మాలే: కశ్మీర్ విషయంలో భారత్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని ఆరాటపడుతున్న పాకిస్తాన్‌కు మరోసారి పరాభవం ఎదురైంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-సాధన అనే అంశంపై మాల్దీవులో జరిగిన దక్షిణాసియా దేశాల స్పీకర్ల సదస్సులో దాయాది దేశం చేసిన ఆరోపణలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తిప్పికొట్టారు. మాల్దీవులు పార్లమెంటులో జరిగిన సదస్సులో భాగంగా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సురీ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన హరివంశ్...ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేయడం సరైంది కాదని హితవు పలికారు. తాము కూడా పాక్ ఆరోపణలకు దీటుగా జవాబు ఇవ్వగలమని.. అయితే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం అది కాదని పేర్కొన్నారు. ‘ శాంతి స్థాపన, సుస్థిరావృద్ధికి ఆటంకం కలిగిస్తున్న సీమాంతర ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు పాక్ సహాయం నిలిపివేయాలి. ప్రస్తుతం ఉగ్రవాదమే మానవాళికి పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదకరమైన అంశం. ఇలాంటి వాటికి అన్ని దేశాలు దూరంగా ఉండాలని మనమందరం ఈ వేదికగా విఙ్ఞప్తి చేద్దాం’ అని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో హరివంశ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్ సెనేటర్ కురాటులన్ మారీ మహిళలు, యువత సుస్థిరాభివృద్ధి సాధించాలంటే మానవ హక్కుల పరిరక్షణ జరగాల్సి ఉంటుందంటూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి హోదా రద్దును పరోక్షంగా ప్రస్తావించారు. ఈ క్రమంలో మారీ వ్యాఖ్యలకు స్పందనగా హరివంశ్ మాట్లాడుతూ...‘ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఆజాద్ జమ్మూ కశ్మీర్, గిలిజత్ బల్టిస్తాన్ అనే పేరిట పాకిస్తాన్ సైనిక చర్య ద్వారా ఆ రెండు ప్రాంతాలను ఆక్రమించుకుంది. నిజానికి పాక్ ఆక్రమిత ప్రాంతంలో పరిస్థితి అధ్వానంగా ఉంది. తమ దేశంలోని ఓ ప్రాంతంలో మారణహోమం సృష్టించిన చరిత్ర పాకిస్తాన్‌కు ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా పిలువబడుతోంది. అసలు మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువలు పాకిస్తాన్‌కు ఉందా?’ అని ప్రశ్నించారు. కాగా భారత్-పాక్ వాడివేడి వాదనల నేపథ్యంలో భారత్ అంతర్గత విషయమైన కశ్మీర్ అంశంపై పాక్ సభ్యుల వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా భారత ప్రతినిధుల బృందం కోరగా మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ వాటిని తొలగించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment