బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం
భువనేశ్వర్: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా కొనసాగుతున్నాయి. నేటి నుంచి రెండు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు, పదమూడు మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలు సమావేశంలో పాల్గొంటారు. అయితే ఆరోగ్య కారణాల వల్ల కేంద్రవిదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరుకావడం లేదు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రధాని మోదీ భువనేశ్వర్ చేరుకుని.... సాయంత్రం 5 గంటలకు సమావేశంలో పాల్గొంటారని బీజేపీ నేతలు వెల్లడించారు.
ప్రధానంగా రెండు విధానాలపై బీజేపీ కార్యవర్గం చర్చించనుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం....2019 సాధారణ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని పార్టీ నేతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లోబీజేపీ విజయంపైనే అధినాయకత్వం దృష్టి సారించినట్టు తెలిసింది. కాగా తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధరరావు,నాగం జనార్దన్ రెడ్డి, పేరాల చంద్రశేఖరరావు తదితరులు జాతీయ కార్యవర్గ సమావేశాలు హాజరయ్యారు.