మరింత రైజింగ్ | Dhawan steers SRH to a 5-wicket win | Sakshi
Sakshi News home page

మరింత రైజింగ్

Published Fri, May 6 2016 11:05 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

మరింత రైజింగ్ - Sakshi

మరింత రైజింగ్

సన్‌రైజర్స్‌కు ఐదో విజయం 
5 వికెట్లతో గుజరాత్ ఓటమి
సమష్టిగా రాణించిన బౌలర్లు  
ధావన్ కీలక ఇన్నింగ్స్

 
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మొదటి రెండు ఓవర్లు మెయిడిన్లు... బౌలర్లంతా పోటాపోటీగా కట్టుదిట్టంగా బంతులు వేయడం... సన్‌రైజర్స్‌కు బలమైన బౌలర్లు మరోసారి చెలరేగారు. అయితే 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాట్స్‌మెన్ తడబడినా... శిఖర్ ధావన్ కీలక ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ లయన్స్‌పై గెలిచింది. సీజన్‌లో వార్నర్ సేనకు ఇది ఐదో విజయం. దీంతో ప్లే ఆఫ్ దిశగా హైదరాబాద్ మరో అడుగు ముందుకు వేసింది.
 
 
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతోంది. సమర్థ బౌలింగ్‌కు తోడు ధావన్ బ్యాటింగ్ ప్రదర్శనతో మరో కీలక విజయం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది.  టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తఫిజుర్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


 ఫించ్ మినహా...: మెకల్లమ్, స్మిత్... ఇద్దరూ విధ్వంసకర బ్యాట్స్‌మెన్. కానీ సన్ బౌలర్ల నిలకడతో కనీసం సింగిల్స్ తీయడానికి కూడా కిందామీదా పడ్డారు. మూడో ఓవర్ రెండో బంతికి ఆ జట్టు ఖాతా తెరిచింది. అయితే ఇదే ఒత్తిడిలో స్మిత్ (9 బంతుల్లో 1) అవుటయ్యాడు. రైనా (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేదు. పవర్‌ప్లేలో ఆ జట్టు 26 పరుగులు మాత్రమే చేయగలిగింది.  విలియమ్సన్, వార్నర్‌ల అద్భుతమైన క్యాచ్‌లకు కార్తీక్ (0), మెకల్లమ్ (19 బంతుల్లో 7) వెనుదిరగడంతో లయన్స్ 34 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫించ్, బ్రేవో (20 బంతుల్లో 18; 1 ఫోర్) కొద్దిగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 45 పరుగులు జోడించిన తర్వాత బ్రేవో వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాంగాఫ్‌లో వార్నర్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో ఫించ్ బతికిపోయాడు. ఆఖర్లో ఫించ్‌కు కొద్ది సేపు జడేజా (13 బంతుల్లో 18; 2 ఫోర్లు) అండగా నిలవడంతో లయన్స్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి.


ధావన్ యాంకర్ ఇన్నింగ్స్: స్వల్ప లక్ష్య ఛేదనలో రైజర్స్‌కు వార్నర్ (17 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడైన ఆరంభం అందించాడు. సాంగ్వాన్ వేసిన రెండో ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. అయితే ధావల్ తన తొలి బంతికే వార్నర్‌ను అవుట్ చేయడంతో గుజరాత్‌కు బ్రేక్ లభించింది. ఆ వెంటనే విలియమ్సన్ (6) వెనుదిరగ్గా, హెన్రిక్స్ (16 బంతుల్లో 14; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్‌లో ధావన్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 10 ఓవర్లు ముగిసే సరికి అతను 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత మరింత బాధ్యత తీసుకొని ఆడిన అతను జట్టును ముందుండి నడిపించాడు. ఐపీఎల్-9లో తొలి మ్యాచ్ ఆడిన యువరాజ్ (14 బంతుల్లో 5) పూర్తిగా నిరాశపరిచాడు. ఈ దశలో గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కొంత ఒత్తిడి నెలకొంది. అయితే ధావన్ సంయమనంతో ఆడుతూ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు.
 
 
 స్కోరు వివరాలు

గుజరాత్ లయన్స్ బ్యాటింగ్: డ్వేన్ స్మిత్ (సి) ముస్తఫిజుర్ (బి) భువనేశ్వర్ 1; మెకల్లమ్ (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 7; రైనా (సి) అండ్ (బి) భువనేశ్వర్ 20; కార్తీక్ (సి) విలియమ్సన్ (బి) ముస్తఫిజుర్ 0; ఫించ్ (నాటౌట్) 51; బ్రేవో (సి) (సబ్) విజయ్ శంకర్ (బి) బరీందర్ 18; జడేజా (సి) భువనేశ్వర్ (బి) ముస్తఫిజుర్ 18; ప్రవీణ్ కుమార్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 126.

వికెట్ల పతనం: 1-2; 2-24; 3-25; 4-34; 5-79; 6-106;
బౌలింగ్: భువనేశ్వర్ 4-1-28-2; నెహ్రా 4-1-23-0; ముస్తఫిజుర్ 4-0-17-2; బరీందర్ 3-0-21-1; హెన్రిక్స్ 3-0-24-1; యువరాజ్ 2-0-13-0.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ప్రవీణ్ (బి) ధావల్ 24; ధావన్ (నాటౌట్) 47; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) ప్రవీణ్ 6; హెన్రిక్స్ (సి) కార్తీక్ (బి) బ్రేవో 14; యువరాజ్ (సి) సాంగ్వాన్ (బి) ధావల్ 5; హుడా (సి) కార్తీక్ (బి) బ్రేవో 18; ఓజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 129.

వికెట్ల పతనం: 1-26; 2-33; 3-55; 4-81; 5-108.  
బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-28-1; సాంగ్వాన్ 2-0-28-0; ధావల్ 4-1-17-2; కౌశిక్ 4-0-25-0; జడేజా 2-0-14-0; బ్రేవో 3-0-14-2.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement