భువనేశ్వర్
భువనేశ్వర్ ఆరంభంలోనే కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కుప్పకూల్చగలడు... చివర్లో బౌలింగ్‌కు వచ్చి హిట్టింగ్ చేస్తున్న బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపి మ్యాచ్‌ను గెలిపించగలడు... మధ్య ఓవర్లలో మ్యాచ్‌పై పట్టు పోతుందేమో అనిపించినప్పుడు వచ్చి నేనున్నానంటూ వికెట్ తీసి ఆటను మలుపు తిప్పగలడు... ఇక మన ఆట ముగిసిపోయిందని అనిపించినప్పుడు క్రీజ్‌లోకి వచ్చి బ్యాట్స్‌మన్‌లా బాధ్యతగా ఆడగలడు... దక్షిణాఫ్రికా పర్యటనలో అతను చేయలేని పని ఏదైనా ఉందా? కేప్‌టౌన్‌లో తొలి టెస్టు తొలి రోజు నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో తొలి టి20 వరకు భువీ ముద్ర బలంగా కనిపించింది. ఎంత గొప్పగా ఆడినా దిక్కులు పిక్కటిల్లే సంబరాలు ఉండవు. మ్యాచ్ మ్యాచ్‌కూ జుట్టు రంగు మార్చుకునే కొత్త వేషాలు కనిపించవు. దేశంలో కత్తెరలకు కేరాఫ్ అడ్రస్ మీరట్ నగరం నుంచి వచ్చిన ఈ స్టార్ మూడు ఫార్మాట్‌లలో కేవలం తన ఆటతోనే అంతటా తానై కనిపించాడు.
సాక్షి క్రీడా విభాగం:దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిన తొలి టెస్టులో మన జట్టు తరఫున చెప్పుకోదగ్గ విశేషం ఏదైనా ఉందీ అంటే అది భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రమే. తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి సఫారీల స్కోరును 12/3కు పరిమితం చేసిన అతను అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత రెండు ఇన్నింగ్స్‌లలో కీలక పరుగులు కూడా చేశాడు. కానీ ఇలాంటి ఆట తర్వాత కూడా అతడిని రెండో టెస్టు నుంచి దూరంగా ఉంచారు. కారణమేదైనా ఈ తప్పుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మూడో టెస్టులో భువీని మళ్లీ తీసుకోగా... తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మరోసారి పదునైన బౌలింగ్‌తో పాటు రెండు ఇన్నింగ్స్‌లలో పట్టుదలగా ఆడిన చేసి పరుగులే జట్టును గెలిపించి అతడిని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిపాయి. ఆ తర్వాత వన్డేల్లోనూ చక్కటి ఆటతీరు ప్రదర్శించిన భువనేశ్వర్... తాజాగా టి20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మూడు ఫార్మాట్‌లలో తన విలువేంటో చూపించాడు. మొత్తంగా అటు కోహ్లి తర్వాత ఇటు భువీనే దక్షిణాఫ్రికా పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేశాడు.
బంతి రంగు మారిందంతే...
భువనేశ్వర్ పరిమిత ఓవర్ల బౌలర్ మాత్రమే అన్నట్లుగా ఇటీవలి వరకు అతనికి గుర్తింపు కొనసాగింది. కెరీర్ ఆరంభంలో పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని రాణించే, పెద్దగా వైవిధ్యమేమీ చూపకుండా కచ్చితత్వంతో బంతులు విసిరే బౌలర్‌గానే కనిపించాడు. టి20ల్లో పరిస్థితులు బాగుంటే ఆరంభంలో ఒక్క స్పెల్‌లోనే అతనితో నాలుగు ఓవర్లు వేయించేసి కెప్టెన్ పని ముగించేవారు. కానీ కొన్నాళ్లుగా బౌలింగ్‌లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు అతను ఒకే తరహాలో లేదా స్వింగ్‌ను మాత్రమే నమ్ముకొని బంతులు వేసే బౌలర్ కాదు. పిచ్‌పై తేమ తగ్గిపోయిన తర్వాత కూడా అతను ప్రభావవంతంగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు అతని బౌలింగ్‌లో వేగం 120–130 కిలో మీటర్ల మధ్యలోనే ఉండింది. ఇప్పుడు 140 కిమీ కూడా దాటుతోంది. పైగా వేగాన్ని అందుకునే ప్రయత్నంలో గతి తప్పడం లేదు. అద్భుతంగా మలుచుకున్న ఫిట్‌నెస్ కూడా అందుకు కారణం. దాని వల్లే మైదానంలో ఫీల్డింగ్‌లో కూడా చాలా చురుగ్గా మారిపోయాడు. తాజాగా దక్షిణాఫ్రికాలో అతని ప్రదర్శన చూస్తే ఇక అతను ఏమాత్రం ఒకే తరహా శైలి బౌలర్ మాత్రం కాదని అర్థమైపోయింది.
సఫారీ గడ్డపై జోరుగా...
భువనేశ్వర్ టెస్టు కెరీర్‌లో 2014 ఇంగ్లండ్ సిరీస్‌లో 19 వికెట్లతో చెలరేగడం అత్యుత్తమ దశ. అయితే ఆ తర్వాత కూడా టెస్టుల్లో అతనిపై పెద్దగా నమ్మకం ఉంచలేదు. కానీ ఈ పర్యటనలో అతను అన్ని విధాలా దానిని తప్పని నిరూపించాడు. తొలి రోజు సఫారీ ఓపెనర్లతో పాటు ఆమ్లా వికెట్ తీసిన తీరు అతను ఈ సిరీస్ కోసం ఎలా సన్నద్ధమయ్యాడో చూపించింది. ఆ తర్వాత డి కాక్ వికెట్ కూడా పడగొట్టాడు. అయితే వికెట్లు తీసిన తీరుకంటే భువీ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా తడబడటం అతని సత్తాకు నిదర్శనం. జొహన్నెస్‌బర్గ్ టెస్టు గెలుపులో నిస్సందేహంగా భువీదే ప్రధాన పాత్ర. తొలి ఇన్నింగ్స్‌లో చకచకా చేసిన 30 పరుగులు, అనూహ్యమైన బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌కు ప్రమాదకరంగా మారిన పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 33 పరుగులు మ్యాచ్ స్వరూపాన్ని మార్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ ఎల్గర్, మార్క్‌రమ్‌లతో పాటు డివిలియర్స్‌ను అద్భుత బంతితో బౌల్డ్ చేసి భువీ ఈ మ్యాచ్ చేయిదాటిపోకుండా చూశాడు. ఈ కష్టాన్ని గుర్తించే కాబోలు ఆరో వన్డేకు ముందు ‘నిజంగా విశ్రాంతి ఇవ్వాల్సిందంటే భువనేశ్వర్‌కే’ అంటూ కెప్టెన్ కోహ్లి వ్యాఖ్యానించాడు. వాస్తవానికి ఆల్‌రౌండర్ అంటూ హార్దిక్ పాండ్యాపై అందరి గురి నిలిచింది కానీ భారత జట్టుకు సంబంధించి ఇప్పుడు అసలైన ఆల్‌రౌండర్ భువనేశ్వరే. తొలి టి20 మొదటి స్పెల్‌లో 3 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన భువీ, తన చివరి ఓవర్లో మరో 3 వికెట్లతో మ్యాచ్‌ను గెలిపించడం విశేషం.
కొత్త అస్త్రంతో...
ఆటపై బ్యాటింగ్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో బౌలర్లు ప్రతీ సారి భిన్నంగా ప్రయత్నించాల్సి ఉంటోంది. అదే క్రమంలో భువనేశ్వర్ ‘నకుల్ బాల్’ను ప్రత్యేకంగా సాధన చేశాడు. టి20 మ్యాచ్‌లో అతను దానిని సమర్థంగా ఉపయోగించాడు. ఇందులో సఫలం అయ్యేందుకు దాదాపు ఏడాదిగా శ్రమిస్తున్నట్లు భువనేశ్వర్ చెప్పాడు. నకుల్ బాల్ అనేది బేస్‌బాల్ క్రీడ నుంచి వచ్చింది. పేరులో నకుల్స్ (వేలి మెటికలు) ఉన్నా అవేమీ ఉపయోగించరు. వేలి గోళ్లతో పట్టు బిగించి ఆ తర్వాత బంతిని వదులుతారు. బంతిని సంధించే సమయంలో సాధారణ బంతిలాగే వేగాన్ని కొనసాగిస్తే బ్యాట్స్‌మెన్ దీనిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే బౌలర్ కూడా దీనిని నియంత్రణలో ఉంచుకోవాలంటే తీవ్ర సాధన అవసరం. గతంలో జహీర్ ఖాన్ నకుల్ బాల్‌తో కొంత సఫలం కాగా, సునీల్ నరైన్ బాగా వాడాడు. అయితే టాంపరింగ్ ఆరోపణలతో యాక్షన్‌ను మార్చుకున్న తర్వాత నరైన్ దీనికి దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment