మల్కన్‌గిరి/కొరాపుట్: మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని, పలు ఎదురుకాల్పుల ఘటనల్లో ప్రత్యక్షంగా భాగస్వామ్యమైన ముగ్గురు మావోయిస్టులు ఆదివారం బాహ్య సమాజంలోకి అడుగుపెట్టారు. వీరంతా ఒడిశా డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అభయ్ ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు ఆయన మల్కన్‌గిరి, కొరాపుట్ జిల్లాల్లో పర్యటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కన్‌గిరి జిల్లా కలిమెట సమితి ఎంవీ 79 పోలీస్ స్టేషన్ పరిధిలోని టిగాల్ పంచాయతీ తామాన్‌పల్లి గ్రామానికి చెందిన రమే పోడియామి అలియాస్ సబితకు చిన్నతనం నుంచే మావోయిస్టు కర్యకలాపాల పట్ల ఆశక్తి ఉండేది.
2000లో కలిమెల దళంలో చేరి, అప్పటి సభ్యులు రామన్న, లోకనాథ్ వద్ద శిక్షణ పొందింది. పలు సందర్భాల్లో పోలీసులతో ఎదురు కాల్పులు, ఇన్ఫార్మర్ నెపంతో హత్యలు, సెల్‌టవర్ల పేల్చివేత కార్యకలాపాల్లో పాల్గొంది. కొద్దిరోజులు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్‌లో, సుకుమ జిల్లా కిష్టరామ్ ప్రాంతంలో పనిచేసింది. అయితే... దళంలో రక్షణ లేకపోవడం, కరోనాతో దళ సభ్యులు చనిపోతున్నా తనను వైద్యం కోసం బయటకు వెళ్లేందుకు అనుమతించక పోవడంతో విసుగు చెందానని ఆమె చెప్పుకొచ్చింది. ఒడిశా ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, తన స్వగ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని.. ఈ నేపథ్యంలో స్వచ్ఛందంగా లొంగిపోతున్నట్లు స్పష్టంచేసింది.
ఆర్కేకు రక్షణగా..
కొరాపుట్ జిల్లాలో పర్యటించిన డీజీపీ.. ముందుగా భువనేశ్వర్ నుంచి ప్రత్యేక హెలీకాఫ్టర్‌లో సునాబెడాలోని హిందూస్థాన్ ఎరోనాటిక్ లిమిటెడ్(హాల్) వద్ద దిగారు. ఎస్‌ఓజీ 3వ బెటాలియన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర–ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన బొయిపరిగుడ మావోయిస్ట్ ఏరియా కమిటీ సభ్యురాలు తులసా హుయికా డీజీపీ ఎదుట లొంగిపోయారు. నారాయణపట్న సమితిలోని పిల్‌బోర్ గ్రామానికి చెందిన ఆమె.. 13 ఏళ్ల వయస్సులో 2012లో జననాట్య మండలికి ఆకర్షితురాలై దళంలో చేరింది. మిలటరీ శిక్షణలో భాగంగా 303 రైఫిల్ శిక్షణ పొంది, 2015లో అగ్రనేత ఆర్కేకి రక్షణగా పనిచేసింది.
ఆంధ్ర, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పలు విధ్వంసకర ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. కాగా తులసాను డీజీపీ సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు అందుతాయని హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్, ఎస్‌ఓజీ సేవలను కొనియాడారు. గత రెండేళ్లలో కొరాపుట్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారని కొనియాడారు. కార్యక్రమంలో ఇంటిలిజెన్స్ డైరెక్టర్ లళిత్‌దాస్, ఐజీ ఆపరేషన్స్ అమితాబ్ ఠాకుర్, బీఎస్‌ఎఫ్ ఐజీ మధుసూదన్ శర్మ, ఐజీ హెడ్‌క్వార్టర్ దేవదత్త సింగ్, జిల్లా పీస్పీ వరుణ్ గుంటుపల్లి, బీఎస్‌ఎఫ్ కమాండెంట్ సర్జన్‌సింగ్ తన్వర్, తదితరులు పాల్గొన్నారు.
చిన్నచూపు చూపడంతో..
రాయిధర్ సొంత గ్రామం మత్తిలి సమితి కర్తన్‌పల్లి దల్‌దోలి గ్రామం. ఊరిలో మావోయిస్టులు పర్యటించిన సమయంలో చేసిన విప్లవ గీతాలపై ఆకర్షణతో దళంలో చేరాడు. మత్తిలి సమితిలో ఎదురు కాల్పులు, రోడ్డు పనులు జరిపే వాహనాలు దహనం చేయడం, జావాన్లను టార్గెట్ చేసి మందుపాతర అమర్చడం వంటివాటిలో కీలకపాత్ర వహించాడు. అయితే దళంలో చిన్నచూపు చూడటంతో జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లు వివరించాడు. ఈ సందర్భంగా డీజీపీ అభయ్ మాట్లాడుతూ... మావోయిస్టులకు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు త్వరితగతిన అందేవిధంగా చర్యలు తీసుకొంటామన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అడవిలో ఉంటే అనారోగ్యంపాలై, ఇబ్బందులు తప్పవని, లొంగిపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్ స్వొంయిమిన్నా, బీఎస్‌ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.
చిన్నచూపు చూపడంతో.. వనం నుంచి జనంలోకి..
Published Mon, Jul 19 2021 10:31 AM | Last Updated on Mon, Jul 19 2021 10:38 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment