పచ్చని ప్రకృతితో భూతల స్వర్గంగా, ‘దేవుడి సొంతగడ్డ’గా పేరుబడ్డ రాష్ట్రానికి త్వరలోనే కొత్త పేరు ఖరారు కానుందా? కేరళ అతి త్వరలోనే అధికారికంగా పేరు మార్చుకోనుందా? అవును. దేశానికి దక్షిణ కొసనున్న ఈ మలయాళ రాష్ట్రం ‘కేరళమ్’గా కొత్త నామధేయం స్వీకరించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. రాష్ట్రం పేరును రాజ్యాంగంతో సహా అన్ని ఆఫీసు రికార్డుల్లోనూ అధికారికంగా ‘కేరళమ్’గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, కేరళ శాసనసభ తీర్మానం చేయడంతో అందుకు రంగం సిద్ధమైంది.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ బుధవారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విపక్షాలతో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం పార్టీలకతీతంగా కొత్త పేరుకున్న సర్వజనా మోదాన్ని తెలియజేస్తోంది. అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఇంకా అనేక అంచెలున్నందున అవన్నీ దాటుకొని మలయాళీల ఆకాంక్ష నెరవేరడానికి మరికొంత కాలం పట్టవచ్చు.
నిజానికి, మలయాళంలో అసలు ఆ రాష్ట్రం పేరు కేరళమే. మలయాళీలు సాధారణంలో వాడు కలో చెప్పేది అలానే. ఎటొచ్చీ అధికారిక, ఇంగ్లీష్ రికార్డులోనే ఈ కేరళ అనే మాట. చరిత్ర పరికిస్తే – మలయాళం మాట్లాడే ప్రజలు రకరకాల రాజులు, సంస్థానాల పాలనలో ఉండేవారు. మలబార్, కొచ్చి, ట్రావన్‌కోర్‌లను కలిపి, మలయాళ భాషీయులు అందరికీ సమైక్యంగా ఒకే రాష్ట్రం కావాలనే ‘ఐక్య కేరళ ఉద్యమం’ 1920ల నుంచే ఉంది. ఒకే భాష, ఒకే చరిత్ర, సంస్కృతి, సంప్రదాయమున్న మలయాళీలంతా ఐక్యం కావాలనే బలమైన డిమాండ్ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక సంస్థానాల విలీనంతో క్రమక్రమంగా నెరవేరింది.
1949 జూలై 1న ట్రావన్‌కోర్, కొచ్చి రాష్ట్రాలు రెండూ ఏకమై, ట్రావన్‌కోర్ – కొచ్చిన్ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నప్పుడు పునర్వ్యవస్థీకరణ సంఘం కేరళ రాష్ట్ర ఏర్పాటును సిఫార్సు చేసింది. అలా 1956 నవంబర్ 1న ఇప్పటి కేరళ రాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రం పేరును మలయాళంలో కేరళమ్ అని పేర్కొన్నా, అప్పట్లో రాజ్యాంగం తొలి షెడ్యూల్‌లో ఇంగ్లీషులో కేరళ అని రాశారు. ఇప్పుడు అదే రాజ్యాంగం 3వ అధికరణ కింద అంతటా కేరళమ్‌గా మార్చాలన్నది కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం.
సాధారణంగా పేరులో ఏముంది పెన్నిధి అనుకోవచ్చు. కానీ, అనేక సందర్భాల్లో ఆ పేరు, ఆ పేరు వెనుక చరిత్ర, దానితో ముడిపడ్డ అనుబంధం నిజంగానే ఓ పెన్నిధి. అస్తిత్వానికీ, అపారమైన సెంటిమెంట్‌కూ నెలవు. అనేక ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలకు ఆ యా ప్రాంతాల ప్రజల భాష, గోస, ఊరు, పేరు బలమైన ఊతమిచ్చాయనేది మర్చిపోలేని చరిత్ర. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ తెలుగువారు చేసిన పోరాటమే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసింది.
దక్షిణాదిన తెలుగువారికి, తమిళులకు, కన్నడిగులకు, మలయాళీలకు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తర్వాత స్థానిక సెంటిమెంట్లను గౌరవిస్తూ, కొన్ని రాష్ట్రాల పేర్లూ మారాయి. ‘మద్రాస్ రాష్ట్రం’ అనంతర కాలంలో 1967 నుంచి తమిళనాడు అయినా, ‘మైసూర్ స్టేట్’ అటుపైన 1973లో కర్ణాటకగా పేరు మార్చుకున్నా అలాగే జరిగింది. ఇప్పుడు కేరళ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ ఏకగ్రీవంగా తమ రాష్ట్రం పేరును స్థానిక పురాతన చరిత్రను ప్రతిఫలించేలా కేరళమ్‌గా మార్చాలంటూ చేసిన తీర్మానం కూడా ఆ కోవలోనిదే!
శబ్ద వ్యుత్పత్యర్థాల ప్రకారం చూసినా చాలా కథే ఉంది. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి కాయ. అలా ‘కేరళ’ అంటే నారికేళాల భూమి అని శబ్దార్థం. కేరళ సీమలో ఎటు చూసినా పచ్చటి కొబ్బరి చెట్లు విస్తృతంగా ఉండడమే ఈ శబ్దోత్పత్తికి నేటికీ సాక్ష్యం. క్రీ.పూ. 257 నాటి అశోకుని రెండో శిలాశాసనంలోనే తొలిసారి కేరళ ప్రస్తావన కనిపిస్తుంది.
అందులో స్థానిక పాలకుణ్ణి ‘కేరళపుత్ర’ అనీ, చేర రాజవంశాన్ని ప్రస్తావిస్తూ ‘చేర పుత్రుడ’నీ ఉంది. గోకర్ణం నుంచి కన్యాకుమారి మధ్య ఉన్న ప్రాంతాన్ని ‘చేరమ్’ అనేవారట. ‘చేర’ అనే మూలపదానికి అనుసంధానించడమనీ, ‘అళం’ అంటే ప్రాంతమనీ అర్థం. అలా చేరమ్, చేరళమ్ పదాల నుంచే ‘కేరళమ్’ అనే మాట పుట్టిందట.
దేశపు నైరుతి మూలన మలబార్ తీరంలో నెలకొన్న ఈ రాష్ట్రానికి అనేక విశిష్టతలున్నాయి. ఇది పరశురామ క్షేత్రమనీ, బలి చక్రవర్తి ఇక్కడ నుంచే భూమండలాన్ని పాలించాడనీ పురాణగాథ. మల బార్ సీమ వారిది ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయం. సహజంగానే స్వరాష్ట్రం పేరు సైతం వాటిని ప్రతిఫలించేలా, స్థానిక భావ్వోదేగాలను ప్రతిబింబించేలా ప్రతిష్ఠాత్మకంగా ఉండాలని వారు కోరుకుంటారు. అది నూరుపాళ్ళూ సమంజసమే.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు మొదలు సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన దాకా ఇవన్నీ ఆ కోవలో వచ్చినవే! అయితే, పేరు మార్పుకూ పెద్ద తతంగం ఉంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లలో మార్పుల అంశాలు రాజ్యాంగం 3వ అధికరణం కిందకు వస్తాయి. నగరాల పేర్లు మార్చేందుకు కేంద్ర ఆమోదం అవసరం లేకున్నా, రాష్ట్రాల పేర్ల మార్పునకు కేంద్ర హోమ్‌శాఖ అంగీకారం తప్పనిసరి. రాజ్యాంగ సవరణ అవసరం.
సాధారణంగా రాష్ట్ర సర్కార్ నుంచి ప్రతి పాదన రాగానే కేంద్రం పేరు మార్పు ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆ పైన ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే, తపాలా శాఖలు వగైరాల నుంచి నిరభ్యంతర పత్రాలు కోరుతుంది. పార్లమెంట్ ఆమోదంతో చట్టమయ్యాక, రాష్ట్రానికి కొత్త పేరు అమలులోకి వస్తుంది. కేరళ విజయాలను ప్రపంచానికి చాటేలా ఈ నవంబర్ 1న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి ‘కేరళీయమ్ 2023’ పేరున ఉత్సవాలు జరగను న్నాయి. ఆలోగా పేరు మారితే ఉత్సవాలకూ నిండుదనమన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఫలిస్తుందా?
భూతల స్వర్గం ఇక ‘కేరళమ్’!
Published Fri, Aug 11 2023 3:40 AM | Last Updated on Fri, Aug 11 2023 4:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment