తీరంలో ‘సూర్యో’దయం | Sunrisers hat-trick of victories in 85 runs in Mumbai draft | Sakshi
Sakshi News home page

తీరంలో ‘సూర్యో’దయం

Published Sun, May 8 2016 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 11:41 PM

తీరంలో ‘సూర్యో’దయం

తీరంలో ‘సూర్యో’దయం

సన్‌రైజర్స్ విజయాల హ్యాట్రిక్   85 పరుగులతో ముంబై చిత్తు
రాణించిన ధావన్, వార్నర్  చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు

‘సొంత మైదానం’ కాని
సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన పట్టును ప్రదర్శించింది. గత ఏడాది ఇక్కడే హోం గ్రౌండ్‌గా మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జట్టు ఇప్పుడు ప్రత్యర్థి స్థానంలో తలపడింది. అయితే వేదిక మారినా ఆ జట్టు జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి విశాఖ తీరంలో ముంబైని తుక్కుగా ఓడించి లీగ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ముందుగా వార్నర్, ధావన్ మెరుపులకు తోడు అద్భుత బౌలింగ్ రైజర్స్‌ను నిలబెట్టింది.

 ఒకరు కాదు ఇద్దరు కాదు...నలుగురు సన్‌రైజర్స్ బౌలర్లు తమ తొలి ఓవర్‌లోనే వికెట్ తీస్తే భారీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అచేతనంగా మారిపోయింది. 26 బంతులు ఆడే సరికే ఐదుగురు ఆటగాళ్లు అవుట్ కాగా... లీగ్‌లో ఛేదన అంటే చెలరేగిపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం మొదలు... పది ఓవర్ల లోపే ఏడు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు ఏమీ చేయలేక చేతులెత్తేసింది. సీజన్‌లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన రోహిత్ బృందం మూడు విజయాల తర్వాత ఓటమిని మూటగట్టుకుంది.

సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుతమైన ప్రదర్శనతో ఆ జట్టు లీగ్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ 85 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (57 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయమైన బ్యాటింగ్‌కు తోడు వార్నర్ (33 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారం జట్టుకు భారీ స్కోరు అందించాయి. అనంతరం ముంబై 16.3 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సన్ బలమైన బౌలింగ్ ముందు ముంబై బ్యాటింగ్ సమష్టిగా విఫలమైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆశిష్ నెహ్రా (3/15), ముస్తఫిజుర్ రహమాన్ (3/16) చెలరేగగా, బరీందర్‌కు 2 వికెట్లు దక్కాయి. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ఇదే మైదానంలో పుణేతో తలపడుతుంది.

ఓపెనర్లు దూకుడు: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు వార్నర్, ధావన్ మరోసారి హైదరాబాద్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. ముందుగా వార్నర్ జోరు మొదలు పెట్టగా, ఆ తర్వాత ధావన్ లయ అందుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌గా మలచిన వార్నర్...హర్భజన్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించాడు. మెక్లీనగన్ బౌలింగ్‌లో కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. అయితే భజ్జీ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్, అదే ఊపులో అవుట్ కావడంతో 85 పరుగుల (59 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. విలియమ్సన్ (2) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.

ఈ దశలో ధావన్, యువరాజ్ కలిసి జట్టును నడిపించారు. గత మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ తన 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో చెలరేగాడు. పొలార్డ్ వేసిన ఓవర్లో యువీ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో రైజర్స్ ఇన్నింగ్స్ వేగం పెరిగింది. మరోవైపు 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్, అనంతరం బుమ్రా వేసిన రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది దూకుడు ప్రదర్శించాడు. చివరి ఓవర్ నాలు గో బంతికి యువీ హిట్ వికెట్‌గా వెనుదిరగ్గా, ఓవర్లో ఏడు పరుగులే వచ్చాయి. అయితే 15-19 మధ్య ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ 68 పరుగులు చేయడం జట్టు భారీ స్కోరుకు కారణమైంది.

టపటపా...: భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ పూర్తిగా పట్టు తప్పింది. ఆ జట్టులో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీస స్థాయిలో పోరాడలేకపోయాడు. తొలి ఓవర్ చివరి బంతికి పార్థివ్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ శుభారంభం ఇవ్వగా, నెహ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతినే రోహిత్ (5) వికెట్లపైకి ఆడుకున్నాడు. నెహ్రా తన రెండో ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. నాలుగో బంతికి రాయుడు (6) వెనుదిరగ్గా, ఆరో బంతిని బట్లర్ (2) నేరుగా కీపర్ చేతుల్లోకి పంపించాడు. భువీ, నెహ్రాలాగే తొలి ఓవర్లో వికెట్ పండగ చేసుకుంటూ బరీందర్ కూడా తన రెండో బంతికే కృనాల్ (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేయడంతో ముంబై 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.

బరీందర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ (11) ఆదుకునే ప్రయత్నం చేసినా అతనూ వెంటనే అవుటయ్యాడు. ఈసారి నా వంతు అంటూ తొలి బంతికే హార్దిక్ (7)ను అవుట్ చేసిన ముస్తఫిజుర్, రెండో ఓవర్ తొలి బం తికి సౌతీ (3)ని వెనక్కి పంపడంతో ముంబై గెలు పు ఆశలు కోల్పోయింది. హర్భజన్ (21 నాటౌట్; 2 ఫోర్లు) కొద్దిసేపు పోరాడినా మరో 21 బంతులు ఉండగానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది.

 స్కోరు వివరాలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 48; ధావన్ (నాటౌట్) 82; విలియమ్సన్ (సి) రోహిత్ (బి) హర్భజన్ 2; యువరాజ్ (హిట్‌వికెట్) (బి) మెక్లీనగన్ 39; హెన్రిక్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177

వికెట్ల పతనం: 1-85; 2-91; 3-176.

బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-38-1; హర్భజన్ 4-0-29-2; బుమ్రా 4-0-35-0; హార్దిక్ 1-0-10-0; పొలార్డ్ 2-0-23-0; కృనాల్ 1-0-5-0.

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) నెహ్రా 5; పార్థివ్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రాయుడు (సి) విలియమ్సన్ (బి) నెహ్రా 6; కృనాల్ (సి) ధావన్ (బి) బరీందర్ 17; బట్లర్ (సి) ఓజా (బి) నెహ్రా 2; పొలార్డ్ (సి) బరీందర్ (బి) హెన్రిక్స్ 11; హార్దిక్ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 7; హర్భజన్ (నాటౌట్) 21; సౌతీ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 3; మెక్లీనగన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 8; బుమ్రా (సి) ఓజా (బి) బరీందర్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 92.

 వికెట్ల పతనం: 1-5; 2-5; 3-28; 4-30; 5-30; 6-49; 7-50; 8-58; 9-78; 10-92.

బౌలింగ్: భువనేశ్వర్ 3-0-23-1; నెహ్రా 3-0-15-3; బరీందర్ 3.3-0-18-2; హెన్రిక్స్ 4-0-18-1; ముస్తఫిజుర్ 3-0-16-3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement