
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ బిల్లుకు తమ పార్టీతో పాటు.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లుపై మాట్లాడే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం ద్వారా నెహ్రూ నాటి కశ్మీర్ పాలకుల ఒత్తిడికి తలవంచబట్టే.. నేడు ఈ దుస్థితి దాపురించిందన్నారు. తాత్కాలికమైన ఈ ఆర్టికల్ 370ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు.
సాహసోపేత నిర్ణయం
రెండు రాజ్యాంగాలు, రెండు వేర్వేరు పతాకాలు భారత్‌లో తప్ప.. మరెక్కడా కనిపించవన్నారు. జాతీయ పతాకాన్ని తగులబెడితే నేరం కాని ప్రాంతం.. దేశంలో అంతర్భాగం ఎలా అవుతుందని నిలదీశారు. ఇలాంటివి ఒక్క జమ్మూకశ్మీర్‌లోనే సాధ్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చేందుకు హోం మంత్రి అమిత్ షా నడుం బిగించారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీ, జవహర్‌లాల్ నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలను సరిచేసి.. 130 కోట్ల భారతీయుల చిరకాల వాంఛను నెరవేర్చి అమిత్ షా సబ్ కా వికాస్ నినాదాన్ని ఆచరణలో పెడుతున్నారని కొనియాడారు. ఈ చర్య.. పౌరుల మధ్య వివక్షను తొలగించి దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని మరింత పటిష్టం చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
సాహసోపేత నిర్ణయం తీసుకున్నారంటూ ప్రధానికి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పరీక్షల దరఖాస్తులకు సంబంధించి నాన్–క్రీమీలేయర్ ఓబీసీ అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్న రుసుం కూడా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి వసూలు చేస్తున్న రుసుంలతో సమానంగా మాత్రమే ఉండాలని విజయసాయిరెడ్డి జీరో అవర్‌లో కేంద్రాన్ని కోరారు.