భువనేశ్వర్: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోమవారం తన కొలువులో కొద్దిపాటి మార్పులు చేపట్టారు. ముగ్గురు కొత్త మంత్రులకు కేబినెట్‌లో స్థానం కల్పించారు. ఖాళీ పదవుల్లో వారికి సర్దుబాటు చేయడం విశేషం. స్థానిక లోక్‌సేవా భవన్‌లో సోమవారం ఉదయం జరిగిన మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో కొత్తగా చేరిన సభ్యులు బిక్రమ్‌కేశరి అరుఖా, శారదాప్రసాద్ నాయక్, సుదామ్ మరండిలతో గవర్నర్ ప్రొఫెసర్ గణేషీలాల్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరయ్యారు. విక్రమ్ అరూఖ్ 2008 నుంచి ప్రభుత్వ చీఫ్ విప్, స్పీకర్, గ్రామీణాభివృద్ధి, న్యాయ, అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పు, శాసనసభ వ్యవహారాలు, సమాచారం–ప్రజా సంబంధాలు, సహకారం ప్రభుత్వరంగ సంస్థలు తదితర శాఖల్లో మంత్రిగా కీలకమైన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించారు. నవీన్ కొలువులో మరో మాజీమంత్రి సుధామ్ మరాండీకి పాఠశాలలు, సామూహిక విద్యాశాఖను కేటాయించారు. గతవారం విద్యాశాఖ మాజీమంత్రి సమీర్‌రంజన్ దాస్ పదవికి రాజీనామా చేయడంతో ఈ మంత్రిత్వ శాఖ ఖాళీ అయ్యింది.
నిరంజన పూజారికి ఆరోగ్యశాఖ..
మరాండి గతంలో క్రీడలు–యువజన వ్యవహారా లు, షెడ్యూల్డ్ తెగలు–కులాల అభివృద్ధి(గిరిజన సంక్షేమం), రెవెన్యూ, విపత్తు నిర్వహణ సహాయమంత్రిగా పని చేశారు. ఈదఫా మరాండీని కేబినెట్ హోదాకు ప్రమోషన్ కల్పించారు. అదే విధంగా శ్రీకాంత సాహు గతవారం రాజీనామా చేయడంతో ఖాళీ అయిన కార్మిక శాఖను శారదాప్రసాద్ నాయక్‌కు కేటాయించారు. నాయక్ 2009 నుంచి 2012 వరకు రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమం, గృహనిర్మాణం, నగర అభివృద్ధి, అబ్కారీ శా ఖ సహాయ మంత్రిగా పని చేశారు. నవీన్ కేబినెట్‌లో సీనియర్ మంత్రి, మాజీ స్పీకర్ విక్రమ్ కేశరీ అరూఖ్ కు ఆర్థికశాఖ కేటాయించారు. ఈ ఏడాది జనవరి 29న ఝార్సుగుడలో నవకిషోర్ దాస్ హత్యతో ఖాళీ అయిన ఆరోగ్యశాఖను ప్రస్తుత ఆర్థికమంత్రి నిరంజన్ పూజారికి ఇన్‌చార్జిగా స్థిరపరిచారు.
స్పీకర్‌గా తప్పించి.. మంత్రిగా..
గంజాం ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఆది నుంచి బీజేడీకి కంచుకోటగా ఈ ప్రాంతం చలామణి అవుతోంది. ఈ పరపతి ఏమాత్రం సడలి పోకుండా శంఖం దళం అధ్యక్షుడిగా సీఎం నవీన్ సకాలంలో స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ జిల్లా నుంచి విక్రమకేశరి అరూఖ్ బలమైన నాయకుడిగా అధ్యక్షుడి దృష్టిని ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి కట్టబెట్టడంతో సొంత జిల్లా, నియోజకవర్గ పురోగతి అనుబంధ కార్యకలాపాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేందుకు సమయం అనుకూలించని పరిస్థితులు తలెత్తాయి. దీని దృష్ట్యా ఆయనకు స్పీకర్ పదవి బరువు బాధ్యతలను తొలగించి, మంత్రి పదవితో జిల్లాలో పట్టు సాధించేందుకు సువిశాల అవకాశం కల్పించడం పునర్‌వ్యవస్థీకరణ వ్యూహంగా స్పష్టం అవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికలో గంజాం జిల్లాలోని 13 స్థానాల్లో 12 స్థానాలను కై వసం చేసుకుంది. ఈ పట్టును రానున్న ఎన్నికల్లో ఏమాత్రం చేజార్చుకోకుండా జాగ్రత్త వహించడంలో విక్రమ అరూఖ్ తగిన అభ్యర్థిగా భావించి కొలువులో చోటు కల్పించారు. ఆయన రాజకీయ శైలితో జిల్లాలో బీజేడీ కంచుకోట పట్టు యథాతధంగా కొనసాగుతుందని భావిస్తున్నారు.
బలోపేతమే లక్ష్యంగా..
సుందరగడ్, మయూర్‌భంజ్ జిల్లాల్లో బిజూ జనతాదళ్ గత ఎన్నికల్లో నిరాశజనకమైన ఫలితాలతో సరిబెట్టుకుంది. మయూర్‌భంజ్ లోని 9 స్థానాల్లో బీజేడీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సుందరగడ్ 7 స్థానాల్లో నామమాత్రంగా 2 స్థానాలకే పరిమితమైంది. ఈ రెండూ గిరిజన ప్రభావిత జిల్లాలు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేడీ నిరవధిక కృషికి ఫలితంగా 2022లో జరిగిన జిల్లా పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు సాధించింది. ఈ ప్రేరణతో రానున్న ఎన్నికల్లో బలం పుంజుకునేందుకు ఇద్దరు అనుభవజ్ఞులకు మంత్రి పదవులతో పట్టం గట్టింది. ఈ జిల్లాల నుంచి మంత్రి పదవులు పొందిన సుధాం మరాండి, శారదాప్రసాద్ నాయక్‌కు రానున్న ఎన్నికలు కత్తిమీద సాములాంటి సవాల్‌గా మారాయి. ఈ సందర్భంలో పార్టీ బలం పటిష్ట పరచడం ఇరువురి లక్ష్యంగా కార్యాచరణ కొనసాగించాల్సి ఉంటుంది.
నవీన్ చతురత..
భువనేశ్వర్: మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రానున్న ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ను బలోపేతం చేయడం సంకల్పంగా స్పష్టం అవుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలం పుంజుకునేలా చేయడంతో గట్టి ప్రభావం ఉన్న ప్రాంతంలో పట్టు సడలిపోకుండా అత్యంత జాగరూకత ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పునర్‌వ్యవస్థీకరణ పురస్కరించుకుని గంజాం, సుందర్‌గడ్, మయూర్‌భంజ్ జిల్లాలకు ప్రాతినిధ్యం పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల నుంచి మాజీ మంత్రులకు పదవులు కట్టబెట్టారు. గంజాం నుంచి విక్రమకేశరి అరూఖ్, మయూర్‌భంజ్ నుంచి సుధాం మరాండి, సుందరగడ్ నుంచి శారదాప్రసాద్ నాయక్‌కు మంత్రి పదవులు వరించాయి. గంజాం జిల్లాలో బీజేడీ కోటను మరింత బలోపేతం చేసేందుకు, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సరైన రీతిలో రాణించని సుందర్‌గడ్, మయూర్‌భంజ్ జిల్లాలలో బీజేడీ బలాన్ని పెంచడానికి అనుభవజ్ఞులను ఎంపిక చేసి, మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఈ పదవులతో సొంత జిల్లాల్లో పురోగతి దిశలో కృషి చేసేందుకు మార్గం సుగమం అవుతుందనే దృక్పథంతో కేబినెట్ విస్తరణ పురస్కరించుకుని నవీన్ పట్నాయక్ ఆచితూచి మార్పుచేర్పులు చేపట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment