ముంబైని పడగొట్టి ముందడుగు...
⇒హైదరాబాద్ కీలక విజయం
⇒ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
⇒7 వికెట్లతో ముంబై చిత్తు
⇒రాణించిన ధావన్, కౌల్
డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక సమయంలో స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యే స్థితిలో బరిలోకి దిగిన జట్టు సొంతగడ్డపై తమ బలాన్ని ప్రదర్శించింది. ముందు బౌలింగ్‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సమష్టి ప్రదర్శనతో పటిష్ట ముంబైని కంగుతినిపించింది. ఫలితంగా లీగ్‌లో ముందుకెళ్లే అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఉప్పల్ స్టేడియంలో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నెగ్గి సీజన్‌లో సొంత మైదానంలో తమ విజయాల రికార్డును 6–1తో ముగించింది.
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్‌లో మరో చక్కటి విజయం దక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. సునాయాస లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (45 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం సన్‌రైజర్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (46 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి బ్యాటింగ్‌తో ముందుండి నడిపించగా... హెన్రిక్స్ (35 బంతుల్లో 44; 6 ఫోర్లు) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 66 బంతుల్లో 91 పరుగులు జోడించారు. హైదరాబాద్ శనివారం తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌తో కాన్పూర్‌లో తలపడుతుంది.
కెప్టెన్ ఇన్నింగ్స్...
భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు మైదానంలో మాత్రం తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోయింది. 20 ఓవర్లలో ఏ దశలోనూ ఆ జట్టు రన్‌రేట్ ఓవర్‌కు 7 పరుగులు దాటలేదు. నెమ్మదైన పిచ్‌తో పాటు సన్‌రైజర్స్ బౌలర్లు ప్రత్యర్థిని పూర్తిగా కట్టి పడేశారు. తొలి రెండు ఓవర్లలో 4 పరుగులే చేసిన ముంబై, సిమన్స్ (1) వికెట్ కూడా కోల్పోయింది. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ సహా 16 పరుగులు రాగా, ఒత్తిడిలో నితీశ్ రాణా (9) విఫలమయ్యాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 36 పరుగులే చేయగా, దూకుడుగా ఆడే ప్రయత్నంలో పార్థివ్ (17 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో రోహిత్, హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 15) కలిసి జట్టును ఆదుకున్నారు. రోహిత్ ధాటిని ప్రదర్శించగా, పాండ్యా సింగిల్స్‌కే పరిమితమయ్యాడు. హెన్రిక్స్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన రోహిత్ 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 49 బంతుల్లో 60 పరుగులు జోడించిన తర్వాత పాండ్యా అవుటయ్యాడు. కొద్ది సేపటికే కౌల్ బౌలింగ్‌లో రోహిత్ కూడా బౌల్డ్ కాగా, పొలార్డ్ (5) ప్రభావం చూపలేకపోయాడు.
భారీ భాగస్వామ్యం...
ఫామ్‌లో ఉన్న కెప్టెన్ వార్నర్ (6)ను ఆరంభంలోనే అవుట్ చేసి ముంబై సంబరాల్లో మునిగింది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ధావన్, హెన్రిక్స్ సాధికారిక బ్యాటింగ్ ముందు ఎలాంటి వ్యూహాలు పని చేయలేదు. ఎలాంటి తడబాటు లేకుండా చకచకా పరుగులు రాబట్టిన ధావన్, హెన్రిక్స్‌లను ఏ ముంబై బౌలర్ కూడా నియంత్రించలేకపోయాడు. కరణ్ శర్మ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో ధావన్ దూకుడు కనబర్చగా, పాండ్యా, మలింగ ఓవర్లలో హెన్రిక్స్ రెండేసి ఫోర్లు కొట్టాడు. చివరకు బుమ్రా ఈ జోడీని విడదీశాడు. మరో ఎండ్‌లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, యువరాజ్ (9) విఫలమయ్యాడు. అయితే విజయ్ శంకర్ (15 నాటౌట్) సహకారంతో ధావన్ మ్యాచ్ ముగించాడు.
ఇదీ సమీకరణం...
ఐపీఎల్‌లో అధికారికంగా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న కోల్‌కతా, పుణే కూడా దాదాపుగా ముందుకు వెళ్లినట్లే. తాజా విజయంతో సన్‌రైజర్స్ 15 పాయింట్లతో తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా... గుజరాత్‌పై చివరి మ్యాచ్ కూడా గెలిస్తే ఎలాంటి లెక్కల అవసరం లేకుండా 17 పాయింట్లతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు వెళుతుంది. హైదరాబాద్‌ను దాటి పంజాబ్ ముందుకు వెళ్లాలంటే అది తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో కూడా తప్పనిసరిగా విజయం సా«ధించాల్సి ఉంటుంది. అది అంత సులువు కాదు కాబట్టి హైదరాబాద్‌కు ప్రమాదం ఉండకపోవచ్చు. ముంబైపై సన్‌రైజర్స్ గెలుపుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా ప్లే ఆఫ్ రేసు నుంచి అవుటైంది.