చెన్నైకి సన్‌స్ట్రోక్‌ | Sunrisers Hyderabad crush CSK by 6 wickets | Sakshi
Sakshi News home page

చెన్నైకి సన్‌స్ట్రోక్‌

Published Thu, Apr 18 2019 12:48 AM | Last Updated on Thu, Apr 18 2019 5:32 AM

Sunrisers Hyderabad crush  CSK by 6 wickets - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ ఐపీఎల్‌లో రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఓడిన సన్‌ జట్టు ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఆ వెంటనే మళ్లీ హ్యాట్రిక్‌ పరాజయాలతో డీలా పడింది. తాజాగా సొంతగడ్డపై ‘టేబుల్‌ టాపర్‌’ చెన్నై సూపర్‌ కింగ్స్‌నే దడదడలాడించింది. ప్రత్యర్థిని మొదట బౌలర్లు సమష్టిగా వణికిస్తే... ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో మెరుపులతో సన్‌రైజర్స్‌ విజయాన్ని ఖాయం చేశారు.   

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌–12 సీజన్‌లో వరుస పరాజయాలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గర్జించింది. 6 వికెట్ల తేడాతో సన్‌ రైజర్స్‌ విక్టరీని నమోదు చేసింది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. డు ప్లెసిస్‌ (31 బంతుల్లో 45; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), వాట్సన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) రాణించారు. రషీద్‌ ఖాన్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 16.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. వార్నర్‌ (25 బంతుల్లో 50; 10 ఫోర్లు), బెయిర్‌స్టో (44 బంతుల్లో 61 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు.  తాహిర్‌కు 2 వికెట్లు దక్కాయి. వార్నర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

ఓపెనర్లే ఆడారు... 
ఈ ఐపీఎల్‌లో చాలా జట్లు టాస్‌ గెలిస్తే మరో మాటే లేకుండా ఫీల్డింగ్‌ ఎంచుకుంటున్నాయి. ఇక్కడ దీనికి భిన్నంగా జరిగింది. టాస్‌ చెన్నై గెలిచింది. కానీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. చెన్నై తాత్కాలిక కెప్టెన్‌ రైనా నిర్ణయానికి మద్దతుగా ఓపెనర్లు డు ప్లెసిస్, వాట్సన్‌ ఆడారు. అంతే! అంతవరకే ఇన్నింగ్స్‌ బాగుంది. ఈ ఇద్దరి తర్వాత ఎవరూ ఎక్కువ సేపు నిలబడలేదు. నిలబడిన వారెవరూ కనీసం ఓ మోస్తరు పరుగులు చేయలేదు. ఈ ఓపెనర్లు ఔటయ్యాక ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లోకి వచ్చారు. కానీ ఎవరూ సన్‌రైజర్స్‌ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించలేకపోయారు. సన్‌ బౌలర్లు ఆకట్టుకున్నారు. ఆరుగురు బౌలింగ్‌ చేయగా... నదీమ్, సందీప్‌ శర్మ మినహా ఎవరూ కూడా బంతికో పరుగైన సమర్పించుకోలేదు. అంతబాగా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. 

డు ప్లెసిస్‌ సిక్సర్లు 
సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌లో ఏవైనా చెప్పుకోదగ్గ మెరుపులున్నాయంటే అవి డు ప్లెసిస్‌ సిక్సర్లే. నాలుగు ఓవర్లు ముగిసినా చెన్నై స్కోరు 15 పరుగులే! సందీప్‌ వేసిన ఐదో ఓవర్లో డు ప్లెసిస్, వాట్సన్‌ చెరో ఫోర్‌ కొట్టారు. ఖలీల్‌ అహ్మద్‌ తర్వాతి ఓవర్లో డుప్లెసిస్‌ 6, 4తో వేగం పెంచాడు. నదీమ్‌ వరుస ఓవర్లలో  అతను ఒక్కో సిక్సర్‌ బాదాడు. 9 ఓవర్లు ముగిసేసరికి 70/0 స్కోరుతో పటిష్టంగా ఉంది. కానీ నదీమ్‌ 10వ ఓవర్లో వాట్సన్‌ను ఔట్‌ చేసి ఈ జోడీని విడగొట్టాడు. దీంతో 79 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. కేవలం మూడు బంతుల వ్యవధిలో విజయ్‌ శంకర్‌... డు ప్లెసిస్‌ను ఔట్‌ చేయడంతో చెన్నై జోరుకు అడ్డుకట్టపడింది. 14వ ఓవర్‌ వేసిన రషీద్‌ ఖాన్‌... రైనా (13), జాదవ్‌ (1)లను పెవిలియన్‌ చేర్చాడు. బిల్లింగ్స్‌ (0)ను ఖలీల్‌ అహ్మద్‌ డకౌట్‌ చేశాడు. ఇలా 22 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను చేజార్చుకుంది. తర్వాత రాయుడు (21 బంతుల్లో 25 నాటౌట్‌; 2 ఫోర్లు), జడేజా (20 బంతుల్లో 10 నాటౌట్‌) ఆఖరి 5.2 ఓవర్లు ఆడినా 31 పరుగులే చేయగలిగారు.  

వార్నర్‌... ధన్‌ ధనాధన్‌ 
సులువైన లక్ష్యాన్ని హైదరాబాద్‌ ఓపెనర్‌ వార్నర్‌ ధనాధన్‌ ఫోర్లతో మరింత సులభతరం చేశాడు. బెయిర్‌స్టో, వార్నర్‌ సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. తొలి ఓవర్లో బెయిర్‌స్టో బౌండరీ కొట్టగా 10 పరుగులొచ్చాయి. రెండో ఓవర్లో ఇద్దరూ చెరో ఫోర్‌ బాదడంతో 11 పరుగులు లభించాయి. తర్వాత మూడు, నాలుగు, ఐదు ఓవర్లను వార్నర్‌ ఇష్టంగా ఆడేసుకున్నాడు. ఈ ఓవర్లలో వరుసగా రెండు, మూడు ఫోర్లు బాదడంతో అర్ధసెంచరీకి చేరువయ్యాడు. దీపక్‌ చహర్‌ వేసిన ఆరో ఓవర్లో 4, 4తో 24 బంతుల్లో 10 ఫోర్లతో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న వార్నర్‌... ఆ మరుసటి బంతికే డు ప్లెసిస్‌ చేతికి చిక్కాడు. పవర్‌ ప్లేలో రైజర్స్‌ స్కోరు 68/1. 

బెయిర్‌స్టో ఫిఫ్టీ 
వార్నర్‌ ఔటయ్యే సమయానికి బెయిర్‌స్టో 15 పరుగులే చేశాడు. కెప్టెన్‌ విలియమ్సన్‌ (3) విఫలం కాగా... జట్టును నడిపించే బాధ్యత బెయిర్‌స్టో తీసుకున్నాడు. కరణ్‌ శర్మ వేసిన 11వ ఓవర్లో 2 సిక్సర్లు బాదాడు. అతను అర్ధసెంచరీకి చేరువవుతుండగా... విజయ్‌ శంకర్‌ (7)ను తాహిర్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీపక్‌ హుడా క్రీజులోకి రాగా... కాస్త నెమ్మదించిన బెయిర్‌స్టో 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు.చేయాల్సిన పరుగులు తక్కువే కావడంతో అనవసర షాట్లకు పోకుండా ఇద్దరు నింపాదిగా ఆడారు. హైదరాబాద్‌ విజయానికి 24 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా... కరణ్‌ శర్మ ఇన్నింగ్స్‌ 17వ ఓవర్లో ఫోర్‌ కొట్టిన హుడా (13) విన్నింగ్‌ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచిన బెయిర్‌స్టో మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఆటను ముగించాడు. 

హైదరాబాద్‌ బరిలో... ధోని లేని చెన్నై 
చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఈ మ్యాచ్‌లో ఆడలేదు. వెన్నునొప్పితో ఇబ్బంది పడిన అతనికి ముందస్తు జాగ్రత్తగా విశ్రాంతి ఇచ్చారు. దీంతో సురేశ్‌ రైనా ఈ మ్యాచ్‌కు సారథ్యం వహించాడు.2010 తర్వాత చెన్నై తరఫున ధోని ఆడకపోవడం ఇదే తొలిసారి. ధోని కోసం పోటెత్తిన హైదరాబాదీలను ఇది తీవ్రంగా నిరాశపరిచింది. బిల్లింగ్స్‌ కీపింగ్‌ చేశాడు. సాన్‌ట్నర్‌ స్థానంలో కరణ్‌ శర్మను తీసుకున్నారు. ఇక హైదరాబాద్‌ జట్టులో రికీభుయ్, అభిషేక్‌ శర్మ స్థానాల్లో యూసుఫ్‌ పఠాన్, షాబాజ్‌ నదీమ్‌ జట్టులోకి వచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement