భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దేశంలో దీర్ఘకాల ముఖ్యమంత్రిగా కొనసాగిన ప్రముఖుల జాబితాలో చేరనున్నారు. జాతీయ స్థాయిలో రెండో దీర్ఘకాలిక సీఎంగా సరికొత్త రికార్డు నెలకొల్పనున్నారు. నవీన్ ప్రత్యక్ష రాజకీయ జీవితంలో ఇదో సుస్థిర మైలురాయిగా నిలుస్తుందని బిజూ జనతాదళ్ శిబిరంలో ఆనందం వెల్లివిరుస్తోంది. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జ్యోతి బసు తరువాత దీర్ఘకాలం ఈ పదవిలో కొనసాగిన రికార్డు ఆక్రయించనున్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఒడిశా పరివర్తన ప్రధాన కార్యాచరణ ఆయనకు ఈ రికార్డు సాధకులుగా చరిత్రలో నిలుపుతుంది.
జ్యోతి బసు సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు నిరవధికంగా పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ 24 ఏళ్ల 166 రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగిన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా నవీన్ పట్నాయక్ స్థానం సాధించడం విశేషం. ఆయన వరుసగా 5సార్లు సీఎంగా పగ్గాలు చేపట్టారు.
ఈనెల 22తో ముఖ్యమంత్రి పాలన సమగ్రంగా 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకుంటుంది. గతంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు ఇదే కాల పరిమితిలో గతంలో దీర్ఘకాలిక ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొలిపారు. తాజా రికార్డుతో నవీన్ ఆయన సరసన చోటు దిక్కించుకుకోవడం విశేషం. జాతీయ స్థాయిలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తిగా ఎదిగేందుకు స్వల్ప దూరంలో ఉన్నారు. 2000, 2004, 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ రాష్ట్ర శాసనసభకు వరుసగా ఎన్నికయ్యారు. ఆయన అకుంఠిత కార్యదక్షత ముఖ్యమంత్రి హోదాని సొంతం చేసింది.
ఎత్తుకు ప్రత్యర్థులు చిత్తు..
మహిళ, రైతు సాధికారిత ఇతరేతర రంగాల్లో సంస్కరణలు రాష్ట్రానికి సరికొత్త రూపురేఖలు అద్దాయి. సేవాభావం, సామాజిక శ్రేయస్సు పట్ల అంకితభావం ప్రజా ప్రాతినిధ్యానికి ప్రామాణికంగా రుజువు చేసిన దాఖలాలు కోకొల్లలు. గంజాం జిల్లా అసికా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మహిళా స్వయం సహాయక సంఘం సాధికార మహిళ ప్రమీల బిసొయిని ఎంపీగా గెలిపించుకున్న తీరు.. బిజూ జనతాదళ్ అధ్యక్షుడుగా నవీన్ పట్నాయక్ సాధించిన అపురూప విజయం.
ప్రత్యర్థుల్లో ధీటైన సభ్యులను సమయోచితంగా ఆకట్టుకుని, పార్టీని బలోపేతం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిపక్షాలను ఖంగు తినిపించడంలో ఆయన ధీరత్వానికి ప్రతీక. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కంచుకోటలుగా నిలిచిన పలు నియోజక వర్గాలను బీజేడీ ఖాతాలో చేర్చుకున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ ఒడిశా సమగ్రంగా కై వసం చేసుకునే వ్యూహంతో పావులు కదుపుతున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో..
గంజాం జిల్లా హింజిలికాట్ నవీనపట్నాయక్‌కు కలిసి వచ్చిన నియోజకవర్గంగా మిగిలింది. దీనితో పాటు పాలనలో విపత్కర పరిస్థితులను అవలీలగా అధిగమించి, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థల విశేష గుర్తింపుతో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచారు. రాష్ట్రంలో ఆకలి చావులకు తెరదించిన దిశలో ఆయన కృషి అనన్యమని చెప్పవచ్చు. ప్రజలకు పారదర్శక పాలన ఇంటి ముంగిటకు చేర్చడంలో సాధించిన విజయం అత్యద్భుతం.
ప్రభుత్వ సేవలు ప్రజలకు నిర్థారిత కాల పరిమితిలో కల్పించడమే ధ్యేయంగా చేపట్టిన 5టీ కార్యాచరణ రాష్ట్ర పరివర్తనలో సరికొత్త మలుపు తిప్పింది. అవినీతి రహిత పాలన కార్యాచరణ సులభతరం చేసిన సాటిలేని ముఖ్యమంత్రిగా పేరొందారు. సమాచారం, రవాణా, బాహ్య ప్రపంచంతో రాష్ట్రాన్ని అనుసంధానం చేయడం.. జాతీయ, అంతర్జాతీయ వర్తక వ్యాపారాలు, పారిశ్రామిక విస్తరణతో రాష్ట్ర పురోగతిలో వేగం పుంజుకుంది. విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాలు సకాలంలో అక్కరకు వచ్చే రీతిలో ప్రవేశ పెట్టిన పథకాలు, కార్యక్రమాలు జాతీయ స్థాయిలో మార్గదర్శకంగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment