రైజింగ్‌ మొదలైంది | Sunrisers Hyderabad ride on Warner blitz | Sakshi
Sakshi News home page

రైజింగ్‌ మొదలైంది

Published Sat, Mar 30 2019 1:35 AM | Last Updated on Sat, Mar 30 2019 4:16 PM

Sunrisers Hyderabad ride on Warner blitz - Sakshi

199 పరుగుల విజయ లక్ష్యం. చూస్తే కష్టంగానే అనిపించినా సన్‌రైజర్స్‌ సవాల్‌ను స్వీకరించింది. మరో ఓవర్‌ మిగిలి ఉండగానే రాజస్తాన్‌ను ఓడించి గెలుపు తీరం చేరింది. వార్నర్‌ మెరుపు బ్యాటింగ్‌కు బెయిర్‌స్టో జోరు తోడై శుభారంభం దక్కడంతో  హైదరాబాద్‌ పని సులువైంది. మధ్యలో విజయ్‌ శంకర్‌ దూకుడు జట్టుకు గెలుపు అందించడంలో కీలక పాత్ర పోషించాయి. అంతకుముందు అద్భుత సెంచరీ సాధించి  సంజు సామ్సన్‌ రాయల్స్‌కు భారీ స్కోరు అందించాడు.   

సాక్షి, హైదరాబాద్‌: సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ విజయంతో బోణీ చేసింది. సీజన్‌లో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 5 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. సంజు సామ్సన్‌ (55 బంతుల్లో 102 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా... అజింక్య రహానే (49 బంతుల్లో 70; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం సన్‌రైజర్స్‌ 19 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసి గెలిచింది. వార్నర్‌ (37 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా... బెయిర్‌స్టో (28 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1 సిక్స్‌), విజయ్‌ శంకర్‌ (15 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. రషీద్‌ ఖాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’అవార్డు లభించింది.  

పేలవ ఆరంభం... 
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌ దూకుడుగా ఆడటంలో విఫలమైంది. ఓపెనర్లు రహానే, బట్లర్‌ తడబడుతూ ఆడారు. ఇన్నింగ్స్‌ 17వ బంతికి గానీ మొదటి బౌండరీ రాలేదు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న బట్లర్‌ (5)ను తన రెండో బంతికే బౌల్డ్‌ చేసి రషీద్‌ దెబ్బ తీశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి రాయల్స్‌ కేవలం 3 ఫోర్లతో 35 పరుగులే చేయగలిగింది.  

రహానే అర్ధ సెంచరీ... 
కెప్టెన్‌ రహానే ఇన్నింగ్స్‌ చాలా వరకు ఎలాంటి టి20 మెరుపులు లేకుండా సాధారణంగానే సాగింది. దాదాపు బంతికో పరుగు చొప్పున మాత్రమే అతను చేస్తూ పోయాడు. ఒక దశలో అతను 29 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఆ తర్వాత నదీమ్, విజయ్‌ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ కొట్టి కొంత జోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత నదీమ్‌ ఓవర్లోనే మరో సిక్సర్‌ బాదిన రహానే... అదే ఓవర్లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో పాండేకు క్యాచ్‌ ఇచ్చాడు.  

సూపర్‌ సంజు... 
తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌గా మలచి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సామ్సన్‌ చివరి వరకు అదే జోరు కొనసాగించాడు. నదీమ్, కౌల్‌ ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ కొట్టి దూకుడు పెంచిన అతను.... ఆ తర్వాత చూడచక్కటి షాట్లు కొట్టాడు. 34 బంతుల్లో సంజు హాఫ్‌ సెంచరీ పూర్తయింది. 58 పరుగుల వద్ద అతనికి అదృష్టం కలిసొచ్చింది. కౌల్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడబోగా బంతి మిడ్‌ వికెట్‌ ప్రాంతంలోనే గాల్లో చాలా ఎత్తుకు లేచింది. క్యాచ్‌ పట్టేందుకు ఇద్దరు ఫీల్డర్లతో పాటు కీపర్‌ బెయిర్‌స్టో కూడా పరుగెత్తుకొచ్చాడు. అయితే బంతి బెయిర్‌స్టో చేతుల్లో పడినా...అతను దానిని నియంత్రించలేకపోవడంతో సామ్సన్‌ బతికిపోయాడు. ఈ ఓవర్‌ తర్వాత మరింత చెలరేగిన సంజు తర్వాతి 13 బంతుల్లోనే 42 పరుగులు బాదడం విశేషం. 54 బంతుల్లో సామ్సన్‌ సెంచరీ చేశాడు.  

అయ్యో భువనేశ్వర్‌... 
ఐపీఎల్‌లో ఒకప్పుడు అద్భుత బౌలర్‌గా, ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఒంటి చేత్తో సన్‌రైజర్స్‌కు విజయాలు అందించిన భువనేశ్వర్‌ గత సీజన్‌ నుంచి కొంత కళ తప్పినట్లున్నాడు. 2018లో కూడా అతను 12 మ్యాచ్‌లలో 9 వికెట్లే తీయగలిగాడు. తాజా సీజన్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఒక ఓవర్లో రసెల్‌ 2 ఫోర్లు, 2 సిక్సర్లు సహా 21 పరుగులు రాబట్టిన తీరు మరవక ముందే మరో సారి అతని బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆడుకున్నారు. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో సామ్సన్‌ వరుసగా 6, 4, 4, 2, 4, 4 కొట్టడంతో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. అయితే అది అంతటితో ఆగిపోలేదు. భువీ వేసిన చివరి ఓవర్లో స్టోక్స్‌ చెలరేగిపోయాడు. అతను కూడా 3 ఫోర్లు బాదడం, సామ్సన్‌ మరో ఫోర్‌ కొట్టడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. తొలి 2 ఓవర్లలో 10 పరుగులే ఇచ్చిన భువీ... తర్వాతి 2 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చాడు.  

వార్నర్‌ దూకుడు... 
సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో డేవిడ్‌ వార్నర్‌ సత్తా చాటాడు. ధావల్‌ కులకర్ణి వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతిని ఫోర్‌గా మలచిన అతను అదే ఓవర్లో మరో సిక్సర్‌ కొట్టాడు. ఆ తర్వాత స్టోక్స్‌ ఓవర్లో అతను మూడు ఫోర్లు బాదడం విశేషం. 26 బంతుల్లో వార్నర్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గౌతమ్‌ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టి దూసుకుపోతున్న తరుణంలో అతని జోరుకు స్టోక్స్‌ అడ్డుకట్ట వేశాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో పుల్‌కు ప్రయత్నించి ఔట్‌ కావడంతో వార్నర్‌ ధాటైన ఇన్నింగ్స్‌ ముగిసింది.  

ఆకట్టుకున్న బెయిర్‌స్టో... 
వార్నర్‌తో పోటీ పడుతూ శుభారంభం అందించిన బెయిర్‌స్టో కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఒక దశలో అతను ఐదు బంతుల వ్యవధిలో నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. గోపాల్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా బెయిర్‌ స్టో కొట్టిన సిక్సర్‌ అతని ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. అయితే గోపాల్‌ బౌలింగ్‌లోనే మరో భారీ షాట్‌కు ప్రయత్నించగా లాంగాఫ్‌లో ధావల్‌ అద్భుత క్యాచ్‌ పట్టడంతో వెనుదిరగాల్సి వచ్చింది.  

విజయ్‌ శంకర్‌ దూకుడు... 
గత మ్యాచ్‌లో కూడా చక్కటి ప్రదర్శన కనబర్చిన విజయ్‌ శంకర్‌ ఈసారి మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత దూకుడుగా ఆడాడు. ధావల్‌ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను ఉనాద్కట్‌ ఓవర్లో మరో సిక్స్‌ బాదాడు. అయితే అద్భుతమైన బంతితో శంకర్‌కు కళ్లెం వేసిన గోపాల్‌...అదే ఓవర్లో పాండే (1)ను కూడా ఔట్‌ చేశాడు.  

ఉత్కంఠకు గురైనా... 
ఒకే ఓవర్లో శంకర్, పాండే ఔటైన తర్వాత 26 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో సన్‌ కొంత తడబడింది. అయితే యూసుఫ్‌ పఠాన్‌ (16 నాటౌట్‌), రషీద్‌ ఖాన్‌ (15 నాటౌట్‌) ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆర్చర్‌ వేసిన 19వ ఓవర్లో రషీద్‌ వరుసగా 4, 6 కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

►ఐపీఎల్‌లో సామ్సన్‌కిది రెండో సెంచరీ.  ఓవరాల్‌గా ఐపీఎల్‌  చరిత్రలో 53 సెంచరీలు  నమోదయ్యాయి. ఇందులో భారత ఆటగాళ్ల సెంచరీలు 20 ఉన్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement