Harivansh Narayan Singh
-
ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్
న్యూఢిల్లీ: పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు రాజ్యసభ గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికింది. రిటైర్ అవుతున్న సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫొటో సెషన్లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఫొటో సెషన్లో ఉన్నారు. ఈ సభ ఎంతో ఇచ్చింది: మోదీ పదవీ విరమణ చేసిన సభ్యులు మాట్లాడేందుకు వీలుగా రాజ్యసభలో ఈరోజు జీరో అవర్, ప్రశ్నోత్తరాలను వెంకయ్య నాయుడు రద్దు చేశారు. రిటైర్ అయిన సభ్యులు మళ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మన రాజ్యసభ సభ్యులకు అపార అనుభవం ఉంది. కొన్నిసార్లు అకడమిక్ నాలెడ్జ్ కంటే అనుభవానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ పార్లమెంట్లో చాలా కాలం గడిపాం. మనం ఇచ్చిన దాని కంటే ఎంతో ఎక్కువ ఈ సభ మనకు ఇచ్చింది. ఇక్కడ గడించిన అనుభవాన్ని దేశంలోని నాలుగు దిశలకు తీసుకెళ్లాల’ని మోదీ అన్నారు. ఆంటోనీ, స్వామి, గుప్తా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ.. బీజేపీ నేతలు సుబ్రమణ్యస్వామి, స్వపన్ దాస్‌గుప్తాలతో సహా మొత్తం 72 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. నిర్మలా సీతారామన్ జూన్‌లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనుండగా.. పియూష్ గోయల్, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం, కపిల్ సిబల్.. శివసేన నేత సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఫుల్ పటేల్ కూడా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. (క్లిక్: అఖిలేష్‌కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఎంపీలకు వెంకయ్య విందు వెంకయ్య నాయుడు తన నివాసంలో రాజ్యసభ సభ్యులందరికీ ఈ రాత్రి విందు ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు ‘పీటీఐ’కి వెల్లడించాయి. పదవీ విరమణ చేస్తున్న 72 మంది సభ్యులకు, ఇంతకు ముందు పదవీ విరమణ చేసిన మరో 19 మందికి జ్ఞాపికలను వెంకయ్య నాయుడు అందజేస్తారు. ఈ విందులో ఆరుగురు ఎంపీలు తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శిస్తారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: థ్యాంక్యూ మోదీ జీ: కేటీఆర్ సెటైర్లు) -
8 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెల్సిందే. సభామర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య తోసిపుచ్చారు. జీరో అవర్ అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివారం సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆవేదన చెందానన్నారు. ‘కొందరు సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కి, గట్టిగా అరుస్తూ, డాన్స్‌లు చేశారు. పేపర్లు చింపి, మైకులు విరగ్గొట్టి, డెప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారు. మార్షల్స్ అడ్డుకోకుంటే, డెప్యూటీ చైర్మన్‌పై దాడి కూడా జరిగేది. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? ఆత్మ విమర్శ చేసుకోండి’ అని ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీమీ స్థానాలకు వెళ్లండి. డివిజన్ ఓటింగ్ చేపడ్తామ’ని డెప్యూటీ చైర్మన్ చెప్పినా విపక్షసభ్యులు పట్టించుకోలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై సహచర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేటు పడిన సభ్యులు ఆ తరువాత బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, సభలోనే కూర్చుని నిరసన కొనసాగించారు. వారికి ఇతర విపక్ష సభ్యులు జతకలవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల ధర్నా: తమపై విధించిన సస్పెన్షన్‌కు నిరసనగా ఆ 8 మంది సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరవధిక ధర్నాకు దిగారు. నిరవధిక నిరసనకు వీలుగా దుప్పట్లు, దిండ్లు తెచ్చుకున్నారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి గాంధీజీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. శివసేన, సీపీఐ, ఎస్పీ, జేడీఎస్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ విమర్శించారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, రెండు కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న జరిగే దేశవ్యాప్త నిరసనలకు మద్దతు తెలుపుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాం గ్రెస్ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య భారత్ గొంతు నొక్కడమేనని రాహుల్ అన్నారు. ఆరోగ్య సిబ్బంది భద్రత బిల్లు: కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
హరివంశ్ నారాయణ్‌కు అభినందనలు: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఉప సభాపతిగా ఎన్నికైనా హరివంశ్ నారాయణ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఇవాళ(సోమవారం) హరివంశ్ నారాయణ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ నాయకులు, రాజ్యసభ సభ్యులు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి కూడా ఆయనకు శుభకాంక్షలు తెలిపారు. అధికార, విపక్షాలకు మధ్య సమతుల్యం పాటించినప్పుడే చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌గా విజయవంతం అవుతారని విజయసాయిరెడ్డి అన్నారు. గతంలోనూ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నికయ్యారని, వైఎస్సార్ సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు ఆయన మంచి సమయం కేటాయించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. (రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక) -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి జేడీ(యూ)కి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ సోమవారం ఎన్నికయ్యారు. హరివంశ్ సింగ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. వాయిస్‌ఓట్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఆర్జేడీ అభ్యర్థి మనోజ్ ఝాపై హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. హరివంశ్ సింగ్ అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మేథావి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెద్దల సభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ సింగ్‌ను ఆయన అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. విపక్ష నేతలు సైతం హరివంశ్‌ను అభినందించారు. ఇక అంతకుముందు హరివంశ్‌కు మద్దతుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మనోజ్ ఝాను బలపరుస్తూ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. మరోవైపు 245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీయేకు 113 మంది సభ్యులుండగా, హరివంశ్ ఎన్నికకు అనుకూలంగా విపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విజయవంతమైంది. చదవండి : పెద్దల సభ : ఎథిక్స్ కమిటీ బలోపేతం -
ఏకగ్రీవ ఎన్నికకు ఎన్డీయే వ్యూహాలు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. విపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే బీజేడీ చీఫ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సాయం కోరింది. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్ గురువారం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. దీనికి స్పందించిన నవీన్ తమ పార్టీ నేతలతో చర్చించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ మిత్రపక్షం జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఎన్డీయే అభ్యర్థిగా రెండోసారి బరిలో నిలిపింది. (సెప్టెంబర్ 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు) మొత్తం 245 సభ్యులు గల రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి సొంతంగా 114 సభ్యల మద్దతుంది. మిత్రపక్షాల మద్దతును కూడగట్టుకుని తమ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా కాంగ్రెస్ వ్యతిరేక పక్షాల మద్దతు కోరనుంది. మరోవైపు విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనిపై ఇతర పార్టీల నేతలతో ఇదివరకే సంప్రదింపులు జరిపామని వారి నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కాంగ్రెస్ అధిష్టానం ఓ ప్రకటనలో తెలిపింది. నామినేషన్ల ప్రక్రియకు రేపు (శుక్రవారం) ఆఖరి రోజు కావడంతో నేతలతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్ నారాయణ్ సింగ్ ఇదివరకే నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ తొలిరోజు సమావేశాలైన సెప్టెంబర్ 14న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలకు ఇదివరకే విప్‌ను సైతం జారీచేసింది. (అసెంబ్లీ ఎన్నికలు : ఆర్జేడీకి భారీ షాక్) -
మరోసారి భంగపడ్డ పాకిస్తాన్!
మాలే: కశ్మీర్ విషయంలో భారత్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు మరోసారి పరాభవం ఎదురైంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-సాధన అనే అంశంపై మాల్దీవులో జరిగిన దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సులో దాయాది దేశం చేసిన ఆరోపణలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తిప్పికొట్టారు. మాల్దీవులు పార్లమెంటులో జరిగిన సదస్సులో భాగంగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సురీ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన హరివంశ్...ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేయడం సరైంది కాదని హితవు పలికారు. తాము కూడా పాక్ ఆరోపణలకు దీటుగా జవాబు ఇవ్వగలమని.. అయితే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అది కాదని పేర్కొన్నారు. ‘ శాంతి స్థాపన, సుస్థిరావృద్ధికి ఆటంకం కలిగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు పాక్ సహాయం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉగ్రవాదమే మానవాళికి పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదకరమైన అంశం. ఇలాంటి వాటికి అన్ని దేశాలు దూరంగా ఉండాలని మనమందరం ఈ వేదికగా విఙ్ఞప్తి చేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో హరివంశ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్ సెనేటర్ కురాటులన్ మారీ మహిళలు, యువత సుస్థిరాభివృద్ధి సాధించాలంటే మానవ హక్కుల పరిరక్షణ జరగాల్సి ఉంటుందంటూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దును పరోక్షంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో మారీ వ్యాఖ్యలకు స్పందనగా హరివంశ్ మాట్లాడుతూ...‘ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఆజాద్ జమ్మూ కశ్మీర్, గిలిజత్ బల్టిస్తాన్ అనే పేరిట పాకిస్తాన్ సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రాంతాలను ఆక్రమించుకుంది. నిజానికి పాక్ ఆక్రమిత ప్రాంతంలో పరిస్థితి అధ్వానంగా ఉంది. తమ దేశంలోని ఓ ప్రాంతంలో మారణహోమం సృష్టించిన చరిత్ర పాకిస్తాన్‌కు ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా పిలువబడుతోంది. అసలు మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువలు పాకిస్తాన్‌కు ఉందా?’ అని ప్రశ్నించారు. కాగా భారత్-పాక్ వాడివేడి వాదనల నేపథ్యంలో భారత్ అంతర్గత విషయమైన కశ్మీర్ అంశంపై పాక్ సభ్యుల వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా భారత ప్రతినిధుల బృందం కోరగా మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ వాటిని తొలగించినట్లు సమాచారం. -
రాయని డైరీ ; హరివంశ్ నారాయణ్ సింగ్
లైఫ్‌లో అన్నీ ఉంటాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సీటు కూడా ఉంటుంది! వెళ్లి కూర్చున్నాను. అరుణ్‌జైట్లీ నన్ను నడిపించుకుంటూ నా సీటు దగ్గరికి తీసుకొచ్చారు. నాకు తెలియని సీటు కాదు. నాకు తెలియని రూటు కాదు. నాలుగేళ్లుగా రాజ్యసభ సభ్యుణ్ణి. అయినా సీటు కొత్తగా ఉంది. సీటు దగ్గరికి రూటూ కొత్తగా ఉంది. పడిపోకుండా జైట్లీ జీ చెయ్యి పట్టుకోబోయి ఆగాను. పాపం ఆయనే ఆపరేషన్ అయి వచ్చారు. ఆపరేషన్ అయి వచ్చిన మనిషే ఎవరి చెయ్యీ పట్టుకోకుండా నడుస్తుంటే, సభను ఆపరేట్ చెయ్యాల్సిన నేను సభ్యుడి చెయ్యి పట్టుకోవడం బాగుంటుందా! ‘‘ఇక్కడి వరకు మిమ్మల్ని నడిపించుకొచ్చాను. ఇకనుంచీ మమ్మల్ని మీరు నడిపించాలి’’ అన్నారు జైట్లీ. నవ్వుతూ ధన్యవాదాలు తెలిపాను. ఆయన కూడా ప్రతిధన్యవాదాలు తెలుపుతూ, ప్రతినవ్వు నవ్వారు. అంతా నవ్వగలిగినవాళ్లు, అంతా నడవగలిగినవాళ్లే ఉన్నప్పుడు నడిపించడం ఏమంత కష్టమౌతుంది! జైట్లీజీ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిన సీటు.. గులాం నబీ ఆజాద్ సీటు పక్కనే ఉంది. అపోజిషన్ ఫ్లోర్‌లీడర్ ఆయన. అధికార పార్టీ ఫ్లోర్‌లీడర్ జైట్లీ. ‘‘హరివంశ్ జీ.. మీరిప్పుడు డిప్యూటీ చైర్మన్. మీ పార్టీ ఏదైనా కానివ్వండి. మీరిప్పుడు అన్ని పార్టీల మనిషి. మీ పార్టీ సపోర్ట్ మీకు ఉండొచ్చు. కానీ మా పార్టీలకు మీరు çసపోర్ట్‌గా ఉండాలి’’ అన్నారు ఆజాద్. చెప్పడానికేముందీ! నవ్వాను. ‘నవ్వడానికేముంది! చెప్పండి’ అన్నట్లు చూశారు ఆజాద్. జైట్లీ నాకు సపోర్ట్‌గా వచ్చారు. ‘‘హరివంశ్‌జీ.. అపోజిషన్ లీడర్ సీటు పక్కన డిప్యూటీ ఛైర్మన్ సీటు ఎందుకుంటుందో తెలుసా? అక్కడి నుంచి మీరు ఏ యాంగిల్లో చూసినా అంతా మావాళ్లే కనిపిస్తారు. మీ సీటు అక్కడున్నా, మీకు తెలియకుండా మీ సపోర్టు మావైపే ఉంటుంది’’ అని నవ్వారు జైట్లీ. వెంకయ్యనాయుడు మధ్యలోకి వచ్చారు. మధ్యలోకైతే వచ్చారు కానీ, నాకు సపోర్ట్‌గా రాలేదు. జైట్లీకి సపోర్ట్‌గా రాలేదు. ‘‘చైర్మన్‌గా నాదో సలహా’’ అన్నారు. ఆయన వైపు చూశాను. ‘‘చూడొద్దు’’ అన్నారు. ‘ఏం చూడొద్దు?’ అన్నట్లు ఆయన వైపు చూశాను. ‘‘లెఫ్ట్‌కి చూడొద్దు. రైటుకి చూడొద్దు. స్ట్రయిట్‌గా రూల్స్‌లోకి, ప్రొసీజర్లలోకి చూడండి’’ అన్నారు. నవ్వాను. ‘‘అందరూ మాట్లాడారు. మీరూ ఏదైనా మాట్లాడండి హరివంశ్ జీ’’ అన్నారు వెంకయ్యనాయుడు.. సీట్లో నేను సర్దుకుని కూర్చున్నాక. అప్పటికే లంచ్ టైమ్ అయింది. ‘ది హౌజ్ ఈజ్ అడ్జర్న్డ్..’ అన్నదొక్కటే ఫస్ట్ డే, ఫస్ట్ సెషన్లో నాకు మిగిలిన మాట. -మాధవ్ శింగరాజు -
ఫలప్రదంగా జరిగాయ్!!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిసి, నిరవధికంగా వాయిదాపడ్డాయి. జూలై 18వ తేదీ నుంచి మొదలయిన ఈ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతోపాటు కీలకమైన ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అనంతరం ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అభ్యంతరకర వ్యాఖ్యలుండటంతో వాటిని రికార్డుల నుంచి తొలగించటం గమనార్హం. అయితే, ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో మెజారిటీ లేనికారణంగా ప్రవేశపెట్టలేకపోయింది. ఈ సమావేశాల్లో లోక్‌సభ కార్యకలాపాలు ఫలవంతంగా సాగడంపై స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. అవిశ్వాసం.. కీలక బిల్లులు గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే ఈసారి ‘సంతృప్తికరం, ఫలప్రదం’గా జరిగాయని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది. ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లు, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే కీలక బిల్లులతోపాటు అవినీతి నిరోధక, క్రిమినల్ లా, ఆర్థిక ఎగవేతదారుల బిల్లు, బాలలకు ఉచిత, నిర్బంధ హక్కు బిల్లు, మనుషుల రవాణా వ్యతిరేక బిల్లు వంటివి 21 బిల్లులు ఆమోదం పొందాయన్నారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన 4,140 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చిందన్నారు. ఇందులో 75 ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానం ఇచ్చారని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అందజేసిన 62 నివేదికలతోపాటు సభ్యులు 128 ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారని వివరించారు. వివిధ అంశాలపై సభ్యుల నిరసనల కారణంగా 27 గంటల సభాకాలం వృథా అయింది. ‘ట్రిపుల్ తలాక్’ను చర్చించని రాజ్యసభ రాఫెల్ ఒప్పందంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టడంతో శుక్రవారం రాజ్యసభ సజావుగా సాగలేదు. త్రిపుల్ తలాక్ బిల్లుకు సవరణలు చేయాలని, పార్లమెంట్ సెలక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో చర్చకు తీసుకోవట్లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. త్వరలో దీనిపై ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీలకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్ నిషాద్ ప్రవేశపెట్టిన బిల్లును సభ తిరస్కరించింది. అత్యంత ఫలప్రదం జూలై 18వ తేదీ నుంచి మొదలైన వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగాయి. ఈ సెషన్లో భాగంగా 24 రోజుల్లో 17 సార్లు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎజెండా ప్రకారం లోక్‌సభ 118 శాతం, రాజ్యసభ 74 శాతం సమర్ధంగా నడిచింది. లోక్‌సభ 21 బిల్లులు, రాజ్యసభ 14 బిల్లులను ఆమోదించాయి. 21 బిల్లులను ఉభయ సభలు ఆమోదించాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో అనువాదకుల సాయంతో ఏకకాలంలో వినే సౌకర్యం సభ్యులకు మొదటిసారిగా కల్పించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా, ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణ బిల్లులను ఆమోదించిన ఈ సమావేశాలను సామాజిక న్యాయ ఉత్సవంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ అభివర్ణించారు. ఈ సమావేశాలు అత్యంత ఫలప్రదంగా సాగటం 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చి సంస్థ పేర్కొంది. 16వ లోక్‌సభలో ఇదే రికార్డు. మొత్తం బిల్లుల్లో 26శాతం మాత్రమే పార్లమెంటరీ కమిటీల పరిశీలనకు ప్రభుత్వం పంపగా ఇది 15వ లోక్‌సభలో 71శాతం, 14వ లోక్‌సభలో 60శాతం వరకు ఉంది. మొత్తం 999 ప్రైవేట్ బిల్లులను సభలో ప్రవేశపెట్టడం కూడా 2000 సంవత్సరం తర్వాత ఇదే ప్రథమం. రికార్డుల నుంచి ప్రధాని వ్యాఖ్యలు తొలగింపు కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్‌పై ప్రధాని మోదీ గురువారం చేసిన వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా భావిస్తూ రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. మోదీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడం అధికార పార్టీని తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లయింది. ప్రధాని మాటలను, అభ్యంతరకరంగా ఉన్నాయనే ఆరోపణలతో రికార్డుల నుంచి తీసివేయడం దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే తొలిసారని రాజ్యసభ వర్గాలు అంటున్నాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్ధిగా ప్రతిపక్షం బలపరిచిన హరిప్రసాద్‌పై ఎన్డీఏ అభ్యర్ధి హరివంశ్ గెలుపు సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ పేరులోని ‘బి.కె.’ కలిసి వచ్చేలా అమర్యాదకరమైన 3 హిందీ పదాలను వాడారు. దీంతో ఆ వ్యాఖ్యలను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలను కూడా రికార్డుల నుంచి తొలగించినట్లు రాజ్యసభ వర్గాలు తెలిపాయి. -
ఎన్డీయే అభ్యర్థిదే విజయం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా అధికార పక్షం అభ్యర్థి, జేడీయూ సభ్యుడు హరివంశ్ గురువారం సునాయాసంగా విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 101 ఓట్లు పడ్డాయి. ఇంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్ గత నెల పదవీ విరమణ పొందారు. హరివంశ్‌ను మోదీ పొగుడుతూ ‘ఇప్పుడంతా హరి/దేవుడి చేతుల్లో ఉంది. ప్రతిపక్ష, విపక్షమనే తేడాలేకుండా ఆయన సభ్యులందరిపై కరుణతో ఉంటారనే నమ్మకం నాకుంది’ అని అన్నారు. రాజ్యసభ నాయకుడు జైట్లీ, విపక్ష నేత ఆజాద్‌లు హరివంశ్‌పై ప్రశంసలు కురిపించారు. మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న జైట్లీ తొలిసారిగా గురువారమే సభకు వచ్చారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి హరివంశ్ అభ్యర్థిత్వాన్ని జేడీయూ సభ్యుడు రామ్ ప్రసాద్ సింగ్ ప్రతిపాదించగా, కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) సభ్యుడు రాందాస్ అథవాలే బలపరిచారు. ఎన్నిక అనంతరం హరివంశ్ సభాధ్యక్షుడి స్థానంలో కాసేపు కూర్చోగా సభ్యులంతా చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. హరివంశ్ మాట్లాడుతూ సభా గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాననీ, సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎంపీలు తనకు సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. అనంతరం సభ భోజన విరామం కోసం వాయిదా పడింది. రెండుసార్లు ఓటింగ్ తొలిసారి ఓటింగ్‌లో కొన్ని తప్పులు దొర్లాయని కొందరు సభ్యులు ఫిర్యాదు చేయడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. తొలిసారి ఓటింగ్ సమయంలో హరివంశ్‌కు 122 ఓట్లు, హరిప్రసాద్‌కు 98 ఓట్లు వచ్చాయి. మొత్తం సభ్యుల సంఖ్య 222గా తేలింది. అయితే రెండోసారి ఓటింగ్ జరిగాకా మాత్రం హరివంశ్‌కు 125 ఓట్లు, హరిప్రసాద్‌కు 101 ఓట్లు వచ్చాయి. 24 ఓట్ల తేడాతో హరివంశ్ గెలుపొందారు. సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 244 కాగా, ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన మొత్తం 97 మంది సభ్యులూ హాజరై ఓటు వేశారు. బీజేడీ, టీఆర్ఎస్, అన్నా డీఎంకే పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేయడంతో హరివంశ్ చాలా సులభంగా గెలుపొందారు. మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆప్, సమాజ్వాదీల్లో ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు చొప్పున 9 మంది, అలాగే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, పీడీపీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడొకరు.. మొత్తం 16 మంది గైర్హాజరై బీజేపీ సునాయాస విజయానికి కారకులయ్యారు. వీరంతా సభకు వచ్చి విపక్ష అభ్యర్థికి ఓటు వేసి ఉంటే కనీసం ఎన్డీయే కూటమి గట్టి పోటీని ఎదుర్కొని ఉండేది. ఈ 16 మంది గైర్హాజరుతో ఓటింగ్ సమయంలో సభలో 228 మంది సభ్యులు మిగిలారు. దీంతో అభ్యర్థి గెలవడానికి 115 ఓట్లు అవసరమయ్యాయి. ఇద్దరు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆటగాళ్లకంటే అంపైర్లకే సమస్యలెక్కువ: మోదీ హరివంశ్ ఎన్నిక అనంతరం మోదీ సరదాగా మాట్లాడుతూ ‘ప్రస్తుతం సభలో పరిస్థితి చూస్తుంటే ఆటగాళ్ల (సభ్యులు) కంటే అంపైర్ల (చైర్మన్, డిప్యూటీ చైర్మన్)కే ఎక్కువ సమస్యలు ఉన్నట్లుగా ఉన్నాయి’ అని అన్నారు. ‘హరివంశ్ నాలుగు దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు కూడా ముందుకొచ్చింది. కానీ ఆ కొలువును ఆయన తిరస్కరించారు. ఎన్నిక ఫలితం అందరికీ ముందుగానే తెలిసినదైనప్పటికీ పద్ధతుల ప్రకారం ఓటింగ్ జరపాల్సి వచ్చింది. ఫరవాలేదు. కొత్త సభ్యులకు సభలో ఓటు ఎలా వేయాలో తెలిసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నిక సజావుగా సాగినందుకు విపక్ష అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు, వెంకయ్యకు, సభ్యులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. తొలిసారి ఎంపీ.. అప్పుడే డిప్యూటీ చైర్మన్ ఎంపీగా తొలిసారిగా 2014లో రాజ్యసభకు ఎన్నికైన హరివంశ్ ఆ పదవిలో ఉండగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరించనుండటం గమనార్హం. 62 ఏళ్ల హరివంశ్ తొలినాళ్లలో ప్రభుత్వోద్యోగాన్ని కాదని పాత్రికేయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. బిహార్‌లోని బల్లియా జిల్లాకు చెందిన హరివంశ్.. ప్రముఖ దివంగత నేత జయప్రకాశ్ నారాయణ్ సొంత ప్రాంతానికి చెందిన వారే. గతంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగానూ కొన్నాళ్లు పనిచేసిన హరివంశ్.. ఆయన పదవి నుంచి దిగిపోయిన అనంతరం మళ్లీ పాత్రికేయ వృత్తిలోకి వెళ్లారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, జర్నలిజంలో డిప్లొమా చదివారు. హిందీ పత్రిక ‘ప్రభాత్ ఖబర్’కు చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. హిందీలో పలు పుస్తకాలు రాశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. బీజేపీకి కొత్త మిత్రులు! కాంగ్రెస్‌కు భంగపాటు న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికతో కాంగ్రెస్ మరోసారి భంగపడగా, బీజేపీకి కొత్త మిత్రులు దొరికారు. వాస్తవానికి ఈ ఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీలో నిలపాలని అనుకోలేదు. విపక్ష పార్టీల నుంచి ఎవరిని నిలబెట్టినా తాము మద్దతిస్తామంది. కానీ విపక్ష కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఓడిపోతామని తెలిసినా తమ ఎంపీని నిలబెట్టక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌ది. పైపెచ్చు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పీడీపీ, ఆప్‌లను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. రాహుల్ కోరితే తాము మద్దతిస్తామని ఆప్ స్పష్టం చేసినప్పటికీ, రాహుల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. బీజేపీ కొత్తగా టీఆర్ఎస్, బీజేడీల మద్దతు పొందింది. మద్దతు కోసం స్వయంగా మోదీ బీజేడీ అధినేత బిజూ పట్నాయక్‌కు ఫోన్ చేసి∙ఒప్పించారు. బీజేపీతో భేదాభిప్రాయాలున్నట్లుగా కనిపించిన శివసేన, అకాలీదళ్‌లు కూడా ఇప్పుడు ఆ పార్టీతో సత్సంబంధాలనే కలిగి ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు దాదాపు మరో 10 నెలలు మాత్రమే ఉండగా ఇటీవల ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుండగా, కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లైనా గెలుచుకుంటుందో లేదోనని పలువురు సీనియర్ నేతలు ఆందోళనగా ఉన్నారు. -
జర్నలిస్టు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా..
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. రాజ్యసభలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జనతాదళ్(యునైటెడ్) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ గెలుపొందారు. జర్నలిస్టుగా పనిచేసి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు అన్ని పార్టీలు అభినందనలు తెలియజేస్తున్నాయి. హరివంశ్ సింగ్ ప్రస్థానం... ‘లోక్ నాయక్’ జయ ప్రకాశ్ నారాయణ్ అనుచరుడిగా గుర్తింపు పొందిన హరివంశ్ జూన్ 30, 1956లో ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా సితాబ్ డయారా గ్రామంలో జన్మించారు(బిహార్‌లోని సరన్, ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ గ్రామంపై హక్కు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు ఇప్పటికీ పోటీ పడుతున్నాయి). బెనారస్ హిందీ యూనివర్సిటీలో డిగ్రీ చదివిన హరివంశ్ హిందీ దినపత్రిక ప్రభాత్ ఖబర్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా హైద్రాబాద్ బ్రాంచ్‌లో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హరివంశ్.. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు. మొదటిసారి ఎంపీగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హరివంశ్ జేడీయూ తరపున 2014, ఏప్రిల్‌లో ఎంపీగా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. బిహార్‌కు ప్రత్యేక హోదా అనే డిమాండ్‌ను తెరపైకి తేవడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. బిహార్ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు జేడీయూతో చేతులు కలిపిన బీజేపీ.. రాజ్యసభ డిప్యూటీ పదవిని తమ పార్టీ ఎంపీకే కట్టబెట్టాలని జేడీయూ పట్టుబట్టడంతో.. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్‌ను బరిలో దింపింది. తమ ఎంపీ గెలుపు కోసం సీఎం నితీష్ కుమార్ వివిధ పార్టీల మద్ధతు కూడగట్టడంలో సఫలమయ్యారు. ఫలితంగా రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికలో ప్రత్యర్థి, కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ హరివంశ్ విజయం సాధించారు. 1992 తర్వాత తొలిసారిగా.. గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్.. 1992 తర్వాత తొలిసారిగా ఓటింగ్ ద్వారా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. 1992లో జరిగిన ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై కాంగ్రెస్ అభ్యర్థి నజ్మా హెప్తుల్లా విజయం సాధించారు. ఆమె తర్వాత కె. రహమాన్ ఖాన్, పీజే కురియన్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లుగా పని చేశారు. -
‘రాజ్యసభ డిప్యూటీ’ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. రాజ్యసభలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్‌కు అనుకూలంగా 125, ఓట్లు రాగా, వ్యతిరేకంగా 105 ఓట్లు పడ్డాయి. ఫలితంగా హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244 కాగా, 230 సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అధికార, విపక్షాల మధ్య ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో హరివంశ్ నారాయణ్ సింగ్నే విజయం వరించింది. విపక్షాల తరపున బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ నుంచి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు తీవ్ర పోటీ ఎదురైందనే చెప్పాలి. పలుమార్లు లెక్కించిన ఓట్లలో హరిప్రసాద్ 20 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు అనుకూలంగా టీఆర్ఎస్ ఓటేయగా, కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్‌కు టీడీపీ ఓటేసింది. వైఎస్సార్సీపీ దూరం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు కానీ, విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్‌కు గానీ వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వలేదు. కాంగ్రెస్, బీజేపీలు రెండు ఏపీకి తీరని ద్రోహాన్ని చేసిన కారణంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.