పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘రా’ మాజీ అధికారిపై అమెరికా కోర్టులో అభియోగాలు | US charges ex-Indian intelligence official in foiled Sikh separatist murder plot | Sakshi
Sakshi News home page

పన్నూ హత్యకు కుట్ర కేసులో ‘రా’ మాజీ అధికారిపై అమెరికా కోర్టులో అభియోగాలు

Published Sat, Oct 19 2024 4:53 AM | Last Updated on Sat, Oct 19 2024 4:53 AM

US charges ex-Indian intelligence official in foiled Sikh separatist murder plot

వాషింగ్టన్‌:  ఖలిస్తాన్‌ ఉగ్రవాది గురు పత్వంత్‌సింగ్‌ పన్నూను హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) మాజీ అధికారి వికాస్‌ యాదవ్‌పై అమెరికా అధికారులు అభియోగాలు మోపారు. పన్నూను అంతం చేయడానికి జరిగిన కుట్రలో వికాస్‌ యాదవ్‌ పాత్ర ఉందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం న్యూయార్క్‌ కోర్టులో అభియోగ పత్రాలు సమరి్పంచారు.

 ఆయనను సీసీ–1(సహ కుట్రదారుడిగా) నిర్ధారించారు. పన్నూను హత్య చేయడానికి కిరాయి మనుషులను నియమించడం, మనీ లాండరింగ్‌కు పాల్పడడం అనే అభియోగాలు మోపారు. ప్రస్తుతం వికాస్‌ యాదవ్‌ ఆచూకీ తెలియడం లేదని పేర్కొన్నారు. 39 ఏళ్ల వికాస్‌ యాదవ్‌ గతంలో భారతదేశ విదేశీ ఇంటెలిజెన్స్‌ సేవలు, ‘రా’ వ్యవహారాలను పర్యవేక్షించే కేబినెట్‌ సెక్రటేరియట్‌లో పనిచేశారు. 

పన్నూ హత్యకు కుట్ర కేసులో భారతీయుడు నిఖిల్‌ గుప్తాను అమెరికా పోలీసులు గత ఏడాది చెక్‌ రిపబ్లిక్‌ దేశంలో అరెస్టు చేశారు. నిఖిల్‌ గుప్తా ప్రస్తుతం అమెరికాలో జైలులో ఉన్నాడు. అమెరికా గడ్డపై పన్నూను హత్య చేయడానికి భారత ఏజెంట్లు కుట్ర పన్నారని, ఈ కుట్రను తాము భగ్నం చేశామని అమెరికా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే, అమెరికా అధికారుల ఆరోపణలను భారత ప్రభుత్వం ఇప్పటికే ఖండించింది. పత్వంత్‌సింగ్‌ పన్నూ ఇండియాలోని పంజాబ్‌ రాష్ట్రంలో జని్మంచాడు. కెనడాకు వలస వెళ్లాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. అతడికి కెనడాతోపా టు అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.   

నిజ్జర్‌ హత్య కేసులో కెనడాలోనూ
వాషింగ్టన్‌: మరోవైపు కెనడాలో జరిగిన ఖలిస్తాన్‌ ఉగ్రవాది హరిదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ అలియాస్‌ నిజ్జర్‌ హత్యతోనూ వికాస్‌ యాదవ్‌ పేరును ముడిపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కెనడాలో 2023 జూన్‌ 18న నిజ్జర్‌ హత్య తర్వాత మృతదేహం తాలూకు రియల్‌–టైమ్‌ వీడియోను వికాస్‌ యాదవ్‌.. నిఖిల్‌ గుప్తాకు షేర్‌ చేశాడని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇదే సమాచారాన్ని అమెరికా ప్రభుత్వం కెనడాతో పంచుకొనే వీలుంది. దీన్నిబట్టి నిజ్జర్‌ హత్య కేసులో వికాస్‌ యాదవ్‌పై కెనడా ప్రభుత్వం కూడా అభియోగాలు నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement