భగీరథీ నాయక్.. తన భార్యతోపాటు ఇద్దరు మైనర్ కూతుళ్ళను హత్యచేసి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.
భువనేశ్వర్ః ఒడిషాలో దారుణం చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య గొడవలు ముగ్గురు ప్రాణాలను బలిగొంది. భార్యతో పాటు ఇద్దరు మైనర్ బాలికలను హత్యచేసి, నిందితుడు పోలీసులముందు సరెండర్ అయిన వైనం.. ఓడగాన్ పోలీస్ స్టేషన్ పరిథిలోని పేటపల్లి గ్రామంలో వెలుగు చూసింది.
ఒడిషా నయాఘర్ జిల్లాకు చెందిన భగీరథీ నాయక్.. తన భార్యతోపాటు ఇద్దరు మైనర్ కూతుళ్ళను హత్యచేసి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. భార్య ప్రతిమతో పాటు ఇద్దరు కుమార్తెలను నిందితుడు ఓ పాఠశాల ప్రాంగణంలో గొంతు నులిమి చంపినట్లు స్థానిక సరంకుల్ ఎస్డీపీవో టికె రెడ్డి తెలిపారు. హత్యల వెనుక కుటుంబ తగాదాలే కారణమని రెడ్డి పోలీసులకు వివరించారు.
అయితే నాయక్ ప్రతిమలది ప్రేమ వివాహమని, పెద్ద కుమార్తె ప్రతిమకు ముందు వివాహంద్వారా పుట్టిన సంతానమని, మృతి చెందిన ఇద్దరు బాలికల్లో ఐదు నెలల బాలికకు నాయక్ సొంత తండ్రి అని పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.