భువనేశ్వర్: బ్రజ్‌రాజ్‌నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కిశోర్ మహంతి(63) కన్నుమూశారు. గుండెపోటుతో ఝార్సుగుడ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయాల్లో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన 1990లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. ఝార్సుగుడ శాసనసభ స్థానం నుంచి వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలుపొందారు.
►2004 నుంచి 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్‌గా, మంత్రిగా, స్పీకరుగా, పశ్చిమ ఒడిశా అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బ్రజ్‌రాజ్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం బీజేడీలో సీనియర్ నాయకునిగా వెలుగొందారు.
►ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిరవధికంగా కొనసాగిన పలు సభలు, సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం పార్టీ కార్యాలయంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని అలా పడుకుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడం గమనార్హం. ఎమ్మెల్యే మృతి పట్ల సీఎం నవీన్, గవర్నరు గణేషీలాల్, ఏపీ గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం ప్రకటించారు.
కిశోర్ మృతి తీరని లోటు..
ఒడిశా శాసనసభ సభ్యుడు కిశోర్ మహంతి మృతి తీరని లోటని ఏపీ గవర్నరు సంతాపం ప్రకటించారు. నిష్పక్షపాత వైఖరితో అందరినీ ఆకట్టుకునే నాయకుడిగా విశేష గుర్తింపు సాధించారు. ఆయన మన మధ్య లేరన్న వార్త జీర్ణించుకోలేనిది. ప్రభుత్వ చీఫ్ విప్‌గా ప్రభుత్వ వ్యవహారాల్లో అనన్య దక్షత ప్రదర్శించిన నాయకుడు కిశోర్.
-బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ గవర్నర్
ప్రజా ప్రతినిధిగా చిరస్మరణీయులు..
రాజకీయ నాయకునిగా రాష్ట్ర శాసనసభ సభ్యునిగా కిశోర్ మహంతి పాత్ర చిరస్మరణీయం. 3 దశాబ్దాల పాటు ప్రజా నాయకునిగా> వెలుగొందడం కొంతమందికే సొంతమని, ఈ తరం నాయకుల్లో ఆ గొప్పతనం ఒక్క కిశోర్ దక్కుతుంది. ఆయన మృతి పశ్చిమ ఒడిశా ప్రజలను కలచివేసిందని ఈ సందర్భంగా దివంగత నాయకుని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – ప్రొఫెసరు గణేషీలాల్, రాష్ట్ర గవర్నర్
మంచి నాయకుడిని కోల్పోయాం..
రాష్ట్ర ప్రజలు ఓ మంచి నాయకుడిని కోల్పోయారు. స్పీకరుగా శాసనసభ వ్యవహారాల్లో దక్షత చాటుకుని అఖిల పక్షాల ప్రియతమ స్పీకరుగా గుర్తింపు సాధించారు. పశ్చిమ ఒడిశా అభివృద్ధిలో ఆయనది విశేష పాత్ర. పార్టీ వ్యవహారాల్లో ఆయన సేవ, అంకిత భావం భవిష్యత్ తరాలకు ఆదర్శం. ఆయన మరణం పూడ్చలేనిది. బాధిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – సీఎం నవీన్ పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment