
న్యూజిలాండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన పరాభవానికి భారత్ తగిన రీతిలో స్పందించింది. ఈ సారి ప్రత్యర్థి వ్యూహాలను ముందే అంచనా వేసి అందుకు తగిన రీతిలో సిద్ధమైన టీమిండియా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వలేదు. టాస్ కోల్పోయినా కూడా సాధికారిక బౌలింగ్‌తో ముందు ప్రత్యర్థిని కట్టడి చేసి ఆపై అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ అద్భుత ఆరంభానికి బుమ్రా అండగానిలవగా... ఆ తర్వాత మిగతా బౌలర్లూ అదే పట్టునుకొనసాగించడంతో కివీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.అనంతరం మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు భారత్‌ను గెలుపు దిశగా నడిపించాయి. గత మ్యాచ్‌లో కివీస్ విజయంలాగే ఆరు వికెట్ల తేడాతో నెగ్గి కోహ్లి సేన దీటైన జవాబిచ్చింది.
పుణే: వన్డే సిరీస్ చేజారిపోకుండా భారత జట్టు కీలక మ్యాచ్‌లో సత్తా చాటింది. సమష్టితత్వంతో విజయాన్ని అందుకొని సిరీస్‌ను 1–1తో సమం చేసింది. బుధవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. నికోల్స్ (62 బంతుల్లో 42; 3 ఫోర్లు), గ్రాండ్‌హోమ్ (40 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. భువనేశ్వర్ 3 వికెట్లు పడగొట్టగా... చహల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 46 ఓవర్లలో 4 వికెట్లకు 232 పరుగులు చేసింది. ధావన్ (84 బంతుల్లో 68; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (92 బంతుల్లో 64 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే ఆదివారం కాన్పూర్‌లో జరుగుతుంది.
పేసర్ల జోరు...
న్యూజిలాండ్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో భారత ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రాలదే కీలక పాత్ర. తమకు అనుకూలించిన వికెట్‌పై వీరిద్దరు 20 ఓవర్లలో 83 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు గప్టిల్ (11), మున్రో (10)లను భువీ పెవిలియన్ బాట పట్టించగా... బుమ్రా బంతికి విలియమ్సన్ (3) వికెట్ల ముందు దొరికిపోవడంతో కివీస్ స్కోరు 27/3కి చేరింది. ఈ దశలో తొలి వన్డే హీరోలు టేలర్ (21), లాథమ్ (62 బంతుల్లో 38; 2 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే పాండ్యా ఈ భాగస్వామ్యాన్ని తొందరగానే విడగొట్టాడు. గత మ్యాచ్‌లో స్వీప్ షాట్లతో భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న లాథమ్ మరోసారి అలాంటి ప్రయత్నమే చేసినా పెద్దగా సఫలం కాలేకపోయాడు. లాథమ్, నికోల్స్ కలిసి ఐదో వికెట్‌కు నెలకొల్పిన 60 పరుగుల భాగస్వామ్యమే ఆ జట్టుకు అత్యధికం. చివరకు అక్షర్ బౌలింగ్‌లో స్వీప్‌కే ప్రయత్నించి లాథమ్ బౌల్డ్ కావడంతో ఈ జోడీ విడిపోయింది. ఇలాంటి స్థితిలో నికోల్స్, గ్రాండ్‌హోమ్ మళ్లీ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు కాస్త వేగంగా ఆడి 47 పరుగులు జత చేశారు. చివర్లో సాన్‌ట్నర్ (38 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), సౌతీ (22 బంతుల్లో 25 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) రాణించడంతో కివీస్ స్కోరు 200 పరుగులు దాటగలిగింది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ స్థానంలో భారత్ అక్షర్ పటేల్‌ను తీసుకోగా... కివీస్ జట్టులో మార్పులేమీ చేయలేదు.
కీలక భాగస్వామ్యాలు...
కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (7) వికెట్ కోల్పోయింది. అయితే ధావన్, కోహ్లి (29 బంతుల్లో 29; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా చకచకా పరుగులు తీస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. గత మ్యాచ్‌లో భారత్‌ను కట్టడి చేసిన కివీస్ ప్రధాన పేసర్ బౌల్ట్ ఈ సారి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. 25, 46 వ్యక్తిగత స్కోరు వద్ద ధావన్‌కు అదృష్టం కలిసొచ్చింది. రెండు సార్లు వికెట్ కీపర్ క్యాచ్ కోసం రివ్యూ కోరగా... ఈ రెండు సార్లు కూడా ధావన్ నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించిన తర్వాత చక్కటి బంతితో కోహ్లిని గ్రాండ్‌హోమ్ పెవిలియన్ పంపించాడు. గత మ్యాచ్‌కు భిన్నంగా ఈ సారి నాలుగో స్థానంలో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగాడు. 2015 వన్డే ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు అత్యధికంగా 11 మంది వేర్వేరు ఆటగాళ్లను నాలుగో స్థానంలో ఆడించడం విశేషం! 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న శిఖర్, కొద్దిసేపటికే వెనుదిరిగాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 66 పరుగులు జత చేశారు. అనంతరం హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) కార్తీక్‌కు అండగా నిలిచాడు. 76 బంతుల్లో కార్తీక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కివీస్ బౌలింగ్‌లో పదును లేకపోవడంతో భారత్ అలవోకగా విజయం దిశగా సాగింది. చివర్లో ధోని (18 నాటౌట్)తో కలిసి కార్తీక్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.
►100 భారత్, న్యూజిలాండ్ మధ్య ఇది 100వ వన్డే మ్యాచ్. వీటిలో భారత్ 50 గెలిచి 44 ఓడింది. 1 మ్యాచ్ ‘టై’గా ముగియగా, మరో 5 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
Comments
Please login to add a commentAdd a comment