శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన (ఫైల్ ఫొటో)
కొలంబో : తమ దేశాధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతోందంటూ సమాచారం అందిన నేపథ్యంలో చైనాకు చెందిన ఫోన్ తయారీ సంస్థ హవాయి సహాయం తీసుకుంటామని శ్రీలంక పోలీసులు తెలిపారు. ఇందుకోసం కోర్టు నుంచి అనుమతి కూడా పొందినట్లు పేర్కొన్నారు. తనను చంపేందుకు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్( రా) కుట్ర పన్నుతోందని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అధ్యక్షుడి హత్యకు కుట్ర జరుగుతున్న విషయం వాస్తమేనని, ఈ విషయమై తాను ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్‌తో కూడా ఫోన్‌లో చర్చించానని పోలీసు ఇన్‌ఫార్మర్ నమాల్ కుమార పేర్కొన్నాడు. మైత్రిపాలతో పాటు, శ్రీలంక రక్షణ శాఖ మాజీ కార్యదర్శి గోటబాయ రాజపక్స కూడా హిట్ లిస్టులో ఉన్నారని తెలిపాడు. ఈ నేపథ్యంలో ఈ కుట్ర వివరాలను బయటపెట్టేందుకు కుమార ఫోన్ డేటా కీలకంగా మారింది. అయితే ఈ డేటా మొత్తం డెలిట్ అయిన నేపథ్యంలో హవాయి సహాయం అనివార్యమైందని పోలీసులు తెలిపారు.
కాగా ఈ కుట్రలో భాగం ఉందంటూ గత నెల 23న కేరళకు చెందిన థామస్ అనే వ్యక్తిని శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను చంపేస్తామంటూ సీఐడీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనని వెంటనే వారి కస్టడీ నుంచి విముక్తి చేయాలని థామస్ కోర్టుకి విన్నవించాడు. కానీ జడ్జి అతడి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు.. ఇది దేశ అధ్యక్షుడి భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి అంత తేలికగా ఎవరినీ విడిచిపెట్టేది లేదని నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఇక శ్రీలంక నాయకులు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలపై ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2015లో జరిగిన శ్రీలంక ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు కూడా ‘రా’ పై ఆరోపణలు చేశారు. దేశ పాలన మార్పులో ‘ రా’ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment