మల్కన్‌గిరి: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో గిరిజనులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి చాలా ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో కొండలు, గుట్టలు మధ్య కాలినడకన ప్రయాణించాల్సిన దుస్థితి. కనీసం అంబులెన్స్ వచ్చేందుకు కూడా వీలుండేలా రహదారి సౌకర్యం లేకపోవడంతో జిల్లాలోని చిత్రకొండ సమితి, కటాఫ్ ఏరియలోని కునిగూడ గ్రామ గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు.
చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి నారాయణ రాణె అరెస్ట్
వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన జిమ్మ ఖిలో నిండు గర్భిణి. మంగళవారం ఉదయం ఈమెకి పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆశ కార్యకర్త సహాయంతో అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. అయితే గ్రామానికి రోడ్డు వసతి లేకపోవడంతో అక్కడి వరకు రాలేమని, గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని పక్కా రోడ్డు వరకు గర్భిణిని తీసుకువస్తే ఆస్పత్రికి తీసుకువెళ్లవచ్చని సిబ్బంది సూచించారు.
దీంతో వేరే దారి లేకపోవడంతో గర్భిణి భర్త బోందు ఖిలో, కొంతమంది గ్రామస్తులు కలిసి, గర్భిణిని మంచంపై ఉంచి, అంబులెన్స్ దగ్గరకు మోసుకుని వెళ్లారు. అక్కడి నుంచి చిత్రకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి, చికిత్స అందజేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొంచె ఆలస్యమైతే ప్రాణాలకే ప్రమాదం అని.. ఇటువంటి తరచూ జరుగుతున్నా అధికారులు, నేతలు స్పందించకపోవడం చాలా దారుణమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చదవండి: సుకుమా అడవుల్లో ఎన్‌కౌంటర్ ఇద్దరు మావోయిస్టులు మృతి
Comments
Please login to add a commentAdd a comment