భువనేశ్వర్: సామాజిక పరివర్తనకు కవిత శక్తివంతమైన సాధనమని, దీనిని పాఠ్యాంశంలో భాగంగా చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోరారు. ప్రగతికి శాంతియుత వాతావరణం అవసరం. శాంతి, సంతోషం, సోదరభావం, సామరస్యాన్ని సాధించడంలో కవిత్వం ఒక శక్తివంతమైన మాధ్యమమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఆదివారం భువనేశ్వర్‌లో 39వ అంతర్జాతీయ కవి సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కవితా పఠనాన్ని పాఠ్యాంశాల్లో తప్పనిసరి అంశంగా చేయాలని పాఠశాల యాజమాన్యాలను కోరుతున్నాను. అలాగే, సాహిత్యం, కళలు, సామాజిక శాస్త్రాలకు ప్రోత్సాహం ఇవ్వాలని వర్సిటీలను కోరుతున్నా. దేశానికి వైద్యులు, ఇంజినీర్లు, సైంటిస్టులు ఎంత ముఖ్యమో కవులు, రచయితలు, కళాకారులు, గాయకులు కూడా అంతే అవసరం’ అని పేర్కొన్నారు.
‘కవిత్వం శాంతిని ప్రోత్సహించాలి, సార్వత్రిక సోదరభావం, సామాజిక సామరస్యం, సహనాన్ని పెంపొందించడానికి ప్రజలను ప్రేరేపించాలి. కవిత్వం సామాజిక పరివర్తన ప్రక్రియను వేగవంతం చేసే శక్తివంతమైన ప్రేరకంగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. వికాసశీల, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి కళలు, సంస్కృతిని ప్రోత్సహించడం కీలకమన్నారు. భారతీయ సంస్కృతి మాదిరిగానే కవిత్వం కూడా ఎంతో ప్రాచీనమైందన్నారు. మహాభారతం, రామాయణం వంటి గొప్ప ఇతిహాసాలు ఇప్పటివరకు వచ్చిన కవిత్వాల్లో ఉత్తమ ఉదాహరణలని, కాళిదాసు, మీరాబాయి, తులసీదాస్ వంటి వారు తమ కవిత్వంతో తరాలుగా అందరినీ అలరిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment