
ఎంపీ భువనేశ్వర్ కలిత
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సైతం ఆర్టికల్ 370 ఏదో ఒకరోజు రద్దవుతుందని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వం పార్టీ సిద్ధాంతాలను మర్చిపోయిందని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలందరికీ విప్ జారీ చేయాలని తనను ఆదేశించారని, ఈ విప్ దేశ మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుందన్న ఉద్దేశంతో విప్ జారీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. భువనేశ్వర్ కలిత అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
వారం వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ పదవికి సంజయ్ సింగ్ జూలై 30న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆర్టికల్ 35ఏ కూడా రద్దైందా?)
Comments
Please login to add a commentAdd a comment