
'పద్దతి మార్చుకోకుంటే తన్నులు తప్పవు'
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలలో ఉండే బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. శనివారం భువనేశ్వర్లో 'ఇంటర్నేషనల్ హిందూ మహాసంఘ' ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేను సహచరులు కొట్టడంలో తప్పులేదన్నారు. పద్దతైనా మార్చుకోవాలి లేదా తన్నులైనా తినాలని తనదైన స్టైల్లో వ్యాఖ్యలు చేశారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న నెపంతో ఇటీవల జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ అబ్థుల్ రషీద్పై బీజేపీ ఎమ్మెల్యేలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని రషీద్ చర్యలకు సహజ ప్రతిస్పందనగా సాక్షి అభివర్ణించాడు. జనం అభిష్టం మేరకు మాట్లాడనప్పుడు నాయకులకు తన్నులు తప్పవన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా ఏడాది పాలననే పూర్తి చేసుకుందని తెలిపిన సాక్షి. ఎన్డీఏ పాలనలోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోందని పునరుద్ఘాటించారు. గతంలో అక్కడ రామమందిరం ఉందని.. ఎప్పటికీ ఉంటుందని ఆయన అన్నారు.