సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార ఘటనపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి క్రూరమైన ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. సోమవారం రాజ్యసభ ప్రారంభం కాగానే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని అరికట్టడానికి చేయాల్సిన సూచనలపై చర్చను ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆందోళనకరం. హైదరాబాద్‌లో జరిగిన దుర్ఘటన అమానవీయం. మానవత్వం సిగ్గుపడే ఇలాంటి ఘటనలు ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. యావద్భారతంలో మహిళలు, యువతులు, చిన్నారులపై అత్యాచార ఘటనలను చూస్తున్నాం, వింటున్నాం.
ఇలాంటివి పునరావృత్తం కాకుండా ఏం చేయాలనేదానిపై చర్చించాలి. శిక్షలు విధించినప్పుడు కూడా అప్పీలు, క్షమాభిక్ష అంటూ ఏళ్ల తరబడి ప్రక్రియ నడుస్తోంది. ఇంతటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై క్షమాభిక్ష అంశం అనేది ఎవరైనా ఊహించుకుంటారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా కేసు తమ పరిధిలో లేదంటూ పోలీసులు చెప్పిన కారణాలు సహేతుకం కాదు. పలు సందర్భాల్లో తప్పుచేసిన వారు జువైనల్ అని అంటున్నారు, హేయమైన నేరాలు చేయగలిగే వారికి వయసుతో ఏం సంబంధం ఉంటుంది. ఈ అంశంపై కూడా విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి చట్టం ఒక్కటే పరిష్కారం కాదన్నారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పురావాలని వెంకయ్య సూచించారు.
దోషులను బహిరంగంగా శిక్షించాలి జయాబచ్చన్, ఎంపీ
దిశ అత్యాచారం, హత్య లాంటి ఘటనల్లో దోషులను బహిరంగంగా కొట్టి చంపాలి. కొన్ని దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. నేనే కాస్త కఠినంగా మాట్లాడుతున్నానని తెలుసు. అయినా అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపడమే సరైంది. ఈ తరహా ఘటనలపై ఎన్నోసార్లు మాట్లాడా. నిర్భయ, కథువా, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలపై ప్రజలు, ప్రభుత్వం నుంచి ఇప్పుడు కచ్చితమైన సమాధానాన్ని కోరుకుంటున్నా.
రక్షణ కల్పించడంలో విఫలమైన అధికారులను దేశం ముందు తలదించుకునేలా చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటీవల ఓ అత్యాచార ఘటనలో కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే.. అప్పీల్‌కు వెళ్లిన దోషులు జీవితఖైదు పొందారని, దోషులకు వెంటనే శిక్షపడేలా చట్టాలు రూపొందించాలని టీఆర్‌ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ కోరారు. హత్యాచార ఘటన జరిగిన 15–20 రోజుల్లోనే విచారించి దోషులను శిక్షించాలని ఎంపీ టి. సుబ్బిరామిరెడ్డి సూచించారు. టీఎంసీ ఎంపీ డా.సంతను సేన్, టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్, కాంగ్రెస్ ఎంపీ అమీ యాజ్నిక్, అన్నాడీఎంకే ఎంపీ విజలా సత్యనాథ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా, డీఎంకే ఎంపీ పి. విల్సన్, కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ మాట్లాడారు.
ఏకతాటిపైకి రావాలి గులాం నబీ ఆజాద్
మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు యావత్ దేశం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అత్యాచారం, హత్య ఘటనల నిరోధానికి చట్టాలు చేసినా, వాటి ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితిని కనిపించడం లేదు. మహిళలపై ఇలాంటి దాడులను ఏ ప్రభుత్వం, ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ అధికారి కోరుకోరన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలు, రాజకీయాలకు అతీతంగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment