలేడు. ఏమీ చేయటం లేదు అన్న వ్యక్తి కూడా ఆ క్షణం చేయటం లేదు అనే మాటని పలికాడు కదా! అది పనేగా! గాలి పీల్చటం, మానలేదుగా. ఆహారం తినటం, నీళ్ళు తాగటం ఆపలేదే. ఇవన్నీ ప్రయత్న పూర్వకంగా చేయటం లేదు. అసంకల్పిత చర్యలుగా సాగుతుంటాయి. కనక, నేను ఏమీ చేయటం లేదు అనటానికి వీలు లేదు. చేయటం తప్పనప్పుడు ఉపయోగ పడేది ఏదైనా చేయవచ్చు కదా! చేయాలని ఉండి, ఏం చేయాలో సరిగా తెలియక అనవసరమైన పనికిరాని పని చేయటం జరుగుతుంది. ఉద్దేశపూర్వకంగా చేయక పోయినా, సాధారణంగా చేయకూడని పని వల్ల ఏదో ఒక హాని ఉంటుంది. అందుకే దానిని చెడ్డపనితో సమానంగా భావించటం జరుగుతుంది. కాని, దుష్కృత్యం అంటే, ఉద్దేశపూర్వకంగా, కావాలని ఇతరులకి హాని కలగాలని చేసే పని. దుష్కృత్యం వెనుక దురుద్దేశం ఉంటుంది. కావాలని బాధించటానికి చేసే పని. క్రూరత్వం కాఠిన్యం ఉంటాయి. అది ఒకరకమైన మానసిక స్థితి. నలుగురు ఆనందం గా ఉంటే చూడలేక పోవటం, ఏడుస్తూ ఉంటే ఆనందించటం, ఏదైనా వ్యవస్థ సవ్యంగా నడుస్తూ ఉంటే చూడలేక పోవటం మొదలైన దుర్బుద్ధులు ఉన్నవారు చేసేవి ఈ పనులు. నలుగురు కలిసి ఏదో వేడుక జరుపుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని చూసి ఓర్వ లేక చెడగొట్టటానికి విధ్వంసకచర్యలు చేయటం దుష్కృత్యం కాదా! అదే సామర్థ్యాన్ని, తెలివితేటలని పదిమంది సంతోషానికి ఉపయోగించవచ్చు కదా! ఒక దేశం కాని జాతి గాని పురోగమిస్తున్నప్పుడు ప్రగతి నిరోధక వ్యవహారాలు, మాటలు, ప్రచారాలు దుష్కృత్యాలే. పరాయి దేశాలపై దండయాత్రలు, దోపిడీలు, దోచుకోటాలు చేయతగిన పనులా? ఒకరకంగా చూస్తే ఇవి మానసిక జాడ్యాలు అని చెప్పవచ్చు. పైశాచిక, రాక్షసానందాలు. మందులతో తగ్గకపోతే శస్త్రచికిత్స తప్పదు. సామదాన భేద దండోపాయాల్లో ఏదో ఒక దానితో అదుపు చేయవలసి ఉంటుంది. వ్యక్తిగతమైన కక్షలు, అసూయా ద్వేషాలతో చేసే హానికారకమైన పనుల నుండి, జాతి, మత విద్వేషాలతో చేసే దురాగతాల వరకు ఇటువంటివి మనకు ఎన్నో కనపడుతూ ఉంటాయి. సంఘవిద్రోహకచర్యలు, హత్యలు, అత్యాచారాలు మొదలైననవి అన్నీ దుష్కృత్యాలే. ఒక్కమాటలో చెప్పాలంటే పాపకృత్యాలు అని చెప్పవచ్చు. పాపం అన్న దానికి కూడా చక్కని నిర్వచనం ఇచ్చారు పెద్దలు. ‘‘..పాపాయ పరపీడనం..’’ అని. ఇతరులని బాధించటమే పాపం. అందులోనూ కావాలని బాధించటం. అనుకోకుండా తాము చేసిన పని వల్ల ఇతరులకి బాధ కలిగితే అది పొరపాటు అవుతుంది కాని, దుష్కృత్యం అవదు. దానిని సరి చేసుకునే అవకాశం ఉంటుంది. – డా. ఎన్. అనంత లక్ష్మి -
14 ఏళ్ల టీనేజర్‌కి నగర బహిష్కరణ... మూడేళ్ల వరకు నిషేధం
ఇదివరకు పూర్వం గ్రామంలో ఎవరైన దారుణమైన పనులు చేస్తే గ్రామపెద్దలు గ్రామ బహిష్కరణ వంటి శిక్షలు వేసేవారు. అదీకూడా అలాంటి పనులు మరెవరు చేయకూడదని అలాంటి శిక్షలు విధించేవారు. రాను రాను అవి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందిగా ఉండటమే కాకుండా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కనుమరుగైపోయాయి. ఇంతలా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ స్మార్ట్ యుగంలో కూడా నగర బహిష్కరణలు ఉన్నాయంటే నమ్ముతారా!. ఔను నిజం ఒక దేశంలోని టీనేజర్ని ఒక నగరం మొత్తం బహిష్కరించింది. ఎందుకు బహిష్కిరించారు ఏం జరిగిందనే కదా. వివరాల్లోకెళ్తే....యూకే చెందిన 14 ఏళ్ల కీలాన్ ఎవాన్స్ని ఒక పట్టణం మొత్తం బహిష్కరించింది. కీలాన్ యూకేలోని వెస్ట్ మెర్సియా అనే పట్టణంలో నివశిస్తున్నాడు. ఐతే అతను ఆ పట్టణంలోని వ్యాపారులను, స్థానికులను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఆన్లైన్లో కూడా చాలా మందిని పలు రకాలుగా వేధించాడు. దీంతో ఆ టీనేజర్‌పై చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు వెస్ట్ మెర్సియా పోలీసులు అతనిపై చర్యలు తీసుకోవడమే కాకుండా అదుపులోకి తీసుకుని అరెస్టు కూడా చేశారు. అంతేకాదు యూకేలోని కోర్టు అతని క్రిమినల్ బిహేవియర్ కారణంగా అతను పట్టణంలో ఉండకుండా నిషేధిస్తున్నట్లు తెలిపింది. అతను 2025 వరకు కూడా పట్టణంలోకి ప్రవేశించకూడదని చెప్పింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తుల సముహంలో కూడా ఉండకూడదని కూడా పేర్కొంది. ఎప్పుడైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమాన ఎదుర్కొవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ శిక్షలు అతను భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పనులు చేయకుండ ఉండేందుకేనని కోర్టు స్పష్టం చేసింది. ఐతే యూకేలో యువకులపై ఇలాంటి శిక్షలు చాలా అసాధారణం. కానీ కీలాన్ దారుణమైన ప్రవర్తన కారణంగానే యూకే ఇలాంటి శిక్షలు విధించింది. (చదవండి: రైల్వే ఫ్లాట్ ఫారం పై పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువకులు: ఫోటో వైరల్) -
చిన్నారి చెంప, చేతులు, పెదవులపై వాతలు.. ఎందుకంటే..
సాక్షి, యాదగిరిగుట్ట(నల్లగొండ): చిన్నారులను ప్రేమతో బుజ్జగించాల్సిన అంగన్వాడీ టీచర్ దారుణానికి ఒడిగట్టారు. అభం శుభం తెలియని చిన్నారికి వాతలు పెట్టి గాయపరిచారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం సుదర్శన్, అనూషల కుమార్తె అభిజ్ఞ (5) గ్రామంలోని అంగన్వాడీ సెంటర్–1కి వెళ్తోంది. రోజు మాదిరిగానే బుధవారం కూడా వెళ్లింది. ఆ చిన్నారి కేంద్రంలో ఏడ్చినందుకు సెంటర్ ఉపాధ్యాయురాలు సునీత చిన్నారి అభిజ్ఞ చెంప, రెండు చేతులు, పెదవులపై వాతలు పెట్టారు. దీంతో ఏడ్చుకుంటూ వచ్చిన చిన్నారి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే కుటుంబ సభ్యులు టీచర్ తీరుపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పిల్లలపై ఇంత కిరాతకంగా వ్యవహరించిన అంగన్వాడీ టీచర్ సునీతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, తానేమీ వాతలు పెట్టలేదని అంగన్వాడీ టీచర్ సునీత చెప్పారు. వారికి, తమకు మధ్య ఉన్న కుటుంబ గొడవలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. -
అమానుషం: వృద్ధుడిని చాపలో చుట్టి పడేశారు!
సాక్షి, అడ్డగూడూరు(నల్లగొండ): సాకే ఇష్టం లేక కుటుంబీకులో, లేక మరేదైనా కారణంతో గానీ.. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని చాపలో చుట్టి పడేసి వెళ్లారు. ఈ అమానుష ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండల పరిధిలో కంచనపల్లి గ్రామం స్టేజీ వద్ద గురువారం చోటుచేసుకుంది. కంచన్లపల్లి స్టేజి వద్ద వృద్ధుడు చాపలో చుట్టబడి ఉండడంతో స్థానికులు గమనించి పోలీసుకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని అతడికి పక్షవాతం వచ్చినట్లు గుర్తించి 108 అంబులెన్స్‌లో మోత్కూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వృద్ధుడి వివరాలు ఆరాతీస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ -
అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను రప్పించాలని.. పిల్లల మెడకు ఉరివేసి..
ముంబై: ముంబైలో దారుణం చోటుచేసుకుంది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను ఇంటికి రప్పించడానికి ..కన్న బిడ్డలను చంపడానికి ప్రయత్నించాడో కసాయి తండ్రి. ప్రస్తుతం ఈ సంఘటన ముంబైలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అజయ్ గౌడ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ముంబైలోని ఈస్ట్ మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతను పెయింటింగ్ పనిచేసేవాడు. ఇతనికి నలుగురు పిల్లలు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య కొంత కాలంగా మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. అజయ్ ప్రతిరోజు మద్యంతాగి వచ్చి తన భార్య పూజను వేధించేవాడు. వీరిద్దరు ప్రతిరోజు గొడవలు పడుతుండేవాడు. దీంతో విసిగిపోయిన పూజ...రెండేళ్ల క్రితం తన పిల్లలను తీసుకుని యూపీలోని తన గ్రామానికి వెళ్లి పోయింది. కాగా, గత జులై నెలలో అజయ్ గౌడ్ యూపీకి వెళ్లి భార్యను తిరిగి ఇంటికి రావాల్సిందిగా కోరాడు. దీనికి పూజ నిరాకరించింది. దీంతో అజయ్‌గౌడ్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఈ క్రమంలో తన పిల్లలను తీసుకుని ముంబై చేరుకున్నాడు. తన భార్యను ఎలాగైనా తిరిగి ఇంటికి వచ్చేలా చేయాలని ఒక ప్లాన్ వేశాడు. తన పిల్లలు చనిపోయినట్టు భార్యను నమ్మించాలని ప్రయత్నం చేశాడు. ఒకరోజు మద్యం మత్తులో తన ఎనిమిదేళ్ల కుమారుడిని మృతిచెందిన విధంగా నెలపై పడుకొబెట్టాడు. అతని శరీరంపై తెలుపు వస్త్రాన్ని కప్పాడు. పూలదండలు వేశాడు. ఆ తర్వాత దానిముందు అగరోత్తులు వెలిగించాడు. ఆ తర్వాత తన 13 ఏళ్ల కూతురుని కూడా ఒక బకెట్‌పై నిలబెట్టి.. మెడకు చున్నిని చుట్టి ఫ్యాన్‌కు వేలాడదీశాడు. అంతటితో ఆగకుండా... దీన్ని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. తన కుతూరుని బకెట్‌ను నెట్టివేయాల్సిందిగా బెదిరించాడు. దీంతో ఆ పిల్లలిద్దరు తండ్రి ప్రవర్తన పట్ల భయపడిపోయి గట్టిగా ఏడుస్తూ, కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పిల్లలను చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కాగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లలిద్దరిని ఆ కసాయి తండ్రి బారినుంచి రక్షించారు. కాగా, అజయ్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణంలో ఆవ్యక్తి.. తన భార్యను పిల్లల ఫోటోలు పంపి ఇంటికి రప్పించేందుకు ఇలా చేశానని అంగీకరించాడు. -
దారుణం: కరోనా సోకిందని ఖాళీ చేయించారు..
పాలకుర్తి (వరంగల్ రూరల్): కరోనా వచ్చిన వారిపై ప్రేమచూపకున్నా.. వారిని హేళనగా చూడొద్దని, అలాంటి వారిని ఆదరించాలని ఎంత చెప్పినా.. కొంతమంది మారడంలేదు. అందుకు ఉదాహరణే ఈఘటన. సొంత ఇల్లు లేకపోవడంతో జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కిరాయి ఇంట్లో నివాసముంటున్న ఈగ సుగుణమ్మ అనే వృద్ధురాలకి కరోనా సోకింది. దీంతో ఇంటి యజమాని ఆమెను బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో దిక్కుతోచిని స్థితిలో పడింది. దీంతో స్పందించిన స్థానిక వార్డు సభ్యుడు వీరమనేని హన్మంతరావు సదరు వృద్ధురాలిని ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. అయితే సుగుణమ్మకు ఇద్దరు కుమారులు ఉండగా.. ఒకరు హన్మకొండలో నివాసం ఉంటున్నాడు. మరో కుమారుడు కుటుంబ కలహాల నేపథ్యంలో వేరుగా ఉంటున్నట్లు సమాచారం. -
క్రౌర్యాసురులు
సోల్ / క్రౌర్యం మనుషుల్లో మెజారిటీ జనాలు క్రూరంగా, పరమఘోరంగా ఉంటారు. లోకంలో కొందరిపై అయాచితంగానే ‘శాంతిదూత’లుగా ముద్రపడి పోతుంది. అలాంటి వాళ్లలోనూ ఎంతో కొంత క్రౌర్యం ఉంటుంది. చరిత్రను తరచి చూస్తే అలాంటి శాంతిదూతల క్రౌర్యానికి చాలా ఆధారాలే లభిస్తాయి. మనుషులు శాంతియుతంగా ఉండాలేనేది ఈ ప్రపంచంలో అనాది ఆదర్శం. ప్రాంత, కాలాలకు అతీతంగా మానవ సమాజాల్లో ఇలాంటి ఆదర్శాలు చాలానే ఉన్నాయి గానీ, సహజ లక్షణాలెప్పుడూ ఆదర్శాలకు భిన్నంగానే ఉంటాయి. క్రౌర్యం కూడా అలాంటి సహజ లక్షణమే. భౌతికంగా హింసించడం మాత్రమే క్రౌర్యం కాదు. పరమ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ కూడా క్రూర కర్మలకు తెగబడే కర్మసిద్ధాంతులు ప్రపంచం నలుమూలలా ఉంటారు. అహింసా సిద్ధాంతాన్ని అక్షరాలా ఆచరిస్తున్నామంటూనే, ఎదుటివారిని దారుణంగా హింసించే ‘పరమహింస’లు ఉంటారు. ఎంతైనా క్రౌర్యం మానవ సహజ లక్షణం. పెద్దలు దీనిని అవలక్షణంగా పరిగణిస్తారు. ఎవరైనా బాహాటంగానే క్రౌర్యాన్ని ప్రదర్శిస్తే, వాళ్లను దుర్మార్గులుగా ఈసడిస్తారు. క్రౌర్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు, వాటి శాసనాలు శాయశక్తులా క్రూరమైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అందువల్ల లోకమంతటా నిండి ఉన్న మానవ సహజ లక్షణమేదనే ప్రశ్న ఎదురైతే, ‘క్రౌర్యం’ అని ఠక్కున బదులివ్వవచ్చు. అణచివేతే ఆదర్శం ‘క్రూర కర్మములు నేరక చేసితి... నేరములెంచకు రామా’ అంటూ భక్త రామదాసు పశ్చాత్తప్త హృదయంతో వగచి వాపోయాడు. అయితే, క్రూరమైన చేష్టలకు పాల్పడిన చాలామందిలో ఇలాంటి ఆత్మవిమర్శ తక్కువ. ఇలాంటి చేష్టలు తప్పు అని ఎవరైనా సుద్దులు చెప్పే ప్రయత్నాలు చేస్తే, వాళ్ల పట్ల మరింత క్రౌర్యాన్ని ప్రదర్శిస్తారు. కొందరు తమ క్రౌర్యాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తారు. క్రౌర్య ప్రదర్శనలో వీళ్లకు ఎలాంటి శషభిషలు, మొహమాటాలూ ఉండవు. అణచివేతే వాళ్లు నమ్మిన సిద్ధాంతం. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టాలనేది కూడా లోకం మెచ్చిన ఆదర్శం. అయితే, బాహ్య క్రౌర్యప్రదర్శన సాగించే వాళ్లు నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్ని ప్రాణాలనైనా బలి తీసుకునేందుకు వెనుకాడరు. ఇలాంటి వాళ్లు క్రమంగా ముదిరి నియంతలుగా ఎదుగుతారు. తమ ప్రాభవం కొనసాగినంత కాలం హింసరచన కొనసాగిస్తారు. హిట్లర్, ముసోలినీ, ఇడీ అమీన్ వంటి పేరుమోసిన నియంతలే కాదు, పోలీసులు, వీధిరౌడీలు కూడా తమ తమ అవకాశాల మేరకు, అధికారాల మేరకు నిస్సిగ్గుగా తమ క్రౌర్యాన్ని బాహాటంగానే ప్రదర్శిస్తారు. ఇలాంటి వాళ్ల క్రౌర్యంలో భౌతిక హింస ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాళ్ల హింసాకాండకు నెత్తుటి ఆనవాళ్లు చరిత్ర నిండా దొరుకుతాయి. పురాణాల్లో క్రౌర్యం కొద్ది మినహాయింపులను వదిలేస్తే, పురాణాల్లోని రాక్షసులందరూ క్రూరులే. వాళ్లు తమ క్రౌర్యాన్ని ఏనాడూ దాచుకోలేదు. చరిత్రకెక్కిన నియంతల తరహాలోనే బాహాటంగానే ప్రదర్శించారు. నరకాసురుడనే వాడు జనాలకు ప్రత్యక్ష నరకాన్నే చవిచూపాడు. బకాసురుడు మనుషులనే భోంచేసేవాడు. ఇలాంటి రాక్షసులు మనకు చాలామందే తెలుసు. అలాగని దేవతలందరూ అహింసావాదులు కాదు. హింసాకాండను సాగించిన రాక్షసులను వాళ్లు హింసాత్మకంగానే వధించారు తప్ప శాంతివచనాలను వల్లించలేదు. అయితే, వేద పురాణాలు, మతగ్రంథాలు క్రౌర్యాన్ని మహాపాపంగా పరిగణించాయి. ఎవరైనా సాటి మనుషుల పట్లే కాదు, మూగజీవులపై క్రౌర్యాన్ని ప్రదర్శించినా అలాంటి వాళ్లు నరకానికే పోతారని ఫలశ్రుతి చెప్పాయి. ఏ రకమైన క్రౌర్యానికి పాల్పడితే, అందుకు నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో భయానక, బీభత్సరసాలు ఉట్టిపడేలా వర్ణించాయి. ఇహలోకంలో క్రూరమైన చర్యలకు పాల్పడేవాళ్లు పరలోకంలో అంతకు మించిన క్రూరమైన శిక్షలే అనుభవించాల్సి వస్తుందనేది పురాణాల సారాంశం. ఇలాంటి పురాణాలన్నింటినీ కూలంకషంగా చదువుకున్న వారేమైనా తమ క్రౌర్యాన్ని విడనాడారా అంటే, లోకంలో అలాంటి దాఖలాలేవీ లేవు. పిరికితనమే కారణం క్రూరస్వభావాన్ని బాహాటంగా ప్రదర్శిస్తూ, ఎదుటి వాళ్లను హింసించేవాళ్లకు సామాన్యులు భయపడతారు. అధికార, ధనబలాలతో ఇలాంటి ఆగడాలను సాగించేవాళ్లకు ఎదురు చెప్పేందుకు సాహసించరు. ఎవరూ ఎదురుచెప్పలేరనే ధీమా వచ్చాక హింసరాజులు మరింత చెలరేగిపోతారు. ఇలాంటి హింసరాజులను జనం గొప్ప ధైర్యవంతులుగా భావిస్తారు గానీ, అది నిజం కాదు. పిరికిపందలే క్రూరులుగా మారుతారు. తమ లోలోపలి భయాలను అణచిపెట్టుకోవడానికి ఎదుటివారిపై నిష్కారణంగా హింసకు తెగబడతారు. ఇలాంటి స్వభావం ఉన్నవాళ్లకు డబ్బు, అధికారం తోడైతే మరింతగా పెట్రేగిపోతారు. ఎదుటివారు హింసను అనుభవిస్తుంటే చూస్తూ ఆనందిస్తుంటారు. ఇంకొందరు మరీ పిరికిపందలు ఉంటారు. తమ క్రౌర్యాన్ని బాహాటంగా ప్రదర్శించే ధైర్యం కూడా వీళ్లకు ఉండదు. ఇలాంటి వాళ్లు లోకంలో జరిగే హింసను మాటలతో ఖండిస్తూ ఉంటారు. నీతిచంద్రికలు వల్లిస్తూ, లోకంలో శాంతికాములుగా చలామణీ అవుతుంటారు. ఇలాంటి వాళ్లకు నేరుగా భౌతికహింసకు పాల్పడే ధైర్యం ఉండదు గానీ, తమను అంటిపెట్టుకుని ఉండే వెర్రిగొర్రెల్లాంటి వాళ్ల భావోద్వేగాలను ‘శాంతియుతం’గా రెచ్చగొడతారు. రెచ్చిపోయిన వెర్రిగొర్రెలు ఊరుకోరు కదా! వాళ్లు హింసాకాండకు పాల్పడతారు. అలాంటి సందర్భాల్లో ఆ పాపం తమది కాదన్నట్లు మిన్నకుంటారు ఇలాంటి ‘శాంతికాముక’ క్రూరులు. వీళ్లెలాంటి వాళ్లంటే, తాబేలు వంటి సాధుజీవిని చంపడం పాపం అని చెబుతూనే, డిప్ప మీద కొడితే అది చావదు గానీ, తిరగేసి కొడితే చచ్చి ఊరుకుంటుందని చెప్పే రకం. ఎందెందు వెదకి చూసిన... క్రౌర్యం సర్వంతర్యామి. ‘ఎందెందు వెదకి చూసిన...’ అన్న రీతిలో ఎక్కడ చూసినా లోకంలో క్రౌర్యం లేని చోటే కనిపించదు. సామాన్యుల ఇళ్లల్లో సైతం భార్యలను భౌతికంగానో మానసికంగానో హింసించే భర్తలు, భర్తలను వేధించే భార్యలు, పిల్లలను వేధించే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను హింసించే పిల్లలు తారసపడుతూనే ఉంటారు. చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన బడుల్లో విద్యార్థులను హింసించే చండామార్కులు కనిపిస్తుంటారు. న్యాయస్థానాల్లో కక్షిదారులను పీడించుకు తినే న్యాయవాదులు, ఆస్పత్రుల్లో రోగులను జలగల్లా పీల్చేసే వైద్యులు, ప్రతిపనికీ ప్రజల నుంచి లంచాలు పీక్కుతినే లంచావతారులు, సామాన్యులపై బలప్రయోగంతో తప్ప శాంతిభద్రతలను కాపాడలేని పోలీసులు, ఆఫీసుల్లో చిరుద్యోగులపై జులుం చలాయించే బాసులు, కాలేజీల్లో జూనియర్లను ర్యాగింగ్ చేసే సీనియర్లు, అమ్మాయిలపై యాసిడ్దాడులు సాగించే ప్రేమోన్మాదులు... చెప్పుకుంటూ పోతే ఇదంతా కొండవీటి చాంతాడంత జాబితా. నెత్తుటితో, కన్నీళ్లతో తడవని చోటు భూప్రపంచంలో ఎక్కడా కనిపించదు. క్రౌర్యం సర్వంతర్యామి అనేందుకు ఇంతకు మించిన రుజువేముంటుంది? - పన్యాల జగనాథదాసు