
సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో జరిగిన గందరగోళంపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నివాసంలో ఉన్నతస్ధాయి సమావేశం జరిగింది. రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, పీయూష్ గోయల్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. విపక్ష ఎంపీల తీరుపై ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్‌పై 12 విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై కూడా ఈ భేటీలో చర్చించారు.
రైతులకు ప్రధానమంత్రి భరోసా
విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభలో రెండు వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధర వ్యవస్థతో పాటు వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించడం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులకు సేవ చేసేందుకే తామున్నామని, వారికి వీలైనంత సాయం చేసేందుకు అన్ని చర్యలూ చేపడతామని భరోసా ఇచ్చారు. వ్యవసాయ బిల్లులు పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని ప్రధాని స్వాగతిస్తూ ఇది భారత వ్యవసాయ రంగ చరిత్రలో కీలక ఘట్టమని వ్యాఖ్యానించారు. కోట్లాది రైతుల సాధికారతకు ఇది ఊతమిస్తుందని అన్నారు.
విపక్షాల తీరు బాధ్యతారాహిత్యం : నడ్డా
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా పెద్దల సభలో ప్రతిపక్షాల ప్రవర్తనను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రంగా తప్పుపట్టారు. విపక్షాల తీరు బాధ్యతారాహిత్యమని, ప్రజాస్వామ్యాన్ని వారు అపహాస్యం చేశారని మండిపడ్డారు. చదవండి : పెద్దల సభలో పెను దుమారం