సన్‌రైజర్స్ పుంజుకుంటుందా..?
►నేడు పుణేతో తలపడనున్న హైదరాబాద్
► సొంతగడ్డపై బలంగా వార్నర్‌సేన
►వరుస విజయాల జోరులో సూపర్‌జెయింట్
హైదరాబాద్: ప్లే ఆఫ్‌లో చోటే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఓటమన్నదే లేకుండా సాగుతున్న హైదరాబాద్.. ఈ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న పుణే ఇదే జోరును కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గిన పట్టికలో రెండోస్థానానికి ఎగబాకుతారు.
అజేయంగా వార్నర్‌సేన..
డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ సీజన్‌లో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై అదేస్థాయి ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ ఆయా మ్యాచ్‌ల్లో విజయాన్ని నమోదు చేసింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన వార్నర్‌సేన ఆరు విజయాలు, నాలుగు పరాజయాలు మూటగట్టుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఓవారల్‌గా 13 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆడిన చివరిమ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వార్నర్‌సేన 185 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ సమష్టిగా రాణించారు. ముఖ్యంగా డాషింగ్ ఆల్‌రౌండర్ మెరుపు ఇన్నింగ్స్‌తో గాడిలో పడ్డాడు.
అతని ధాటికి సన్‌రైజర్స్ భారీస్కోరును నమోదు చేసింది. అయితే టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ ఆ మ్యాచ్‌లో మాత్రం తేలిపోయింది. దీంతో ఆరు వికెట్లతో ఓటమిపాలైంది. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరుగకుండా చూడాలని జట్టు యాజమాన్యం కృతనిశ్చయంతో ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూలస్తంభంలా నిలిచాడు. ఇప్పటివరకు పది మ్యాచ్‌లాడిన వార్నర్ 489 పరుగులతో టోర్నీలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
దీంతో ‘ఆరెంజ్ క్యాప్’ను తన సొంతం చేసుకున్నాడు. శిఖర్ ధావన్ (369 పరుగులు), కేన్ విలియమ్సన్ (228 పరుగులు), మోజెస్ హెన్రిక్స్ (225 పరుగులు), యువరాజ్ సింగ్ (187 పరుగులు)లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. దీపక్ హుడా, నమన్ ఓజాలకు బ్యాటింగ్‌లో అంతగా అవకాశాలు రాలేదు. ఇక బౌలింగ్ విషయానికొస్తే ముందే చెప్పినట్లుగా టోర్నీలోనే పటిష్టమైన బౌలింగ్ లైనప్ సన్‌రైజర్స్ సొంతమనడంలో సందేహం లేదు. పేసర్ భువనేశ్వర్ కుమార్ పది మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో టోర్నలో అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. దీంతో ‘పర్పుల్ క్యాప్’ను తన సొంత చేసుకున్నాడు. అఫ్గాన్ యువ సంచలనం రషీద్ ఖాన్ 12 వికెట్లతో సత్తాచాటాడు. ఆశిష్ నెహ్రా, సిద్దార్థ్ కౌల్, మహ్మద్ సిరాజ్, హెన్రిక్స్ ఆకట్టుకుంటున్నారు.
గత సీజన్‌లో హైదరాబాద్, పుణే జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగగా.. ఇరుజట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. మరోవైపు ఈ సీజన్‌లో పుణేలో జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు పరస్పరం తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చెలరేగడంతో పుణే విజయం సాధించింది. దీంతో శనివారం మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. అలాగే తనకెంతో అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో పుణేను కంగుతినిపించాలని కృతనిశ్చయంతో ఉంది.
పుణే జోరు..
మరోవైపు ఈ సీజన్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ జోరుమీదుంది. ముఖ్యంగా పుణే ఆడిన చివరి ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేసింది. ఈ క్రమంలో పటిష్టమైన కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్లపై గెలుపొందింది. ఓవరాల్‌గా 11 మ్యాచ్‌లాడిన పుణే ఏడు విజయాలు, నాలుగు పరజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చివరిమ్యాచ్ కోల్‌కతాపై రాహుల్ త్రిపాఠీ వన్‌మ్యాన్ షోతో జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. సహచరులంతా విఫలమైనా వేళ.. ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన త్రిపాఠి సమయోచిత బ్యాటింత్‌తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టోర్నీలో ఖరీదైన ఆటగాడు బెన్‌స్టోక్స్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో పుణే జట్టు ఫుల్‌జోష్‌లో ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ స్టీవ్ స్మిత్ (333 పరుగులు) జట్టు బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు.
గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా త్వరలో తను గాడిలో పడతాడని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇక రాహుల్ త్రిపాఠి 9 మ్యాచ్‌ల్లో 352 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. బెన్ స్టోక్స్ (244 పరుగులు), ఎంఎస్ ధోని (204 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. అజింక్య రహానే (226 పరుగులు), మనోజ్ తివారీ (190 పరుగులు) గాడిలో పడాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే ఇమ్రాన్ తాహిర్ అంచానలకు మించి రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన తాహిర్ 17 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. జయదేవ్ ఉనాద్కట్ (12 వికెట్లు), బెన్ స్టోక్స్, డాన్ క్రిస్టియన్, శార్దుల్ ఠాకూర్ రాణిస్తున్నారు.
మరోవైపు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మధ్య ఓవర్లలో పరుగులు నియంత్రిస్తున్నాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో పుణే అద్భుత విజ యం సాధించింది. శనివారం మ్యాచ్‌లో అదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఆశిస్తోంది. అయితే సొంతగడ్డపై సత్తా చాటే హైదరాబాద్‌ను పుణేను ఎంతవరకు నిలువరిస్తుందో చూడాలి.