ప్రయాణికుల రైలు కన్నా సరకులను తీసుకెళ్లే గూడ్సు రైలు చాలా పొడుగుంటుందన్న విషయం మనకు తెల్సిందే. రైల్వే క్రాసింగ్ వద్ద నిలబడి ముందు నుంచి పొతున్న గూడ్సు రైలును ‘అబ్బా! ఎప్పుడు వెళ్లి పోతుందా!’ అంటూ అసహనంతో ఎదురు చూసిన చిన్నప్పటి రోజులు అందరికి గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు భారత రైలు పట్టాలపైకి అంతకన్నా మూడింతలు పొడవున్న గూడ్సు రైళ్లు వస్తున్నాయి. పైథాన్ రేక్‌గా పిలిచే 147 వ్యాగన్లు కలిగిన రెండు కిలోమీటర్ల పొడవున్న గూడ్సు రైలును ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఇటీవల ఒడిశాలోని సాంబల్‌పూర్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయోగాత్మకంగా నడిపింది.
మూడు రేక్‌లను అనుసంధానించిన అంటే మొదటి రేక్‌లో 45 వ్యాగన్లు ఉండగా, రెండు, మూడు రేక్స్‌లో 51 చొప్పున వ్యాగన్లు అనుసంధానించిన ఈ గూడ్సు రైలుకు నాలుగు ఇంజన్లతోపాటు మూడు గార్డ్ వ్యాన్లను కలిపారు. విశాఖపట్నం రేవుకు తీసుకెళ్లాల్సిన కంటేనర్లను ఈ గూడ్సు వ్యాగన్లలో పంపించారు. సహరాన్‌పూర్ డివిజన్ రైల్వే మేనేజర్ ఈ రైలు గమనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇలా పొడవైన గూడ్సు రైళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఆర్థికంగా ఎంతో కలసి వస్తుందని ఆయన అన్నారు.