
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై రాజ్యసభలో ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఇక ప్రభుత్వ తదుపరి అడుగు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడమే. ఆ ప్రాంతాన్ని భారత్‌కు తిరిగి అప్పగించమని పాకిస్తాన్ ప్రధానికి చెప్పడం తప్ప, ఇక మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమీ మిగలలేదు, ఆర్టికల్ 370 రద్దుపై సాహసోపేత చర్య తీసుకున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు అభినందనలు. పీవీ నరసింహారావు ప్రభుత్వ సమయంలోనూ పీవోకేను భారత్‌లో కలిపేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించింది.
ఆర్టికల్ 370ని రద్దుచేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న కాంగ్రెస్ వాదన వారి అజ్ఞానాన్ని సూచిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం ప్రకారం నడుచుకుంటోంది. ప్రభుత్వ తీర్మానాన్ని పార్లమెంటుకు తెలియజేయడాన్ని సముచిత చర్యగా భావిస్తున్నాను. ఆర్టికల్370 రద్దు ఇప్పటికే ఆలస్యమైంది. ఆర్టికల్ రద్దు ఏకపక్షమని వాదించేవారికి.. 5లక్షల మంది కాశ్మీరీ పండిట్‌లను, సిక్కులను తరిమివేసిన రోజు గుర్తులేదా. స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి’ అని అన్నారు.