న్యూఢిల్లీ: అయోధ్యలో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేసే ప్రణాళికలు రచిస్తున్నట్టు భారత నిఘా విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 15న పాకిస్తాన్ ఐఎస్‌ఐ ట్రైనింగ్ ఇచ్చిన లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌లో ఉగ్రదాడులు చేసి అంతర్గతంగా కల్లోలం సృష్టించాలని ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని పరిశోధన మరియు విశ్లేషణ విభాగం (రా) అధికారులు వెల్లడించారు. మూడు నుంచి ఐదు టెర్రరిస్టు గ్రూపులు మన దేశంలోకి చొరబడేందుకు చూస్తున్నాయని, పాక్ ఐఎస్‌ఐ వారికి సాయం చేస్తోందని తెలిపారు.
20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్ సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అయోధ్యతోపాటు కశ్మీర్‌లోనూ దాడులు చేసేందుకు పాకిస్తాన్‌లోని జలాల్‌బాద్‌లో ఐఎస్‌ఐ వారికి శిక్షణ ఇచ్చిందని తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా అధికారులు సరిహద్దుల వెంబడి గస్తీని పెంచారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన సమయం దగ్గరపడుతున్న వేళ ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 5 న ప్రధాని మోదీ భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు అదే రోజు ఏడాది పూర్తవుతుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment