
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్‌లో 85,000పైగా లీటర్ల దేశీయ మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... బాలసోర్ జిల్లా ప్రధాన కార్యాలయం శివార్లలో ఉన్న పురుషా బాలసోర్ ప్రాంతంలో భారీగా దేశీయ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతి మూడు ఇళ్లలో ఒకరు మద్యం తయారీలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. దీనివల్ల కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నేరాల రేట్లు గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. దీనిపై సమాచారం మేరకు ఒడిశాలోని బాలసోర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ఆపరేషన్ నిర్వహించి, అనేక అక్రమ దేశీయ మద్యం తయారీ విభాగాలపై మంగళవారం దాడి చేశారన్నారు. చెరువుల లోపల దాచిన మద్యం గ్యాలన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
ఈ ఘటనపై బాలసోర్ ఎస్పీ సుధాన్షు మిశ్రా మాట్లాడుతూ, " మేము 70,000 లీటర్ల పులియబెట్టిన మద్యం పానకాన్ని ధ్వంసం చేశాం. దేశీయ మద్యం తయారీలో ముడిసరుకుగా ఉపయోగించే 'మహువా, మొలాసిస్, మద్యం తయారీ పాత్రలతో పాటు 12,000 లీటర్ల తయారుచేసిన మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని.’’ తెలిపారు. మరో ఘటనలో బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 12 మంది మరణించారు. ఈ మరణాలకు సంబంధించి కనీసం 16 మందిని అరెస్టు చేశారు.