మాటలదేముంది మాటలే కదా అని తేలికగా తీసిపారేయలేము. మాటలు కేవలం మాటలే కావచ్చు గాని, మాటలంటే మాటలు కాదు. లోకంలో మాటలు నేర్చిన జీవులు మనుషులే! తాము నేర్చిన మాటలను ఊసుపోక శుక పికాదులకు నేర్పించిన ఘనత కూడా మనుషులకే దక్కుతుంది గాని, అది వేరే విషయం. మాటల మహిమను వర్ణించాలంటే మాటలు చాలవు. మాటకారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇట్టే నెట్టుకొచ్చేయగలరు. అసాధ్యమనుకున్న పనులను చిటికెలో చక్కబెట్టగలరు. మాటకారులైన దౌత్యవేత్తలు మాటలతో యుద్ధాలను కూడా నివారించగలరు.
మాటల మహత్తును ఒక పూర్వకవి ఇలా వర్ణించాడు: ‘మాటల చేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తురా/ మాటల చేత భూపతులు మన్నన జేసి పురంబు లిత్తురా/ మాటల చేత మానినులు మన్నన జేసి మనంబు లిత్తురా/ మాటలు నేర్వకున్న నవమానము, న్యూనము, మానభంగమున్’. చక్కగా మాట్లాడటం చేతనైతే దేవతలను; భూపతులను; మానినులను సైతం మెప్పించి, వారి ద్వారా కోరిన ప్రయోజనాలు పొందడం సాధ్యమవుతుంది. సక్రమంగా మాట్లాడటం చేతగాకుంటే చీవాట్లు, శిక్షలు తప్పకపోవచ్చు. నలుగురిలోనూ నవ్వుల పాలయ్యే పరిస్థితులు కూడా తప్పకపోవచ్చు.
మాటకారితనానికి మారుపేరుగా వెలిగిన మహానుభావులు చరిత్రలో చాలామంది ఉన్నారు. అక్బర్ ఆస్థానంలోని బీర్బల్, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలోని తెనాలి రామకృష్ణుడు వంటి వారు ఆ కోవలోకే వస్తారు. వారి మాటకారితనాన్ని ఇప్పటికీ జనాలు కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. కొందరు ముక్తసరిగా మాట్లాడతారు. కొందరు ఆచి తూచి తూకం వేసినట్లుగా మాట్లాడతారు. కొందరు గలగలా ధారాళంగా మాట్లాడతారు.
కొందరు రసజ్ఞులు సరసంగా మాట్లాడతారు. రసజ్ఞత బొత్తిగాలేని కొందరు విరసంగా మాట్లాడతారు. కొందరు నిష్ఠురంగా మాట్లాడతారు. ‘నరుడు మదిలో దొంగ/ నాల్క బూతులబుంగ/ కడుగజాలదు గంగ’ అన్నారు ఆరుద్ర. అదేం కర్మమోగాని కొందరు నోరు తెరిస్తే చాలు, బూతులతో మోత మోయిస్తారు. ఇటీవలి రాజకీయాల్లో ఇలాంటివారి వాగ్ధాటి విపరీతంగా మార్మోగుతోంది.
కొందరు మాటలతోనే కోటలు కట్టేస్తుంటారు కొందరి మాటలు కోటలు దాటేస్తుంటాయి. అలాంటివారు రాజకీయాల్లో అమోఘంగా రాణిస్తుంటారు. ‘ఏదైనా సభలో ఆశువుగా మాట్లాడటానికి ముందు నేను కనీసం మూడువారాల పాటు సాధన చేస్తాను’ అని చెప్పుకున్న మార్క్ ట్వేన్ మన రాజకీయ నాయక దిగ్గజాల ముందు ఎంతటి అర్భకుడో కదా పాపం! మన రాజకీయ నాయకులు అంత శ్రమ లేకుండానే, ఎంత పెద్ద బహిరంగ సభలోనైనా గంటల కొద్ది ఏకధాటిగా ప్రసంగించగలరు. రాజకీయరంగంలోనే కాదు, సాహితీ రంగంలోనూ, ఆధ్యాత్మిక ప్రవచన రంగంలోనూ ఇలాంటి అనర్గళ వాక్ప్రతిభాసంపన్నులు తారసపడుతుంటారు.
మాటలు రకరకాలు. మనుషుల్లో ఎన్ని రకాలో మాటలు కూడా అన్ని రకాలు. హితవైన మాటలు, మధురమైన మాటలు, కల్లబొల్లి మాటలు, సరళమైన మాటలు, పరుషమైన మాటలు, దుందుడుకు మాటలు, ముతక మాటలు, నాజూకు మాటలు, చమత్కారం మాటలు, వెటకారం మాటలు– చెప్పుకుంటూ పోతే జాబితా చేంతాడంతవుతుంది. మనది ప్రజాస్వామ్యం. అందువల్ల మనకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది.
మన రాజ్యాంగం ప్రకారం ‘వాక్స్వాతంత్య్రం’ మన ప్రాథమిక హక్కుల్లో ఒకటి. దురదృష్టవశాత్తు జనాలు అతిగా దుర్వినియోగం చేసుకునే హక్కు కూడా ఇదే! ‘ప్రజలు వాక్స్వాతంత్య్రాన్ని ఎందుకు కోరుకుంటారంటే, దాన్ని ఆలోచనా స్వాతంత్య్రానికి ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ఆలోచనా స్వాతంత్య్రాన్ని దాదాపుగా వారు ఎప్పుడూ ఉపయోగించుకోరు’ అని డేనిష్ కవి, తత్త్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ వాక్స్వాతంత్య్రాభిలాష వెనుకనున్న మతలబును రెండు శతాబ్దాల కిందటే తేటతెల్లం చేసేశాడు.
మాటలు నోటి ద్వారా వెలువడతాయి. అంతమాత్రాన మాట్లాడటానికి నోరు మాత్రమే ఉంటే సరిపోదు. మాట్లాడటానికి ఆలోచన అవసరం. అనాలోచితంగా మాట్లాడే మాటలు ఒక్కోసారి చిక్కుల్లోకి నెడతాయి. ‘వివేకవంతులు తమ మాటలను ఆలోచనలతో జల్లెడ పడతారు’ అన్నాడు బుద్ధుడు. కాకపోతే సమాజంలో వివేకవంతుల సంఖ్య ఎప్పుడూ పరిమితమే!
అరకొర జ్ఞానంతో అల్లాడే వాక్శూరులు వినేవాళ్లను వెర్రిగొర్రెల్లా లెక్కగట్టి చేటభారతాలు చెప్పుకుంటూ పోతారు. వారి వాక్స్వాతంత్య్రాన్ని ఎవరూ హరించలేరు గాని, అమెరికా మాజీ ప్రధాన న్యాయమూర్తి వారెన్ ఇ బర్గర్ అన్నట్లుగా ‘వాక్స్వాతంత్య్రంలో శ్రవణ స్వాతంత్య్రం కూడా మిళితమై ఉంటుంది’ అనే వాస్తవాన్ని గుర్తెరగాలి. అప్పుడే వాక్స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం.
మనకు బహుభాషా పరిజ్ఞానం ఉంటే ఉండవచ్చు; అపారమైన పదసంపద ఉండవచ్చు; అనర్గళ వాగ్ధార ఉండవచ్చు. అంతమాత్రాన అనాలోచితంగా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతూ పోతే శృంగభంగం తప్పదు. అసలే ఇది మనోభావాల కాలం. ఏ మాట ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందో అనేదానిపై కనీసమైన అంచనా మాట్లాడే ముందే ఉండాలి.
ఎంతటి భాషా వేత్తలయినా మాటలను ఆచి తూచి ఉపయోగించాలి. మాటల గురించి ఇన్ని మాటలు ఎందుకంటే, ‘ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లి ధరణి మూగది/ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ నడమంత్రపు మనుషులకే మాటలు– ఇన్ని మాటలు’ అని సెలవిచ్చారు వేటూరి. అదీ సంగతి. మరి మాటలంటే మాటలా!
మాటలంటే మాటలా!
Published Mon, Oct 30 2023 12:23 AM | Last Updated on Mon, Oct 30 2023 3:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment