
భువనేశ్వర్ : ఉపద్రవం గుప్పిట్లో చిక్కుకుని ప్రజలంతా అల్లాడుతున్న సమయాన.. మరో ప్రాణి క్షేమంగా ఈ భూమ్మీదకు వస్తే గట్టి పిండమే అంటాం. అంతేకాక ఆ చిన్నారికి ఉపద్రవాన్ని ప్రతిబింబించే పేరే పెడతారు. ఇలాంటి సంఘటనే ఒకటి భువనేశ్వర్‌లో చోటు చేసుకంది. ఒకవైపు బంగాళాఖాతం తీర రాష్ట్రాలు ‘ఫొని’ తుపాను సృష్టిస్తోన్న బీభత్సంతో వణికిపోతుంటే.. దానికి ఏమాత్రం జడవకుండా.. క్షేమంగా భూమ్మీదకు వచ్చిన ఓ చిన్నారి పాపకు ‘ఫొని’ అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు.
వివరాలు.. ఓ 32 ఏళ్ల మహిళ భువనేశ్వర్‌లోని రైల్వే కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం నెలలు నిండిన ఆ మహిళ శుక్రవారం ఉదయం రైల్వే ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఓ వైపు ఒడిషా అంతా ఫొని ఎఫెక్ట్‌తో విలవిల్లాడుతూంటే.. ఈ చిట్లి తల్లి మాత్రం వెచ్చగా తల్లి పొత్తిళ్లలో సేదతీరుతుంది. ఇంతటి ఉపద్రవంలో కూడా క్షేమంగా భూమ్మీదకు వచ్చిన చిన్నారికి ఆమె తల్లితండ్రులు ‘ఫొని’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
‘ఫొని’ తుపాను ఒడిశాలో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, గాలుల ధాటికి 6గురు ప్రాణాలు కోల్పోయారు. గంటకు 80-125 కి.మీ. వేగంగా పెనుగాలులు, అతి భారీ వర్షాలతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమైపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment