
మృతదేహం వద్ద విలపిస్తున్న బాధిత బంధువులు
కొరాపుట్: జిల్లాలోని దశమంతపూర్ సమితిలో ఉన్న దంబాగుడ గ్రామపంచాయతీ, హతిముండా గ్రామంలో రెండు వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ధనపతి జాని(35), సహదేవ్ జాని(45) ఉండగా, గాయాలపాలైన వారిలో ధనేశ్వర్ జాని, సేనాపతి జాని, దిబా పొరిజ, రొజు జాని, మనోహర్ జాని, అంగరా జాని, చెండియా జాని ఉన్నారు. అయితే క్షతగాత్రుల్లో సేనాపతి జాని, ధనేశ్వర్ జానిల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన వైద్యసేవల కోసం కొరాపుట్ సహిద్ లక్ష్మణ్ నాయక్ హాస్పిటల్‌కి తరలించారు.
కాగా, విషయం తెలుసుకున్న కొరాపుట్ డీఎస్పీ నిరంజన్ బెహరా గ్రామానికి చేరుకుని, గొడవకు గల కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో పాతకక్షల కారణంగా కొట్టుకున్నట్లు కొంతమంది.. ఆస్తి తగాదాలని మరికొంతమంది.. ఇరువర్గాల్లో ఓ వర్గం వారు చేతబడి చేస్తున్నారన్న కారణంతో ఘర్షణకు దిగినట్లు మరికొంతమంది చెప్పారు. ప్రస్తుతం ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి భద్రతా బలగాలను మోహరింపజేసినట్లు సమాచారం. ఇంతవరకు ఈ దుర్ఘటనకు సంబంధించి, నిందితులుగా పేర్కొంటూ ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని, పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే చర్యలు చేపడతామని ఐఐసీ అధికారి బిజయ్‌రాజ్ మజ్జి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment