‘రైజ్’ కాలేకపోయింది..!
►అవకాశాలు చేజార్చుకున్న హైదరాబాద్
►హైలైట్‌గా నిలిచిన వ్యక్తిగత ప్రదర్శనలు
►కీలక పాత్ర పోషించిన వార్నర్, భువనేశ్వర్, రషీద్
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టు... హిట్టర్లకు కొదవలేని బ్యాటింగ్ లైనప్... డెత్ ఓవర్లలోనూ కట్టడి చేసే బౌలింగ్ దళం... ఇలా ఎలా చూసినా ఆల్‌రౌండ్ నైపుణ్యం పుష్కలంగా ఉన్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. కానీ ఎలిమినేట్ అయ్యింది...ఈ సీజన్‌లో నిలకడ చూపించినా కీలక మ్యాచ్‌లో నిరాశజనక ప్రదర్శన రైజర్స్ మరో టైటిల్ అవకాశాలను దూరం చేసింది. టాప్–2లో నిలిచే సత్తా, సామర్థ్యం ఉన్నా... కొన్ని మ్యాచ్‌ల ఫలితాలే దెబ్బతీశాయి. టైటిల్ వేటకు టాటా చెప్పించాయి. అయితే ఒకసారి విజేతగా నిలవడంతో పాటు మరో రెండు సార్లు ప్లే ఆఫ్ దశకు చేరుకోవడంతో సన్ యాజమాన్యం సంతృప్తికరంగానే ఐపీఎల్ ప్రస్థానాన్ని ముగించిందని చెప్పవచ్చు.
ఎలిమినేటర్ పోరులో కొంత వరకు వర్షం సన్‌రైజర్స్ అవకాశాలను దెబ్బ తీసింది. అయితే 20 ఓవర్ల మ్యాచ్ జరిగినా కచ్చితంగా గెలిచేదని చెప్పలేం. అయితే చేసిన స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటే, ప్రత్యర్థి జట్టు ప్రదర్శనను పరిశీలిస్తే... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చేయగలిగిన స్కోరును మాత్రం హైదరాబాద్ చేయలేదనేది అంగీకరించాల్సిన సత్యం. గత సీజన్‌లోనూ మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరాటంతోనే ఫైనల్ చేరిన జట్టు... చివరకు టైటిల్ సాధించే క్రమంలో బెంగళూరులాంటి జట్టుపై ఇదే మైదానంలో ఎంత స్కోరు చేసిందో అందరికీ తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం ప్రత్యర్థి జట్టును అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైంది. రైజర్స్ వ్యూహాలు బాగానే ఉన్నా కొన్ని తప్పులు వెంటాడాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికేదీ కనిపించలేదు. వర్షం కురిసిన మైదానం మందకొడిగా ఉంటే భారీ షాట్లకు వెళ్లకుండా గ్రౌండ్ షాట్లకే పరిమితమ్యారు. ఓపెనర్ శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్‌లకు బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్నా... వారు విఫలం కావడం నిరాశపరిచింది.
పరుగులు, వికెట్లలో ‘రైజింగ్’
లీగ్ మొత్తం మీద జట్టును బ్యాటింగ్‌లో నడిపించిన నాయకుడు వార్నరే. ఇతనికి ఓపెనింగ్‌లోనూ, బ్యాటింగ్ ఆర్డర్‌లోనూ అండగా నిలిచింది శిఖర్ ధావన్. కెప్టెన్ 641 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎలిమినేటర్ ముందు వరకు ఆ తర్వాతి స్థానంలో ధావన్ (479 పరుగులు) ఉన్నాడు. (తాజాగా గంభీర్ 486 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు). హైదరాబాద్ విజయాల్లో సింహభాగం భాగస్వామ్యం ఓపెనర్లదే. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ ఆ బాధ్యతను పంచుకోలేకపోయారు. 12 మ్యాచ్‌లాడిన యువరాజ్ (252 పరుగులు) ప్రదర్శన తీసికట్టుగానే ఉంది. ఏడే మ్యాచ్‌లాడిన విలియమ్సన్ (256) అతనికంటే చాలా మెరుగ్గా ఆడాడు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన నమన్ ఓజా నిరూపించుకునే ప్రదర్శన ఒక్కటీ లేదు. ఇక బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ (26 వికెట్లు)దే అగ్రస్థానం. రషీద్ ఖాన్ (17), సిద్ధార్థ్ కౌల్ (16) టాప్–10లో ఉన్నారు. కోట్లు వెచ్చించిన అఫ్ఘాన్ స్పిన్న ర్ రషీద్ నిలకడగా రాణించాడు. లోకల్ హీరో సిరాజ్ కూడా సత్తా చాటుకున్నాడు. 6 మ్యాచ్‌లాడిన సిరాజ్ 10 వికెట్లతో ఫర్వాలేదని పించాడు. బౌలింగ్ పరంగా వేలెత్తిచూపలేని ప్రదర్శన రైజర్స్‌ది. ఎలిమినేటర్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో చేష్టలుడిగినా... బౌలర్లు మాత్రం ఆ 6 ఓవర్లలో తమ శక్తివంచన లేకుండా కష్టపడ్డారు.
టాప్–2లో నిలిచివుంటే: లీగ్ మొత్తాన్ని గమనిస్తే హైదరాబాద్ ప్రదర్శన బాగానే ఉంది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో 8 గెలిచింది. (బెంగళూరుతో మ్యాచ్ రద్దయింది). ఇదేమంత చెత్త ప్రదర్శన కాకపోయినా... కోల్‌కతాతో ఈడెన్‌లో, పుణేతో ఉప్పల్‌లో గెలవాల్సిన రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం రైజర్స్‌ను టాప్–2కు దూరం చేసింది. తొలి రెండు స్థానాల్లో ఉంటే ఫైనల్ చేరేందుకు ఓడినా... మరో అవకాశముండేది. కోల్‌కతాతో జరిగిన పోరులో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మిడిలార్డర్ వైఫల్యం దెబ్బతీసింది. చివర్లో బిపుల్ శర్మ ధాటిగా ఆడినా... నమన్ ఓజా బాధ్యతారాహిత్యం 17 పరుగుల పరాజయాన్నిచ్చింది. ఇక ఉప్పల్‌లో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన దశలో హైదరాబాద్ ఒక్కపరుగైనా చేయలేక మూడు వికెట్లు కోల్పోయి ఓడటం తీవ్రంగా నిరాశపర్చింది. ఈ రెండు ఫలితాలు హైదరాబాద్ లీగ్ దశను మలుపుతిప్పాయి.
‘‘ఈ సీజన్‌లో బెంగళూరు పిచ్ చాలా స్లోగా ఉంది. 130 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే మ్యాచ్ 20 ఓవర్లు పూర్తిగా జరగకపోవడమే మా అవకాశాన్ని దెబ్బతీసింది. పూర్తి కోటా సాగితే మరో రెండు, మూడు వికెట్లు తీసి మేం గెలిచేదారిలో ఉండేవాళ్లం. కానీ దురదృష్టవశాత్తు ఆరు ఓవర్ల ఆటే మా కొంపముంచింది’’
– రైజర్స్ బౌలింగ్ కోచ్ మురళీధరన్