
ప్రతీకాత్మక చిత్రం
భువనేశ్వర్: విద్య వ్యాపారంగా మారిందనడానికి ఒడిషాలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. తన కోచింగ్ సెంటర్‌లో చదువుచెప్పే టీచర్ మరో ఇన్‌స్టిట్యూట్‌లోకి మారడాన్ని జీర్ణించుకోలేని ఓ ప్రబుద్ధుడు అత్యంత అనాగరిక చర్యకు పాల్పడ్డాడు. సదరు టీచర్ మెడలో చెప్పుల దండ వేసి ఘోర అవమానం చేశాడు. ఈ ఘటన నయాగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాలు.. తపన్ మహాపాత్రకు చెందిన సత్యసాయి కోచింగ్ సెంటర్‌లో మయాధర్ మహాపాత్ర అనే వ్యక్తి ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు.
గత కొంతకాలంగా తపన్ జీతం సరిగా చెల్లించడం లేదు. దాంతో మయాధర్ ఇటీవల మరో కోచింగ్ సెంటర్‌లో జాబ్‌లో చేరాడు. మయాధర్ వెళ్లిపోవడంతో తన కోచింగ్ సెంటర్ సరిగా నడవడం లేదని తపన్ అతనిపై పగ పెంచుకున్నాడు. మంగళవారం విధులకు బయల్దేరిన మయాధర్‌ను తపన్ మరో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. అతనిపై దాడికి దిగారు. చెట్టుకు కట్టేసి చెప్పుల దండవేసి అవమానించారు. విషయం బయటపెడితే ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అయితే, ఈ వ్యవహారాన్నంత ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. తనకు ఘోర అవమానం చేసిన తపన్, మరో ఇద్దరిపై మయాధర్ ఫిర్యాదు చేశాడని జిల్లా ఎస్పీ ఆశిష్‌సింగ్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment