రాజ్యసభ చైర్మన్ సీటులోకి హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఆహ్వానిస్తున్న వెంకయ్య
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా అధికార పక్షం అభ్యర్థి, జేడీయూ సభ్యుడు హరివంశ్ గురువారం సునాయాసంగా విజయం సాధించారు. ఆయనకు 125 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు 101 ఓట్లు పడ్డాయి. ఇంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్ గత నెల పదవీ విరమణ పొందారు. హరివంశ్‌ను మోదీ పొగుడుతూ ‘ఇప్పుడంతా హరి/దేవుడి చేతుల్లో ఉంది. ప్రతిపక్ష, విపక్షమనే తేడాలేకుండా ఆయన సభ్యులందరిపై కరుణతో ఉంటారనే నమ్మకం నాకుంది’ అని అన్నారు. రాజ్యసభ నాయకుడు జైట్లీ, విపక్ష నేత ఆజాద్‌లు హరివంశ్‌పై ప్రశంసలు కురిపించారు.
మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న జైట్లీ తొలిసారిగా గురువారమే సభకు వచ్చారు. అంతకుముందు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి హరివంశ్ అభ్యర్థిత్వాన్ని జేడీయూ సభ్యుడు రామ్ ప్రసాద్ సింగ్ ప్రతిపాదించగా, కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) సభ్యుడు రాందాస్ అథవాలే బలపరిచారు. ఎన్నిక అనంతరం హరివంశ్ సభాధ్యక్షుడి స్థానంలో కాసేపు కూర్చోగా సభ్యులంతా చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. హరివంశ్ మాట్లాడుతూ సభా గౌరవాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తాననీ, సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎంపీలు తనకు సహకరిస్తారని ఆశిస్తున్నానన్నారు. అనంతరం సభ భోజన విరామం కోసం వాయిదా పడింది.
రెండుసార్లు ఓటింగ్
తొలిసారి ఓటింగ్‌లో కొన్ని తప్పులు దొర్లాయని కొందరు సభ్యులు ఫిర్యాదు చేయడంతో రెండోసారి ఓటింగ్ నిర్వహించారు. తొలిసారి ఓటింగ్ సమయంలో హరివంశ్‌కు 122 ఓట్లు, హరిప్రసాద్‌కు 98 ఓట్లు వచ్చాయి. మొత్తం సభ్యుల సంఖ్య 222గా తేలింది. అయితే రెండోసారి ఓటింగ్ జరిగాకా మాత్రం హరివంశ్‌కు 125 ఓట్లు, హరిప్రసాద్‌కు 101 ఓట్లు వచ్చాయి. 24 ఓట్ల తేడాతో హరివంశ్ గెలుపొందారు. సభలో ప్రస్తుత సభ్యుల సంఖ్య 244 కాగా, ఎన్డీయే కూటమి పార్టీలకు చెందిన మొత్తం 97 మంది సభ్యులూ హాజరై ఓటు వేశారు. బీజేడీ, టీఆర్‌ఎస్, అన్నా డీఎంకే పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేయడంతో హరివంశ్ చాలా సులభంగా గెలుపొందారు.
మరోవైపు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆప్, సమాజ్‌వాదీల్లో ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు చొప్పున 9 మంది, అలాగే డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, పీడీపీల నుంచి ఇద్దరు చొప్పున ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ సభ్యుడొకరు.. మొత్తం 16 మంది గైర్హాజరై బీజేపీ సునాయాస విజయానికి కారకులయ్యారు. వీరంతా సభకు వచ్చి విపక్ష అభ్యర్థికి ఓటు వేసి ఉంటే కనీసం ఎన్డీయే కూటమి గట్టి పోటీని ఎదుర్కొని ఉండేది. ఈ 16 మంది గైర్హాజరుతో ఓటింగ్ సమయంలో సభలో 228 మంది సభ్యులు మిగిలారు. దీంతో అభ్యర్థి గెలవడానికి 115 ఓట్లు అవసరమయ్యాయి. ఇద్దరు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ఆటగాళ్లకంటే అంపైర్లకే సమస్యలెక్కువ: మోదీ
హరివంశ్ ఎన్నిక అనంతరం మోదీ సరదాగా మాట్లాడుతూ ‘ప్రస్తుతం సభలో పరిస్థితి చూస్తుంటే ఆటగాళ్ల (సభ్యులు) కంటే అంపైర్ల (చైర్మన్, డిప్యూటీ చైర్మన్)కే ఎక్కువ సమస్యలు ఉన్నట్లుగా ఉన్నాయి’ అని అన్నారు. ‘హరివంశ్ నాలుగు దశాబ్దాలపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఆయనకు ఉద్యోగం ఇచ్చేందుకు రిజర్వు బ్యాంకు కూడా ముందుకొచ్చింది. కానీ ఆ కొలువును ఆయన తిరస్కరించారు. ఎన్నిక ఫలితం అందరికీ ముందుగానే తెలిసినదైనప్పటికీ పద్ధతుల ప్రకారం ఓటింగ్ జరపాల్సి వచ్చింది. ఫరవాలేదు. కొత్త సభ్యులకు సభలో ఓటు ఎలా వేయాలో తెలిసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నిక సజావుగా సాగినందుకు విపక్ష అభ్యర్థి బీకే హరిప్రసాద్‌కు, వెంకయ్యకు, సభ్యులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
తొలిసారి ఎంపీ.. అప్పుడే డిప్యూటీ చైర్మన్
ఎంపీగా తొలిసారిగా 2014లో రాజ్యసభకు ఎన్నికైన హరివంశ్ ఆ పదవిలో ఉండగానే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని అలంకరించనుండటం గమనార్హం. 62 ఏళ్ల హరివంశ్ తొలినాళ్లలో ప్రభుత్వోద్యోగాన్ని కాదని పాత్రికేయాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. బిహార్‌లోని బల్లియా జిల్లాకు చెందిన హరివంశ్.. ప్రముఖ దివంగత నేత జయప్రకాశ్ నారాయణ్ సొంత ప్రాంతానికి చెందిన వారే. గతంలో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగానూ కొన్నాళ్లు పనిచేసిన హరివంశ్.. ఆయన పదవి నుంచి దిగిపోయిన అనంతరం మళ్లీ పాత్రికేయ వృత్తిలోకి వెళ్లారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఎం.ఏ, జర్నలిజంలో డిప్లొమా చదివారు. హిందీ పత్రిక ‘ప్రభాత్ ఖబర్’కు చీఫ్ ఎడిటర్‌గా పనిచేశారు. హిందీలో పలు పుస్తకాలు రాశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు సన్నిహితుడిగా ఆయనకు పేరుంది.
బీజేపీకి కొత్త మిత్రులు!
కాంగ్రెస్‌కు భంగపాటు
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికతో కాంగ్రెస్ మరోసారి భంగపడగా, బీజేపీకి కొత్త మిత్రులు దొరికారు. వాస్తవానికి ఈ ఎన్నికకు కాంగ్రెస్ తన అభ్యర్థిని పోటీలో నిలపాలని అనుకోలేదు. విపక్ష పార్టీల నుంచి ఎవరిని నిలబెట్టినా తాము మద్దతిస్తామంది. కానీ విపక్ష కూటమిలోని ఏ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ముందుకు రాకపోవడంతో ఓడిపోతామని తెలిసినా తమ ఎంపీని నిలబెట్టక తప్పని పరిస్థితి కాంగ్రెస్‌ది. పైపెచ్చు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పీడీపీ, ఆప్‌లను తమ వైపుకు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది.
రాహుల్ కోరితే తాము మద్దతిస్తామని ఆప్ స్పష్టం చేసినప్పటికీ, రాహుల్ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. బీజేపీ కొత్తగా టీఆర్‌ఎస్, బీజేడీల మద్దతు పొందింది. మద్దతు కోసం స్వయంగా మోదీ బీజేడీ అధినేత బిజూ పట్నాయక్‌కు ఫోన్ చేసి∙ఒప్పించారు. బీజేపీతో భేదాభిప్రాయాలున్నట్లుగా కనిపించిన శివసేన, అకాలీదళ్‌లు కూడా ఇప్పుడు ఆ పార్టీతో సత్సంబంధాలనే కలిగి ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు దాదాపు మరో 10 నెలలు మాత్రమే ఉండగా ఇటీవల ఏ ఎన్నిక జరిగినా బీజేపీ గెలుస్తుండగా, కాంగ్రెస్ చతికిలపడుతోంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లైనా గెలుచుకుంటుందో లేదోనని పలువురు సీనియర్ నేతలు ఆందోళనగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment