
నిందితుడు ఉమా శంకర్ గౌడ
జయపురం: విదేశీ మద్యాన్ని అధికధరకు అమ్మడంపై తలెత్తిన వివాదంలో ఒక యువకుడి నుంచి పిస్టల్‌ను స్వాధీనపరచుకున్నట్లు జయపురం సబ్‌డివిజనల్ పోలీసు అధికారి అరూప్ అభిషేక్ బెహర తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. బొయిపరిగుడ వాసి ఉమాశంకర గౌడను అరెస్టు చేసినట్లు బెహర వెల్లడించారు.
బొయిపరిగుడలో ప్రభుత్వ లైసెన్స్‌తో విదేశీ మద్యం దుకాణం ఉందని, 12వ తేదీన నిందితుడు ఉమాశంకర గౌఢతో పాటు అతని సహచరుడు అసమత్‌ఖాన్ ఉరఫ్ పప్పు విదేశీ మద్యం దుకాణానికి వెళ్లి ఒక మద్యం బాటిల్ అడిగినట్లు తెలిపారు. బాటిల్ ధర రూ.200 కాగా, సేల్స్‌మాన్ రూ.220 చెప్పాడని వాగ్వాదానికి దిగారు. దీంతో ఉమాశంకర్ రివాల్వర్ తీసుకొని సేల్స్‌మాన్ రామప్రసాద్ సాహు గురిపెట్టి చంపుతామని బెదిరించాడని వెల్లడించారు. రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి ఉమాశంకర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు బెహర వెల్లడించారు. అతనితో పాటు వచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నాడని తెలిపారు.