భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము 3 రోజుల రాష్ట్ర పర్యటన గందరగోళంగా మారింది. ఆమె చివరి రోజు పర్యటనలో పలు సమస్యాత్మక పరిస్థితులు తలెత్తాయి. దీంతో రాష్ట్రపతి పర్యటనలో భద్రత లోపించిందనే ఆరోపణలు బలపడుతున్నాయి. మయూర్‌భంజ్ జిల్లా బరిపద మహారాజా శ్రీరామచంద్ర భంజ్‌దేవ్ విశ్వ విద్యాలయంలో శనివారం జరిగిన స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగిస్తుండగా.. 9నిమిషాల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే.
ఈ వివాదం చల్లారక ముందే మరో వివాదం తెరకెక్కింది. సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము శుక్రవారం మయూర్‌భంజ్ జిల్లా సిమిలిపాల్ టైగర్ రిజర్వ్(ఎస్‌టీఆర్)ను సందర్శించారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ విధుల్లో ఉన్న ఫార్మసిస్ట్ జస్వంత్ బెహరా అత్యంత భద్రత, కీలకమైన భారతదేశ ప్రథమ మహిళ ప్రయాణించనున్న హెలీకాప్టర్(ఛాపర్)తో సెల్ఫీలు దిగారు.
జషిపూర్ సమీపం చెలిగోధులి హెలీప్యాడ్‌లో దిగిన తర్వాత రాష్ట్రపతి రోడ్డు మార్గంలో సిమిలిపాల్ జాతీయ పార్కును సందర్శించారు. ఆమె సందర్శన దృష్ట్యా ఈనెల 4, 5 తేదీల్లో సాధారణ సందర్శకుల పర్యటన నివారించారు. ఈ సందర్భంగా ప్రత్యేక విధులకు నియమితులైన సిబ్బంది రాష్ట్రపతి హెలీకాప్టర్‌తో సెల్ఫీ తీసుకోవడం సమస్యగా తయారైంది. ఈ వ్యవహారం రాష్ట్రపతి భద్రతపై ప్రశ్నలు తలెత్తడంతో జస్వంత్ బెహరా పోస్ట్‌ను తొలగించినట్లు సమాచారం.
సిబ్బందిపై వేటు..
మరోవైపు యూనివర్సిటీలో విద్యుత్ అంతరాయం ఏర్పడిన సమయంలో ముర్మును ఎందుకు సురక్షిత ప్రదేశానికి తరలించలేదని భద్రతా నిపుణులు ఇంతకుముందు ప్రశ్నించగా.. ఇది రాష్ట్రపతి కార్యక్రమాన్ని విధ్వంసం చేసే ప్రయత్నమని బీజేపీ కార్యాలయం ఆరోపించింది. రాష్ట్రపతి ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఈ చిక్కు సమస్య చోటు చేసుకుంది.
విద్యుత్ సరఫరా అంతరాయంతో దీపాలు ఆరిన వేదిక వద్ద ఉన్న మైక్ సిస్టమ్ ప్రభావితం కాకపోవడంతో ఆమె ప్రసంగం నిరవధికంగా కొనసాగించారు. ఉదయం 11.56 గంటల నుంచి మధ్యాహ్నం 12.05 గంటల వరకు ఈ పరిస్థితి కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యూనివర్సిటీ అధికారులు ఎలక్ట్రీషియన్ జయంత్ త్రిపాఠిని విధుల నుంచి తొలగించారు. పర్యటన ఏర్పాట్ల లోపాలపై విచారణకు రిజిస్ట్రార్, పీజీ కౌన్సిల్ చైర్మన్, డెవలప్‌మెంట్ అధికారితో కూడిన ముగ్గురు సభ్యుల బృందం నియమించారు. ఈ బృందం విచారణ ఆధారంగా బాధ్యులను ఖరారు చేసి తగిన చర్యలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment