ఎప్పుడో 1975లో... భారత హాకీ జట్టు అజిత్‌పాల్ సింగ్ నాయకత్వంలో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. అయితే ఆ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా నాటి మేటి ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. ట్రోఫీ గెలవడం సంగతేమో గానీ ఆ తర్వాత 11 ప్రపంచ కప్‌లు జరిగినా మన టీమ్ కనీసం సెమీ ఫైనల్ కూడా చేరలేకపోవడం నిరాశ కలిగించే అంశం.
వరుసగా రెండో సారి మనమే ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో భారత జట్టు రాత మారుతుందా... కొన్నాళ్ల క్రితం ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శించి కాంస్యం సాధించిన మన టీమ్ అదే జోరును చూపిస్తుందా అనేది ఆసక్తికరం.
భువనేశ్వర్: భారత గడ్డపై మరో విశ్వ సంబరానికి సమయం ఆసన్నమైంది. 15వ హాకీ వరల్డ్ కప్ నేడు లాంఛనంగా ప్రారంభం కానుంది. ఒడిషాలోని రెండు వేదికలు భువనేశ్వర్, రూర్కెలాలలో 17 రోజుల పాటు మొత్తం 44 మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో అర్జెంటీనాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. తొలి రోజే బరిలోకి దిగనున్న భారత్... స్పెయిన్‌ను ఎదుర్కోనుంది.
భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ఇప్పటికే అందుబాటులో ఉండగా... కొత్తగా ఈ టోర్నీ కోసం మరో పెద్ద హాకీ స్టేడియాన్ని రూర్కెలాలో నిర్మించారు. 24 మ్యాచ్‌లు భువనేశ్వర్‌లో, 20 మ్యాచ్‌లు రూర్కెలాలో జరుగుతాయి. మొత్తం 16 జట్లు బరిలోకి దిగుతుండగా వాటిని నాలుగు పూల్‌లుగా విభజించారు. ముందుగా తమ గ్రూప్‌లో ఇతర మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘క్రాస్ ఓవర్స్’, క్వార్టర్స్, సెమీస్ ఉంటాయి. జనవరి 29న ఫైనల్ నిర్వహిస్తారు.
నేటి మ్యాచ్‌లు
అర్జెంటీనా X దక్షిణాఫ్రికా (మ.గం. 1.00 నుంచి)
ఆస్ట్రేలియా X ఫ్రాన్స్ (మం.గం. 3.00 నుంచి)
ఇంగ్లండ్ X వేల్స్ (సా.గం. 5.00 నుంచి)
భారత్ X స్పెయిన్ (సా.గం. 7.00 నుంచి)
పూల్‌ల వివరాలు
‘ఎ’ – అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా
‘బి’ – బెల్జియం, జర్మనీ, జపాన్, కొరియా
‘సి’ – చిలీ, మలేసియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్
‘డి’ – భారత్, స్పెయిన్, ఇంగ్లండ్, వేల్స్
* ప్రపంచకప్‌ను అత్యధికంగా పాకిస్తాన్ (4 సార్లు) గెలవగా...నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా చెరో 3 టైటిల్స్ సాధించాయి. జర్మనీ రెండు సార్లు విజేతగా నిలవగా...భారత్, బెల్జియం ఒక్కో సారి ట్రోఫీని అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment