ఆస్పత్రిలో మంటలు | 24 Killed After Major Fire At Bhubaneswar's SUM Hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో మంటలు

Published Tue, Oct 18 2016 1:48 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ఎస్యూఎం ఆస్పత్రిలో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న సహాయక సిబ్బంది - Sakshi

ఎస్యూఎం ఆస్పత్రిలో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్న సహాయక సిబ్బంది

24 మంది ఆహుతి 75 మందికి గాయాలు
ఒడిశాలోని భువనేశ్వర్ ఎస్‌యూఎంలో దుర్ఘటన
డయాలసిస్ వార్డులో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
ఐసీయూకు మంటలు అంటుకొని పలువురు మృతి
500 మందిని రక్షించిన అధికారులు, స్థానికులు
మృతుల కుటుంబాలకు ప్రధాని తీవ్ర సంతాపం

భువనేశ్వర్‌లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎస్‌యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, 75 మంది గాయపడ్డారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న డయాలసిస్ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఐసీయూకు వ్యాపించడంతో ఈ  ప్రమాదం చోటుచేసుకుంది.

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో సోమవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. ఎస్‌యూఎం ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 75 మంది గాయపడ్డారు. ఆస్పత్రి మొదటి అంతస్తులో ఉన్న డయాలసిస్ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా పక్కనే ఉన్న ఐసీయూకు  వ్యాపించాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న అనేక మంది తీవ్రంగా గాయపడగా వారిని నగరంలోని పలు ఆస్పత్రులకు తరలించారు. క్యాపిటల్ ఆస్పత్రికి తరలించిన వారిలో 14 మంది, కార్పొరేట్ ఆస్పత్రిలో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

కిటికీలు పగులగొట్టి బయటపడ్డ రోగులు
మరోవైపు ఆస్పత్రిలోని ఇతర విభాగాలకు కూడా మంటలు వ్యాపించాయన్న పుకార్లతో రోగులు, వారి బంధువులు, ఆస్పత్రి సిబ్బంది పరుగులు తీశారు. పలువురు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆస్పత్రిలో చిక్కుకున్న 500 మందిని రక్షించారు. మంటల్ని అదుపు చేసేందుకు, సహాయక కార్యక్రమాల కోసం ఏడు అగ్నిమాపక బృందాలు శ్రమించాయని ఫైర్ సర్వీస్ డీజీ బినయ్ బెహెరా తెలిపారు.

క్షతగాత్రుల్ని తరలించేందుకు పదుల సంఖ్యలో అంబులెన్స్‌ల్ని మోహరించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు రోగులు నాలుగు అంతస్తుల భవంతి అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. గాయపడ్డవారిలో పలువురు అమ్రి, అపోలో, కళింగ ఆస్పత్రులతో పాటు ఎస్‌సీబీ మెడికల్ కాలేజీ, కటక్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదంపై విచారణకు ఆదేశం
ఐసీయూలోని రోగుల్ని ఇతర ఆస్పత్రులకు తరలించామని ఎస్‌యుఎం ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ బసంత పాటి చెప్పారు. ఈ సంఘటన పై జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, ఫైర్ సిబ్బందితో విచారణ సంఘం ఏర్పాటు చేశామని ఒడిశా వైద్య కార్యదర్శి ఆర్తి అహుజా తెలిపారు. ఆస్పత్రి యాజ మాన్యం తప్పుందని తేలితే చర్యలు తీసుకుంటామని వైద్య శాఖ మంత్రి అత్ను సబ్యసాచి నాయక్ చెప్పారు.

మోదీ తీవ్ర విచారం
ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురి మరణంతో తీవ్రంగా కలత చెందానని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు. గాయపడ్డవారిని ఎయిమ్స్‌కు తరలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సూచించారు. బాధితులకు అన్ని విధాలా సాయం చేయాలని మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదేశించారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement