రథయాత్ర సందర్భంగా రథాలపైకి ఎక్కి మూలవిరాట్లను స్పృశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.. మూలవిరాట్ల స్పర్శ వివాదాల మయం కావడంతో దీనిని పూర్తిగా నివారించాలని అధికారులు భావించారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు మూల విరాట్లను స్పృశించడాన్ని నిషేధించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విదేశంలో నివసిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని జైలుపాలుచేశారు.. కానీ అంతకుముందు, తర్వాత యథేచ్ఛగా స్పృశించినా చర్యలు తీసుకోలేదు.. స్వామివారి సన్నిధిలో ఉండే సేవాయత్‌లే అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది..
పూరీ/భువనేశ్వర్: మూల విరాట్ల స్పర్శ వివాదం రథయాత్రతో ముడిపడి ఉంది. సంప్రదాయబద్ధంగా రథయాత్ర ముగిసినా స్పర్శ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆది వారం నిర్వహించిన నీలాద్రి విజేతో ఈ యాత్రకు తెర పడింది. మూల విరాట్లు శ్రీ మందిరం రత్న వేదికకు సురక్షితంగా చేరాయి. రథాల పైకి వెళ్లడం, మూల విరాట్లుని స్పర్శించడం నిషేధించినట్లు శ్రీ మందిరం దేవస్థానం ప్రకటించింది. ఒడిశా హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఆదేశాల్ని జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది.
ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించింది. అధికారుల ఆదేశాలను సేవాయత్‌లు ఉల్లంఘించినా పట్టించుకోని యంత్రాంగం సామాన్యులను మాత్రం వేధిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది రథ యాత్ర తొలి ఘట్టం స్నాన పూర్ణిమ నుంచి మూల విరాట్లుని స్పర్శిస్తున్నట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సేవాయత్‌ల ప్రేరణతో పలువురు అనధికారిక వ్యక్తులు స్నాన మండపంపై మూల విరాట్లుని స్పర్శించినట్లు వచ్చిన ఆరోపణల్ని శ్రీమందిరం ప్రధాన పాలనాధికారి సీఏఓ పరోక్షంగా ఖండించి సేవాయత్‌లకు అండగా నిలిచి హై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనలో సేవాయత్ వర్గాల్ని ప్రోత్సహించినట్లు నీలాద్రి విజే ఘట్టం రుజువు చేసింది.
రథ యాత్రలో నీలాద్రి విజే చిట్ట చివరి ఘట్టం. రథాలపై నుంచి మూల విరాట్లుని వరుస క్రమంలో (గొట్టి పొహొండి) దించి శ్రీ మందిరం రత్న వేదికపై యథా తథంగా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియకు కాసేపటి ముందుగానే సేవాయత్ వర్గాల కుటుంబీకులు పిల్లాపాపలతో రథాలపైకి వెళ్లి మూల విరాట్లను బాహాటంగా స్పర్శించారు. శ్రీ మందిరం ప్రధాన పాలనాధికారి సీఏఓ, జిల్లా కలెక్టరు, పోలీసు సూపరింటెండెంటు వంటి అతిరథ మహారథుల సమక్షంలో జరిగినా ఏ విధమైన చర్యలు చేపట్టలేదు.
అధికారుల మద్దతుతోనే?
సేవాయత్‌ల ఆగడాలకు శ్రీ మందిరం దేవస్థానం అధికార యంత్రాంగం మద్దతుగా నిలుస్తుందని ఈ వ్యవహారం స్పష్టం చేసింది. గుండిచా మందిరం ఆవరణలో రథాలు ఉండగా సేవాయత్ కుటుంబీకులు రథంపైకి వెళ్లి మూల విరాట్లుని స్పర్శించిన సందర్భంలో దేవస్థానం అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోలేదు. మర్నాడు రథాలపైకి వెళ్లిన ప్రవాస భారతీయుడు (ఒడియావాసి)పై చట్టపరమైన ఉత్తర్వుల ఉల్లంఘన నేరం కింద అరెస్టు చేశారు. ఈ పరిస్థితుల్లో సేవాయత్ కుటుంబీకుల వ్యవహారంలో పెదవి కదపకపోవడం ఏమిటనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి విజే ఉత్సవం జరుగుతుండగా సేవాయత్ కుటుంబీకులు రథాలపైకి వెళ్లడంతో గొట్టి పొహొండి తీవ్రంగా ప్రభావితం అయింది. నీలాద్రి విజే దాదాపు ఆది వారం రాత్రంతా జరిపించాల్సి వచ్చింది. తెల్లారితే సోమ వారం అనగా నీలాద్రి విజేని అతి కష్టం మీద ముగిించాల్సి రావడం విచారకరం.
కలెక్టరు బదిలీకి సేవాయత్‌ల డిమాండు
నీలాద్రి విజే ఉత్సవంలో బలభద్రుని రథం తాళ ధ్వజంపైకి సేవాయత్ తన కుమార్తెని తీసుకు వెళ్లి మూల విరాట్లుకు స్పర్శింపజేశారు. అశేష జన సమూహం సమక్షంలో ఈ తప్పిదానికి బాహాటంగా పాల్పడిన సేవాయత్‌ని అధికార యంత్రాంగం నిలదీయడంతో జిల్లా కలెక్టరుని ఇక్కడ నుంచి బదిలీ చేయాలని తక్షణమే ఆందోళనని ప్రేరేపించారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి అరుణ్ కుమార్ సాహు సమక్షంలో ఈ రగడ చోటుచేసుకుంది. అధికారులు, సేవాయత్‌ల మధ్య రగడం పుంజుకోవడంతో గొట్టి పొహొండి తంతు దాదాపు ముప్పావు గంట సేపు స్తంభించిపోయింది. సేవాయత్ వర్గాలతో మంత్రి అరుణ్ కుమార్ సాహు సంప్రదింపులు జరిపి నీలాద్రి విజే ఉత్సవాన్ని ముగింపజేశారు.
పునరావృతం కాకుండా చర్యల్ని పటిష్టం చేయాలి: మహా రాజా
మూల విరాట్లుని అనధికారిక వర్గాలు స్పర్శించడం అపచారం. ఈ విధానం నివారించాలని పూరీ గజపతి మహా రాజా దివ్య సింఘ్‌దేవ్ లోగడ ప్రతిపాదించారు. స్థానిక గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి ఆయనతో ఏకీభవించారు. వీరివురి అభిప్రాయంతో రాష్ట్ర హై కోర్టు కూడ ఏకీభవించి పూజలు, సేవాదులు నిర్వహించే యంత్రాంగం మినహా ఇతర వర్గాలు మూల విరాట్లుకు స్పర్శించరాదని హై కోర్టు తీర్మానించింది. ఈ తీర్మానం మేరకు ఈ ఏడాది రథాలపైకి వెళ్లిన, మూల విరాట్లుకు స్పర్శించిన చర్యలు చేపడతామని హెచ్చరించిన అధికార యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలం కావడంతో ర థయాత్ర వివాదంతంగా ముగిసింది.
యువతి వీరంగం
Published Tue, Jul 19 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
Advertisement
Advertisement