సస్పెన్షన్లకు నిరసనగా రాజ్యసభలో ఆందోళనకు దిగిన ప్రతిపక్ష సభ్యులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెల్సిందే.
సభామర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య తోసిపుచ్చారు.
జీరో అవర్ అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివారం సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆవేదన చెందానన్నారు. ‘కొందరు సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కి, గట్టిగా అరుస్తూ, డాన్స్‌లు చేశారు. పేపర్లు చింపి, మైకులు విరగ్గొట్టి, డెప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారు. మార్షల్స్ అడ్డుకోకుంటే, డెప్యూటీ చైర్మన్‌పై దాడి కూడా జరిగేది. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? ఆత్మ విమర్శ చేసుకోండి’ అని ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీమీ స్థానాలకు వెళ్లండి. డివిజన్ ఓటింగ్ చేపడ్తామ’ని డెప్యూటీ చైర్మన్ చెప్పినా విపక్షసభ్యులు పట్టించుకోలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై సహచర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేటు పడిన సభ్యులు ఆ తరువాత బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, సభలోనే కూర్చుని నిరసన కొనసాగించారు. వారికి ఇతర విపక్ష సభ్యులు జతకలవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది.
విపక్ష సభ్యుల ధర్నా: తమపై విధించిన సస్పెన్షన్‌కు నిరసనగా ఆ 8 మంది సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరవధిక ధర్నాకు దిగారు. నిరవధిక నిరసనకు వీలుగా దుప్పట్లు, దిండ్లు తెచ్చుకున్నారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి గాంధీజీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. శివసేన, సీపీఐ, ఎస్పీ, జేడీఎస్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారికి మద్దతుగా నిలిచారు.
ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ విమర్శించారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, రెండు కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న జరిగే దేశవ్యాప్త నిరసనలకు మద్దతు తెలుపుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆర్‌ఎస్‌పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాం గ్రెస్ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య భారత్ గొంతు నొక్కడమేనని రాహుల్ అన్నారు.
ఆరోగ్య సిబ్బంది భద్రత బిల్లు: కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment