హాలివుడ్ సినిమా యాక్షన్ సీన్లు తలదన్నేలా పద్దెనిమిది నెలల పాటు అత్యంత రహస్యంగా ఊహకందని రీతిలో సాగిన భద్రతాదళాల ఆపరేషన్ విజయవంతమైంది. దేశ రాజధానిపై ఉగ్రమూక పంజా విసరకుండా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ దోహదపడింది. దీని కారణంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఐసీస్ (ఇస్లామిక్ స్టేట్) దాడులకు సిద్ధమైన ఉగ్రవాదుల ప్రణాళికలు కూడా బట్టబయలయ్యాయి. భారత భద్రతా సంస్థల కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఐసీస్‌లోకి మన ఏజెంట్‌ను ప్రవేశపెట్టారు.
ఈ వ్యక్తి ద్వారా ఐఎస్ ఉగ్రవాదికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించడంతో పాటు దాడులకు అవసరమైన పేలుడుపదార్థాలు (ట్రిగ్గర్స్ లేకుండా) కూడా సరఫరా చేశారు. ఆఫ్గనిస్తాన్, దుబాయ్, ఢిల్లీల్లో సుదీర్ఘకాలం పాటు ఈ సూక్ష్మ పర్యవేక్షణ సాగింది. ఛెస్ ఆటలో మాదిరిగా భద్రతా దళాల అధికారులు ఓ వైపు పకడ్బందీ నిఘా కొనసాగిస్తూనే, అనువైన సమయం కోసం ఓపికగా ఎదురుచూశారు. ఇందులో ఉత్కంఠను రేకెత్తించే అంశాలెన్నో ఉన్నాయి...
పాకిస్తాన్‌లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ తీవ్రవాదుల బందం భారత్, తదితర ప్రాంతాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు 50 వేల డాలర్ల మొత్తాన్ని ఐసీస్ కార్యకలాపాల కోసం అఫ్గనిస్తాన్‌కు పంపించడాన్ని అమెరికన్ నిఘా వర్గాల సహకారంతో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్ టాప్ చేశాక అఫ్గనిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి న్యూఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వస్తున్నట్టు వెల్లడైంది.
ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన తీవ్రవాదితో స్నేహసంబంధాలు పెంపొందించుకునేందుకు ఓ ఐఎస్ ఏజెంట్ అవతారంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఓ వ్యక్తిని పంపింది. ఈ వ్యక్తి ద్వారానే తీవ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో బసతోపాటు, పేలుడుపదార్థాలు సమకూర్చేలా చేశారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాదిపై నెలరోజుల పాటు నిరంతర నిఘా కోసం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్‌టెన్షన్ మార్కెట్‌లలో ఐఎస్ ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అఫ్గనిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు.
పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేయగలిగాయి. ఇటీవల అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారం ఇతడి వద్దే సేకరించారు. ప్రస్తుతం మరింత సమాచారం కోసం అతడిని విచారిస్తున్నారు. 2017 మే 22న యూకేలోని మాంఛేస్టర్ (23 మంది ప్రాణాలు కోల్పోయారు) లో జరిగిన బాంబుదాడి ఇతడి 11 మంది సహచరుల్లోని ఒకడి పనేనని తేలింది. అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తి ఏవైతే పేలుడు పదార్థాలు వినియోగించాడో అలాంటి వాటినే ఢిల్లీకి వచ్చిన ఉగ్రవాది కూడా డిమాండ్ చేయడాన్ని బట్టి ఇక్కడ కూడా అలాంటి ఆత్మాహుతిదాడికి తెగబడాలని భావించాడనేది స్పష్టమవుతోంది. గత సెప్టెంబర్‌లోనే ఈ అరెస్ట్ చోటుచేసుకున్నా ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడు బయటపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment