సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న భారత రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసి, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడం వల్ల జరగబోయే పరిణామాలు, పర్యవసనాలేమిటీ? లాభ నష్టాలేమిటీ? అన్న అంశాలతోగానీ, ప్రభుత్వ ఎజెండాతోగానీ తమకు సంబంధం లేదని, అయితే ఇందుకోసం అనుసరించిన ప్రక్రియనే ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఉందని పలువురు ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. అటు కశ్మీర్ ప్రజల అభిప్రాయాలనుగానీ ఇటు మిగతా భారతీయుల అభిప్రాయంగానీ తెలుసుకోకుండా వ్యవహరించిన విధానం ముమ్మాటికి ప్రజాస్వామ్య విరుద్ధమని వారు వాదిస్తున్నారు.
‘కేంద్ర బలగాలకు చెందిన 35 వేల మంది సైనికుల నిఘా మధ్య కశ్మీర్ ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసి, వారి సెల్యులార్, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ ఫోన్లను కట్ చేసి, ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసి, వారి నాయకులను గృహంలో నిర్బంధించడం ద్వారా ఆర్టికల్ 370 రద్దు బిల్లును తీసుకురావడం ఏమిటీ? కశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని తీసుకోకుండా, కేవలం రాష్ట్ర గవర్నర్ ఆమోదాన్ని తీసుకోవడం ఏమిటీ? ప్రజల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఏర్పాటయ్యే అసెంబ్లీ లేనప్పుడు, ప్రజల అభిప్రాయానికి ఎన్నికలతో సంబంధం లేని గవర్నర్ ఎలా ప్రాతినిధ్యం వహిస్తారు?’ అని వారు ప్రశ్నిస్తున్నారు.
రాజ్యసభలోనూ అంతే...
‘కొత్త చట్టానికి సంబంధించిన ఏ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టినా రెండు రోజుల ముందు సభ్యులకు నోటీసు ఇచ్చి ఆ బిల్లు ప్రతి సభ్యులకు అందజేయడం సభ సంప్రదాయం. ప్రజాభిప్రాయ సేకరణ కోసం అంతకు వారం ముందునుంచే ప్రజలకు అందుబాటులో ఉంచడం ఆనవాయితీ. సభా సంప్రదాయాలకు, ఆనవాయితీలకు తాను కట్టుబడి ఉంటానని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తొలినాళ్లలో పలుసార్లు చెప్పారు. మరి అలాంటిదేమీ లేకుండా అనూహ్యంగా బిల్లును సభలో ప్రవేశపెట్టడం, మొక్కుబడిగా చర్చకు అవకాశం ఇచ్చి, త్వరితగతిన బిల్లును ఆమోదించేసుకోవడం ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడవడం కాదా?’
Comments
Please login to add a commentAdd a comment