
అగ్నిప్రమాదంలో చనిపోయింది 19మందే
భువనేశ్వర్ : ఎస్యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 19మందే మృతి చెందినట్లు ఒడిశా ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సోమవారం రాత్రి ఎస్యూఎం ఆస్పత్రిలో షార్ట్ స్కర్యూట్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్రమాదంలో 22మంది చనిపోయినట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా నిన్న ప్రకటించింది.
అయితే ప్రమాద ఘటనలో 19మందే మరణించినట్లు వైద్యశాఖ వర్గాలు తెలిపాయి. క్యాపిటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 14మంది చనిపోగా, తీవ్రంగా గాయపడ్డ మరో అయిదుగురు అమ్రి ఆస్పత్రిలో మరణించినట్లు వెల్లడించాయి. గాయపడ్డ మరో 106మందికి చికిత్స కొనసాగుతున్నట్లు హెల్త్ సెక్రటరీ ఆర్తి అహుజా తెలిపారు. ఆర్తీ అహుజా మంగళవారం ఉదయం ఎస్యూఎం ఆస్పత్రిని సందర్శించి, దుర్ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
19 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తయిందని, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వాహనాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. విచారణ నిమిత్తం ఇక ప్రమాదం సంభవించిన ఐసీయూతో పాటు ఎమర్జెన్సీ యూనిట్లను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఒడివా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారణకు ఆదేశించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆయన సూచించారు. క్షతగాత్రులకు ముఖ్యమంత్రి ఇవాళ పరామర్శించనున్నారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.